710 థియేటర్ల నుంచి రెండోవారానికే 300 థియేటర్ల పడిపోయింది గాడ్ ఫాదర్ సినిమా, వీక్ డేస్ మొత్తం డ్రాప్స్ కనిపిస్తూనే ఉన్నాయి, నైజాంలో డ్రాప్స్ ఎక్కువ అని రాసుకుంటూ వచ్చాడు ఓ కలెక్షన్ల సైటువాడు… పాపం, మొదట్లో తను కూడా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ముద్రలేసినవాడే… ఉమైర్ సంధూ అనబడు ఓ వింత రివ్యూయర్ గాడ్‌ఫాదర్ ఫ్లాప్ అని ఏదో ట్వీటాడుట… కొన్ని సైట్లు (టైమ్స్ అనువాద సైటుతోసహా) ఒరే ఫేక్ కుక్కా, దరిద్రుడా, నువ్వు మారవా అని స్టోరీలు రాసిపడేశాయి… నిజం, అదే భాష, అవే హెడింగులు…
తరువాత ఫిలిమ్ క్రిటిక్ అసోసియేషన్ చిరంజీవిని కలిసిందట… వాళ్లు గాడ్‌ఫాదర్ సక్సెస్ పట్ల అభినందనలు చెప్పారట… చిరంజీవి అంటే వీరాభిమానం ఉన్న క్రిటిక్స్ పెట్టుకున్న సంఘమేమో… లేకపోతే ఒక హీరోకు ప్రత్యేకంగా ఒక సినిమా సక్సెసైందని తన ఇంటికి వెళ్లి మరీ బొకేలు ఇచ్చి, సెల్ఫీలు దిగడం ఏమిటి..? ఇతర హీరోలు, ఇతర హిట్స్ కు ఈ సంప్రదాయం వర్తిస్తుందా…? ఆ రివ్యూలు బయాస్డ్‌గా గాకుండా ఇమ్‌పార్శియల్‌గా ఎలా ఉంటయ్…? సరే, ఆ చర్చ ఇక్కడ అవసరం లేదు గానీ…
ఎప్పుడైతే నిర్మాత తెరమీదకు వచ్చి, మేం సినిమాను ఎవరికీ అమ్మలేదు, మస్తు వసూళ్లు వస్తున్నయ్ అని చెప్పాడో మొదటిసారి ఈ సినిమా సక్సెస్ ఫిగర్స్ మీద డౌట్స్ స్టార్టయ్యాయ్… చిరంజీవి హీరోగా ఉన్న సినిమాకు సంబంధించి నిర్మాత మీడియాను అడ్రెస్ చేయడమా..? కావాలని ప్రవేశపెట్టారు… సల్మాన్ ఉన్నాసరే హిందీలో ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు… పొన్నియిన్ సెల్వన్, కాంతారాల దెబ్బకు ఇతర సౌత్ భాషల్లో లైట్… ఇక తెలుగు ప్రేక్షకులే ఆధారం… మొన్న పెద్ద సందర్భం కూడా ఏమీ లేకుండా చిరంజీవే మాట్లాడాడు మీడియాతో… (ఫాఫం, గరికపాటిని అత్యంత ఔదార్యంతో క్షమించింది కూడా అందులోనే…)
Ads
ఆచార్య డిజాస్టర్ కాబట్టి గాడ్‌ఫాదర్ సక్సెస్ అనిపించాల్సిందే అని ఓ ప్రయత్నం… మార్కెటింగ్ కోణంలో తప్పులేదు… కానీ చిరంజీవికి ఓ ఆత్మమథనం కూడా అవసరం… ప్రేక్షకులు బిల్డప్పులు కోరుకుంటున్నారా..? భిన్నమైన, కొత్తతరహా కథలు, కథనాలను కోరుకుంటున్నారా..? అందులో తనెక్కడ..? సరే, అది తన ఇష్టం… వరుసగా ఇంకో నాలుగు సినిమాల్ని వదులుతా అంటున్నాడు కాబట్టి ఓ సెల్ఫ్ రివ్యూ అవసరం తనకు…
మొన్న ఎక్కడో 4 రోజుల్లోనే 143 కోట్ల వరల్డ్ గ్రాస్ అని ఓ లెక్క కనిపించింది… సరే, సినిమాల పబ్లిసిటీ కలెక్షన్లు అలాగే ఉంటాయి అనుకుని, ఈరోజు సాక్‌నిక్ వాడి సైట్ చూస్తే వరల్డ్ వైడ్ కలెక్షన్లు 93.22 కోట్లు అనీ, ఇండియాలో నెట్ 68.11 కోట్లు అనీ కనిపించింది… పదకొండోరోజు హైదరాబాద్‌లో 278 షోలు నడుస్తున్నాయని రాసుకొచ్చాడు… సరే, ఎలాగోలా ఈ వీకెండ్, ఈ వీక్ నడిపిస్తారులే అనుకుంటే… ఎలాగూ పెద్దగా హిట్టయిన సినిమాలేవీ పోటీలో లేవు కదా అనుకుంటే… సొంత బావమరిదే ఓ సినిమాను పోటీగా తీసుకొచ్చి పెట్టాడు…
గాడ్‌ఫాదర్ చిరంజీవి సొంత సినిమా (ప్లస్ మరో చిన్న నిర్మాత ఉన్నట్టున్నాడు)… అందుకని అల్లు పెద్దగా పట్టించుకోవడం లేదు… అంతేకాదు, ఇప్పుడు కన్నడనాట సంచలనం సృష్టిస్తున్న కాంతారా తెలుగు వెర్షన్‌ను అల్లు అరవింద్ శనివారం రిలీజ్ చేశాడు… సహజంగానే అల్లు అరవింద్ ఎగ్జిబిటర్స్ సిండికేట్ మెంబర్ కదా… ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని… ఒకవేళ తెలుగు అనువాదం తెలుగు ప్రేక్షకులకు కనెక్టయితే ఆ దెబ్బ గాడ్ ఫాదర్ మీద పడటం ఖాయం… ఐనాసరే, బావ సినిమా మీద ఈ పిడుగు ఏమిటి అల్లూ భాయ్…
నిజానికి కాంతారా సినిమా నచ్చకపోవడం అనే సమస్యే లేదు… అందులో సూపర్ హీరోయిజాలు లేవు, బిల్డప్పులు లేవు… అదొక క్లాసిక్, అంతే… ప్రత్యేకించి చివరి 20 నిమిషాలు థియేటర్లలో పూనకాలే… అయితే కన్నడ ప్రేక్షకులకు పట్టుకున్నంతగా సగటు తెలుగు జనానికి పడుతుందా అనేది చిన్న డౌట్… ఎందుకంటే మనజనం వేపాకు నమిలీ నమిలీ అదే పూతరేకు అనుకునేలా ఫ్రేమయిపోయారు… వాళ్లకు వేడి కడక్ జిలేబీ పెట్టినా విసిరేస్తారు, థూ చేదు అంటూ…! అదే జరిగితే గాడ్‌ఫాదర్ కాస్త సేఫ్… ఇప్పట్లో మరో సినిమా పోటీలేదు… ఒకవేళ కాంతారా తెలుగు జనానికి పట్టేస్తే మాత్రం…? జవాబు అల్లు అరవింద్ చెబుతాడు…
Share this Article