అయిపోయింది… ఎన్‌డీఏ క్యాంప్ నుంచి మరో మిత్ర పార్టీ జంప్… నిజానికి స్థూలంగా చెప్పాలంటే ప్రస్తుతం ఎన్‌డీఏ అంటే బీజేపీ మాత్రమే అన్నట్టుగా మారిపోయింది… ఎస్… ఏక్‌నిరంజన్…! అవసరం కోసమో, అధికారం కోసమో, భయమో, నిర్బంధమో, ఇంకా ఏ కారణమైనా కావచ్చుగాక… కొన్ని పార్టీలు బీజేపీకి పలు అంశాల్లో మద్దతునిస్తున్నాయి… కానీ నమ్మకమైన మిత్రుడు ఎవరున్నారు ఇప్పుడు..? ఎవరు మిగిలారు ఇప్పుడు..? బలమైన పార్టీలు ఎవరూ లేరు…
అటువైపు యూపీఏలో కనీసం స్టాలిన్ వంటి బలమైన మిత్రపక్షం కనిపిస్తోంది… అవసరమైతే యాంటీ-బీజేపీ స్టాండ్‌తో మమత కలిసిరావచ్చు… ఆర్‌జేడీ, ఎన్సీపీ, శివసేన, జేఎంఎం కూడా మిత్రులే… ఈ కోణంలో చూస్తే బీజేపీ ఒక నమ్మకమైన పెద్దన్నలా వ్యవహరించలేకపోతున్నదా..? లేక బీజేపీయే ఆడుతున్న పాచికలాటలో కనిపిస్తున్న పరిణామాలేనా ఇవన్నీ…
బీహార్‌ను కాసేపు వదిలేయండి… అసలు నితిశ్ స్నేహమే చంచలం… బీజేపీతో పొత్తు, అంతలోనే బ్రేకప్… ఇప్పుడేమీ కొత్తకాదు… గతంలోనూ జరిగిందే… ఆర్జేడీతో దోస్తీ కూడా పాత అనుభవమే… ఎటొచ్చీ ఇప్పుడు ఆర్జేడీతో కలిస్తే, ఆల్‌రెడీ ఆర్జీడీతో కాంగ్రెస్ పొత్తు కాబట్టి… నితిశ్ జేడీయూ కూడా కాంగ్రెస్‌తో అనివార్యంగా చేతులు కలపాల్సిందే… మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీతోపాటు కాంగ్రెస్‌ను చేరదీయకతప్పనట్టు..!!
Ads
రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసం, ఒంటరిగానే బలపడాలనే స్వార్థం కోసం బీజేపీ ఆడుతున్న ఆటలో నితిశ్ కిందపడిపోకుండా… ఇలా ఆర్జేడీని చేతికర్రలా వాడుకుంటున్నాడా..? లేక బీజేపీతో కలిసి రాబోయే ఎన్నికల్లో సాగితే నష్టపోతాననే భయం కొద్దీ ఆర్జేడీ, కాంగ్రెస్‌తో తనే చేతులు కలుపుతున్నాడా..? (గత ఎన్నికల్లోనే నితిశ్ పార్టీ చాలా పూర్ పర్‌ఫామెన్స్… ఆర్జేడీ, బీజేపీలకన్నా తక్కువ సీట్లు వచ్చాయి… ఐనా బీజేపీ తననే సీఎంగా కొనసాగించింది…)
ఎన్‌డీఏ విషయానికొద్దాం… నో డౌట్… ఏ మిత్రుడి సపోర్టూ అవసరం లేని పరిపూర్ణ మెజారిటీని గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా సాధించింది… వచ్చే ఎన్నికల్లోనూ సాధించవచ్చు బహుశా… చెప్పలేం… కానీ ఎన్డీఏలో ఎందరు మిగులుతున్నారు..? స్నేహితులను కాపాడుకోవడంలో తన విశ్వసనీయతను కోల్పోతోందా..? 2018 నుంచి చూద్దాం… తెలుగుదేశం ఔట్… సరే, అందులో చంద్రబాబుదే తప్పు… యూపీఏ అధికారంలోకి వస్తుందని నమ్మి, కాంగ్రెస్‌కు మస్తు సాయం చేసి, కూటమి చక్రాలు తిప్పి.., చివరకు తనకే మెయిన్ యాక్సెల్ విరిగిపోయింది…
ఆమధ్య అకాలీదళ్ విడిపోయింది… పంజాబ్‌లో పెరిగిపోతున్న ఖలిస్థానీ శక్తుల ప్రభావంతో వ్యవసాయ బిల్లుల సాకు చూపి జంప్ అయిపోయింది… ఇందులోనూ బీజేపీని నిందించడానికి పెద్దగా ఏమీ లేదు… బీజేపీని విడిచిపెట్టి అకాలీదళ్ సాధించింది, కాపాడుకున్నది కూడా ఏమీలేదు… పైగా యుద్ధక్షేత్రాన్ని చేజేతులా ఆప్‌కు అప్పగించడంలో తనూ సాయపడినట్టయింది… ఇక మహారాష్ట్రలో శివసేన… అధికారం కోసం మాత్రమే శివసేన బీజేపీని వదిలేసి, ఎన్సీపీ-కాంగ్రెస్‌తో ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా చేతులు కలిపింది…
మొన్నామధ్య బీజేపీ సంధించి వదిలిన ఏకనాథ్ షిండే అనే మిసైల్‌కు శివసేన కుప్పకూలింది… అది వేరే సంగతి… ఇప్పుడు బీహార్‌లో నితిశ్ వెళ్లిపోయాడు… ఇక్కడ బీజేపీ డబుల్ గేమ్ కూడా కొంత స్నేహాన్ని చెడగొట్టినట్టుంది… గత ఎన్నికల్లో జేడీయూకే కేటాయించిన సీట్లలో లోక్‌జనశక్తి నుంచి బీజేపీ రెబల్స్‌ను నిలబెట్టి, ఓడించారనే కుతకుత నితిశ్‌లో ఉంది… దీన్ని చిరాగ్ మోడల్ అంటారు… (లోక్‌జనశక్తి లీడర్ చిరాగ్)… ఇతర కారణాలు కూడా కొన్ని తోడై మరీ ఈమధ్య బీజేపీ, జేడీయూల నడుమ సంబంధాలు అస్సలు బాగాలేవు… చివరకు పొత్తు చిత్తయ్యింది… (ది గ్రేట్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏదో పొడిచేస్తాను బీహార్‌లో అన్నాడు… సొంత ఊరు కదా… ఏమైందో మరి… మళ్లీ పత్తాజాడ లేడు…)
ఇప్పుడిక ఎన్‌డీఏలో బీజేపీతో ఉన్నవాళ్లు ఎవరు..? శివసేన రెబల్ గ్రూపు… అన్నాడీఎంకే… ఇందులో శివసేన పేరు, ఎన్నికల గుర్తుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నయ్… అన్నాడీఎంకే నానాటికీ బలహీనపడిపోయింది… తటస్థుల జాబితాలో ఉన్న కేసీయార్ దూరమైపోయాడు… కశ్మీర్‌లో పీడీపీ దగ్గర నుంచి తెలంగాణలో కేసీయార్ దాకా… అందరూ దూరమైనవాళ్లే తప్ప ఎన్‌డీఏలోకి కొత్తగా జతచేరినవాళ్లు ఎవరూ లేరు… మిగిలినవాళ్లలో బలమైన స్నేహితులు కూడా ఎవరూ లేరు..!!
Share this Article