.
ఇక బడిలో తెలుగు మీడియం కనిపించదేమో… ఇప్పటికే లేశప్రాయం… నమస్తే తెలంగాణలో కనిపించిన ఓ స్టోరీ ఆసక్తికరంగా అనిపించింది… ముందుగా ఆ వార్త సారాంశం చదవండి…
తెలుగు మీడియం చదువులకు స్వస్తి! ప్రైవేటులో తెలుగు మీడియం 0.48 శాతమే… క్రమంగా తగ్గిపోతున్న తెలుగు మీడియం… అదే బాటలో సర్కారు బడులు…
Ads
తెలంగాణ రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థుల వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది… పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించేందుకే తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చుతున్నారు… ముఖ్యంగా ప్రైవేట్ బడుల్లో… తెలుగు మీడియం విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటున్నారు.
రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో మొత్తం 36.19 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో తెలుగు మీడియం కేవలం 17,329 (0.48 శాతం) మాత్రమే… (వార్తకు సోర్స్ ఏమిటో ఆ పత్రిక చెప్పలేదు కానీ… ఒకరకంగా రాబోయే రోజుల్లో ఇక తెలుగు మీడియం ఉండదు అని చెప్పవచ్చు…)
రాష్ట్రంలో ప్రైవేట్ బడుల్లోనే కాదు… సర్కారు, ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం హవానే నడుస్తున్నది… సర్కారు బడుల్లో మొత్తం 22.42 లక్షల మంది విద్యార్థు లుంటే 17.65 లక్షలు (78.75శాతం) ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు… మరో 3.51 లక్షలు (15.66 శాతం) మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులున్నారు…
(ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి… పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో మగ పిల్లల్ని ఖర్చు పెట్టి మరీ ప్రైవేటుకు, ఆడపిల్లల్ని ఉచితంగా సర్కారు బడికి పంపిస్తున్న ఓ ధోరణి చాన్నాళ్లుగా ఉంది… ఇది మగ, ఆడ వివక్ష… ప్లస్… మగవాడు బాగా చదివి మంచి కొలువు సంపాదించి తమను ఉద్దరిస్తాడని ఆశ… ఆడ పిల్ల ఎలాగైనా వేరే ఇంటికి పోవాల్సిందే కదానే భావన…)
ఎయిడెడ్ స్కూళ్లలో మొత్తం 59,140 మంది విద్యార్థులు చదువుతున్నారు… వీరిలో 45,054 (76.18శాతం) ఇంగ్లిష్ మీడియం వారు కాగా, 8,420 (14.24 శాతం) తెలుగు మీడియం వారున్నారు… మిగిలిన వారు ఉర్దూ, కన్నడ, మరాఠీ, హిందీ, తమిళ మీడియంలలో చదువుతున్నారు…
- నిజమే… అయ్యో, అయ్యో, మన తెలుగు…, మన మాతృభాష, పిల్లలకు ప్రాథమిక చదువు మాతృభాషలోనే బాగా అబ్బుతుంది అనే వాదనలు, భావనలు పత్రికల్లో వ్యాసాలు రాసుకోవడానికి మాత్రమే పరిమితం… సమాజాన్ని మార్కెట్ నిర్దేశిస్తుంది… అది సత్యం…
కాస్తోకూస్తో ఇంగ్లిష్ నేర్చాం కాబట్టే గ్లోెబల్‌గా మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తున్నారు, బతుకుతున్నారు… ప్రపంచం మొత్తం మన వాళ్లకు ద్వారాలు తెరిచింది… దేశంలో కూడా అన్ని రంగాల్లోనూ కాస్త ఇంగ్లిష్ చదవడం, రాయడం, మాట్లాడటం తెలిస్తేనే బతుకు, కొలువు…
- ఇది మేధావులకన్నా పేరెంట్స్‌కు ఎక్కువ తెలుసు… అలాగని తెలుగు మీద ప్రేమ లేక కాదు… ఇంట్లో తెలుగు, వ్యవహారంలో, కొలువులో, చదువులో ఇంగ్లిష్… ఇప్పుడు మేధోసమాజం కూడా చెబుతున్నదీ, ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొస్తున్నదీ అదే… మాతృభాష ఓ సబ్జెక్టు… మిగతాదంతా ఇంగ్లిష్… అంతే…
తమిళం, కన్నడం, మరాఠీ భాషోన్మాదం… దూకుడు, దాడులు… అన్ని రాష్ట్రాలపై హిందీని రుద్దాలనే నార్తోన్మాదం కథలు వేరు… నిజంగానే అది ఉన్మాదం… అది ఉద్వేగం కాదు… నిత్య వ్యవహారంలో కేవలం రాష్ట్రాల భాషే అనే భావనే, లేదంటే తంతాం అనే పోకడ భారతీయ సమాజ ఐక్యతకే మంచిది కాదు… పిటీ, చెన్నె. బెంగుళూరులకు ఆ సోయి లేదు..!!
- మరి మాతృభాష సంగతేమిటీ అంటారా..? అది ఇంటి భాష, అది ఒంటి భాష… మన అమ్మ భాషగా పదిలంగా కాపాడుకుందాం… ప్రపంచంలో ఏ పోటీకైనా సై అనేలా పరభాషల్నీ ఒంటపట్టించుకుందాం..!! ఇది యాంటీ సెంటిమెంట్ కాదు… రియాలిటీ..!!
Share this Article