.
రెండు అంశాలు… 1) మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఎందుకు వెళ్లలేదు..? 2) అల్లు అర్జున్‌ను ఫోన్‌లో చంద్రబాబు పరామర్శించడం సబబేనా..?
ఐదారు రోజులుగా చర్చ… బన్నీ మీద కేసు, అరెస్టు అనగానే వెంటనే కేటీయార్ ఖండించాడు… ఎందుకంటే, ఏ ఆలోచన లేకుండా కాంగ్రెస్ చేసిన ప్రతి పనినీ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు, పైగా ఇండస్ట్రీతో రాసుకుని పూసుకుని తిరిగిన అలవాటు…
Ads
తీరా బన్నీ మీద జనంలో బాగా నెగెటివిటీ రావడంతో హరీష్‌రావు సంధ్య తొక్కిసలాట బాధితుడు శ్రీతేజను పరామర్శించి డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు ప్రయాసపడ్డాడు… కేసీయార్ మాటాముచ్చటా లేదు…
నంద్యాల తమ అభ్యర్థికి బన్నీ ప్రచారం చేశాడు కాబట్టి తన పార్టీ సానుభూతిపరుడే అనుకుని తప్పులో కాలేశాడు జగన్ రెడ్డి… తనకు ఏది నెగెటివ్ అవుతుందో కూడా అంచనా వేసుకోలేని స్థితిలో ఉన్నాడు… మరి చంద్రబాబు ఎందుకు బన్నీని పరామర్శించాడు..?
రాధాకృష్ణ మాటల్లో చెప్పాలంటే, అది చంద్రబాబు సిల్లీ తప్పు అట… కాదు, ఒకరకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యను, అదీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖండిస్తున్నట్టు లెక్క అది… పైగా ఇద్దరు సీఎంల నడుమ సత్సంబంధాలున్నాయి… ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్య… చివరకు తన భాగస్వామి, ఆ బన్నీ కుటుంబసభ్యుడు, తన ప్రభుత్వంతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం దూరంగా ఉన్నాడు ఈ కంట్రవర్సీకి… మరి చంద్రబాబుకు ఏమైంది..?
తన బావమరిది, మరో టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ వంటి వాళ్లే దూరంగా ఉంటున్నప్పుడు తెలంగాణ శాంతిభద్రతల వ్యవహారంలో ఎందుకు వేలుపెడుతున్నట్టు..?
పైగా అల్లు అర్జున్‌లో అణకువ, వినయం తక్కువ, మబ్బుల్లో విహరిస్తున్నాడు… తను ఓ డెమీ గాడ్ అనుకుంటున్నాడు, తండ్రి అల్లు అరవింద్‌కే మింగుడుపడటం లేదు… సక్సెస్ మీట్‌లో గానీ, తరువాత అరెస్టు అనంతర ప్రెస్‌మీట్‌లో గానీ తన పరిణతిరాహిత్యం స్పష్టంగా కనిపించింది… తొక్కిసలాట సమయంలో బాధ్యతారాహిత్యం సరేసరి,…
చివరకు అల్లు అర్జున్ దెబ్బకు ఇండస్ట్రీ బెనిఫిట్ షోలను, టికెట్ రేట్ల పెంపును పోగొట్టుకోవడమే కాదు, అదనంగా సెస్సు మోయాల్సి రానుంది… ఎందుకు…? ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై, అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి తన ఇంటి ముందు క్యూలు కట్టి, పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించినందుకు జరిమానా..!!
ఇక మన్మోహన్ విషయానికి వస్తే… వైఎస్ మరణించినప్పుడు సోనియా, మన్మోహన్ వచ్చారు… కానీ తరువాత సోనియా కక్షగట్టి మరీ జగన్‌ను నానా అవస్థలపాలూ చేసింది… ఆ కేసులు ఇప్పటికీ జగన్ నెత్తిమీద వేలాడుతూనే ఉన్నయ్…
సో, అప్పటి సోనియా టీమ్ మొత్తమ్మీద జగన్‌కు కోపం ఉండటం సహజమే,.. పైగా కాంగ్రెస్ తనకు ప్రత్యర్థి… ఐనాసరే, అన్నీ దాచుకుని తను గనుక ఢిల్లీ వెళ్లి ఉంటే తను వ్యక్తిగా ఓ మెట్టు ఎక్కేవాడు… ఎందుకంటే..? మన్మోహన్ సింగ్‌కు సోనియా సాగించిన కక్షపూరిత చర్యలతో సంబంధం లేదు… కాంగ్రెస్‌లోనే ఉన్న షర్మిల ఎందుకు వెళ్లలేదో తెలియదు…
కేసీయార్ ఎందుకు వెళ్లలేదు..? తెలంగాణ ఏర్పాటులో ప్రధానిదీ కీలక భూమికే… నిర్ణయం సోనియాదే అయినా, బీజేపీ సహకరించినా… లోకసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సహకరించినా… మొత్తం ప్రొసీజర్ పద్దతి ప్రకారం నడిచేలా చూసింది మన్మోహన్ సింగే… తన పట్ల కృతజ్ఞత చూపడం కేసీయార్ విద్యుక్త ధర్మం.,. కేటీయార్‌ను పంపడం కాదు, తనే వెళ్లాల్సింది…
ఐనా తెలంగాణ జనం ఎన్ని సమస్యలతో సతమతం అవుతున్నా సరే, తను ఫామ్ హౌజ్ వీడి రావడం లేదు… ఇన్నేళ్లు అధికారాన్ని ఓ నియంతలా అనుభవించి… తెలంగాణ సమాజం నుంచి అపారంగా సంపాదించి… ఇప్పుడు అధికారం కోల్పోగానే తెలంగాణ జనాన్ని మరిచి, తనున్నది ప్రజాజీవితంలో అని మరిచి… అజ్ఞాతంలో ఉండటం ఓ బ్లండర్… మన్‌మోహన్‌సింగ్‌కు తుది నివాళి అర్పించడానికి వెళ్లకపోవడమూ అంతే..!! కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో ఉన్నా సరే, చంద్రబాబు వెళ్లాడు… సరైన అడుగు, విజ్ఞత..!!
Share this Article