.
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అరవింద్ ని దగ్గరగా చూసిన వ్యక్తిగా చెపుతున్నా సార్, ఫస్ట్ టైం మాటలు తడబడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి ఈ రోజు ప్రెస్ మీట్ లో.., తన బలమే పీపుల్ మేనేజ్మెంట్… అటువంటి అరవింద్ తన సొంత కొడుకుని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నందుకు చాలా బాధపడి ఉంటాడు…
Ads
తను పక్కా వ్యాపారి… తనకు అందరూ కావాలి… ఎవరితోనూ వైరం వద్దు… కానీ కొడుకు బన్నీతో తొలిసారి అవస్థలు పడుతున్నట్టున్నాడు… చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ని, చివరకి రామ్ చరణ్ ని సైతం ఎన్నో వివాదాల నుంచి గతంలో గట్టెక్కించిన అల్లు అరవింద్ ఈరోజు తన సొంత కొడుకుని వివాదాల నుంచి కాపాడుకోలేకపోతున్నాడా…
అందరికీ ఇదే ఆశ్చర్యం… కొడుకుతోనే తను ఇబ్బందులు పడుతున్నట్టున్నాడు… బయటపడడు… బన్నీ ఆలోచన తీరు, వ్యవహార ధోరణిలోనే ఏదో తేడా కొడుతోంది… సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ చేసింది కరెక్టా కదా అనే లోతుల్లోకి నేను వెళ్లట్లేదు…
అక్కడ సినిమా హీరో కంటే కూడా పోలీసుల నిర్లక్ష్యమే చాలా ఎక్కువ… అది ముమ్మాటికీ సిస్టం ఫెయిల్యూర్ సార్… జరిగిన ఇన్సిడెంట్ కచ్చితంగా ఓ యాక్సిడెంట్ మాత్రమే… కానీ తదనంతర పరిణామాల్లో బన్నీ వైఖరి సరిగ్గా లేదనిపిస్తోంది… ఇండస్ట్రీ ముఖ్యులు తను ఏదో రాజ్యం బాధితుడైనట్టుగా, క్యూలు కట్టి, పరామర్శలు చేసి, ఏవేవో కూతలు కూస్తూ… రాజకీయాధికారాన్ని, చట్టాల్ని నిందిస్తున్నారు… ప్రత్యేకించి సిఎం బన్నీని అరెస్టు చేసి, ఏదో దేశ ద్రోహానికి పాల్పడినట్టుగా తిట్టేస్తున్నారు…
ఏం..? కుర్చీ మీదున్నవాడికి మాత్రం పొగరు ఉండదా..? మొత్తం ఇండస్ట్రీ ఏకమై ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు ప్రచారం జరిగేలా వ్యవహరిస్తుంటే… దొరికింది ఛాన్స్ అని ప్రతిపక్షం ఏదేదో విమర్శలు చేస్తుంటే… రాజకీయాధికారం అనుభవించేవాడికి సహిస్తుందా..? అందుకే కఠినంగా రియాక్టవుతున్నాడు… ఏదేమైనా సరే, ఏమేరకు తెగినా సరే, తగ్గేదేలే అని పుష్పరాజ్‌లాగా గడ్డం దువ్వుతానూ అంటే కుదరదు…’’ ఇదీ ఓ మిత్రుడి నిశిత విశ్లేషణ తాజా పరిణామాలపై…
ప్రెస్‌మీట్ పెట్టేసి… లీగల్ ఇబ్బందులు కాబట్టి శ్రీతేజ్‌ను హాస్పిటల్‌లో పరామర్శించలేదు, పోలీసులే బందోబస్తు చేశారు, పర్మిషన్ ఇచ్చారు, నేను ర్యాలీ తీయలేదు అని గంట లేటుగా వచ్చి చెప్పాడు, ప్రశ్నలకు నో చాన్స్… మీరు అడిగేది ఏమిటి, నేను చెప్పేదేమిటి… చెప్పింది రాసుకొండి, ఇక వెళ్లండి అన్నట్టుగా వెళ్లిపోయాడు… మరి కోర్టులో కేసు ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ ఎందుకు చెబుతున్నట్టు..? శ్రీతేజ్ వద్దకు మాత్రం వెళ్లడానికి లీగల్ ఇష్యూస్ అడ్డం వచ్చాయా..?
నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌నే గంటల్లో కూల్చిపారేసింది రాజకీయాధికారం… పొగరు ఇంటి పేరైన ఆ మోహన్‌బాబునే మెడలు వంచింది సిస్టం,… పాలకుడు బుల్‌డోజర్ ఎక్కాడంటే ఎక్కడివరకైనా వెళ్తాడు… చాన్స్ దొరికితే ఇంకా కఠినంగా వ్యవహరిస్తాడు… ఖచ్చితంగా ఆరోజు సంధ్య థియేటర్ వద్దకు బన్నీ వెళ్లడం తప్పు… తప్పున్నర… కానీ కాస్త హంబుల్‌గా గెటాన్ అయ్యే ఆ లౌక్యం లోపించింది…
బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు బన్నీ మొహం చూసి ఇవ్వలేదు పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి… అవి నిర్మాతలు సాధించుకున్నారు… నాగబాబు, చిరంజీవి ఇళ్లకు వెళ్లాడు బన్నీ… కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఈరోజుకూ తనకు టైమ్ ఇవ్వలేదు… అంటే ఎక్కడో బన్నీ అడుగుల్లోనే భారీ తేడా కొడుతున్నట్టుంది… మెగా మర్రిచెట్టు నీడ నుంచి బయటపడి సొంతంగా ఎదగాలనే ఆలోచనలో తప్పులేదు… కానీ వేసే ఆ అడుగులు ఎలా ఉన్నాయనేదే ముఖ్యం…
ఒక్క బన్నీ కారణంగా ఇప్పుడు తెలంగాణలో… తెలుగు సినిమాలకు ప్రధాన మార్కెట్ హైదరాబాదులో మిగతా నిర్మాతలు, ఇండస్ట్రీ మొత్తం నష్టపోయే దురవస్థ… పుష్ప, పుష్ప2 సినిమాలతో నేనెక్కడికో వెళ్లిపోయాను, ఇక నన్నెవడూ ఏమీ చేయలేడు, నేను సుప్రీం అన్నట్టుగా వ్యవహరిస్తే…… ఓ టైమ్ వస్తుంది, అప్పుడు టైమ్ మన చేతుల్లో ఉండదు… అవునూ, జాతీయ అవార్డు వస్తే చాలు, ఇక ఏం చేసినా బారా ఖూన్ మాఫ్ అన్నట్టేనా… చట్టాలు వర్తించవా… అన్నింటికీ మించి మానవీయ ధోరణి వదిలేసుకున్నా సరేనా..?!
చివరగా… ఒక జోక్ చెప్పుకుని ముగిద్దాం… తెలుగు వారి ఖ్యాతిని పెంచేందుకు అల్లు అర్జున్ సినిమాలు చేస్తున్నాడట… తనే చెప్పాడు ప్రెస్‌మీట్‌లో… అవును, రష్మికతో ఆ వెగటు సీన్లు, వెకిలి డాన్సులు, ఓడ మీద పిచ్చి ఫైట్లు… పుష్పలో ప్రతి సీనూ తెలుగువారి ఖ్యాతిని అమితంగా పెంచేదే… ఫాఫం, ఈ ఖ్యాతి పెంచే పనిలో పైసా పారితోషికం కూడా తీసుకోలేదనీ చెబుతాడు రేప్పొద్దున మళ్లీ అవసరమైతే…
చెప్పేవాడికి వినేవాడు లోకువ… రాసుకునేవాడు మరీ లోకువ… తీసేవాడికి చూసేవాడు ఇంకా లోకువ… ఈ హీరోలు దేవుళ్లని నమ్మే మూర్ఖాభిమానులు లోకానికే లోకువ..!! తత్వం బోధపడే టైమ్ వచ్చినట్టుంది సారుకు..!!
Share this Article