.
అమ్మ సిన్నబోయి కూసుంది ! ( యథార్థ సంఘటన )
దసరా సెలవులు రావడంతో పట్నంల ఉన్నోళ్ళు అందరూ సొంత ఊళ్లకు వచ్చిండ్రు. అందరి ఇండ్లు సందడిగా మారాయి. ఆడపిల్లలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మలను తీసుకుని వెళుతున్నారు. ఆ ఇంట్లో మాత్రం కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్లు రాలేదు. అమ్మ ఒక్కతే బీరిపోయి ఉంటోంది.
Ads
పిల్లలకు సెలవులు వచ్చినా పండగకు రాకపోవడంతో గుండెల నిండా బాధను దిగమింగుకుంటూ ఉంది. దసరా పండుగకు కోడళ్ళని, మనవరాళ్ళని తోలుకుని రమ్మని కొడుకులకి ఫోన్ చేసి బతిమాలింది. సరైన స్పందన రాలేదు. ఇరుగుపొరుగు వాళ్ళు కొడుకులు రాలేదా అంటుంటే ఏదో సమాధానం చెబుతోంది. లోపల మాత్రం బాధ, పుట్టెడు దుఃఖం ఉన్నా బయట పడకుండా జాగ్రత్త పడుతోంది.
పండుగ రేపటి దాకా అదే పరిస్థితి. తెల్లారితే పండుగ. కులం వాళ్ళు మేకలు కోసి పాళ్లు వేసేందుకు కుటుంబాల సంఖ్య లెక్కించిండ్రు. ఎందుకైనా మంచిదని ఆమె ఇంటికి వెళ్లి అరుసుకున్నరు. కొడుకులు వచ్చేది నమ్మకం లేదు. ఏం చెప్పాలో తెలియదు. కులపొల్ల ముంగిట పలుచన కావద్దని, పొద్దున వస్తుండ్రు గని కోడళ్ళు శనివారం మాంసం తినరు అనే అబద్ధం చెప్పి తప్పించుకుంది. సరే అని వాళ్ళు పాళ్ళ లెక్కలలో జమ చేయలేదు.
అమ్మకు దుఃఖం ఆగుతలేదు. డోర్ వేసుకుని సోకం పెట్టింది. ఎత తీరేదాకా ఏడ్చింది. అప్పుడే పెద్ద కొడుకు ఫోన్ జేసిండు. కొడుకు మాట వినగానే అమ్మకు ఎంతో ఆనందం కలిగింది. కొడుకు వస్తనని ఫోన్ చేస్తున్నడు అనుకుంది. ‘ఒక్క రోజుకి పోవుడు ఎందుకు అని కోడలు అంటోంది. నాకు గూడ పని ఉంది. పిల్లలు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయిండ్రు ‘ అన్నడు.
తల్లి గుండె మరింత భారంగా మారింది. అమ్మా అంటుంటే తల్లి గొంతు జీరబోయి, ‘ ఎవలు రాకుంటే ఎట్ల బిడ్డ అందరి ఇండ్లల్ల కొడుకులు, కోడళ్ళు వచ్చిండ్రు. మీరేమో రాక పోవడితిరి ‘ అని దీనంగా మాట్లాడింది. ‘ మన పక్కింటి రమేష్ కు చెప్పిన. చికెన్ తెచ్చి ఇస్తడు. వండుకో అమ్మ ‘ అన్నడు. ‘ చికెన్ వద్దు. ఏమీ వద్దు. మీ అయ్య సుఖంగా పోయిండు. నాకు సావన్న రాకపాయే ‘ అని ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది.
కొద్దిసేపటి తరువాత చిన్నోడి ఫోన్ వచ్చింది. ‘ పండుగకు కోడలు అవ్వగారింటికి పోయింది. నేను ఒక్కన్ని ఏం రావాలని అనుకున్న అమ్మ ‘ అంటుంటే తల్లికి పట్టరాని కోపం, బాధతో ‘ మిమ్ములను కని పాపం జేసిన. నేను సచ్చినా రాకుండ్రి ‘ అని ఫోన్ పేట్టేసింది. తినాలంటే కూడా మనసు ఒప్పలేదు. ఏడ్చుకుంటనే ఉన్నది. నిద్ర వస్తుండగా ఇన్ని నీళ్ళు తాగి మంచం మీద తలవాల్చింది.
పొద్దున్నే అందరి ఇళ్ళల్లో సందడి కనబడుతుంది. ఒక్క ఆ తల్లి ఇంట్లో మాత్రం నిశ్శబ్దం ఆవహించింది. పొద్దున లేచి వాకిలి ఊడ్చింది. రాత్రి తినక పోవడంతో నీరసంగా ఉంది. అందరి ఇళ్ళలో మాంసం వండుకుంటున్నరు. తనకి ఆకలి అవుతోంది. వంటింట్లోకి వెళ్ళింది. రెండు ఉల్లిగడ్డలు కోసి పొయ్యి మీద వేసింది. రెండు కోడి గుడ్లు కొట్టి పోసింది. కరెంటు పొయ్యి మీద అన్నం ఉడికింది. పది గంటలకే కూర్చుని టీవీ చూస్తూ అన్నం తిన్నది. బయట అరుగు మీద కూర్చుంటే కొడుకులు రాలేదని అందరూ అడుగుతారని ఇంట్లోనే ముభావంగా ఉండిపోయింది.
పండుగ పూట మాట్లాడదామని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక్కసారిగా తన గుండెల్లో దాగి ఉన్న దుఃఖం తన్నుకు వచ్చింది. కొడుకులు ఫోన్ చేసి చెప్పిన విషయాల్ని చెప్పుకుంటూ ఏడ్చింది. మీరు నయం బిడ్డ ప్రతీ పండుగకు వస్తారు. మా ముండకొడుకులకి ఇంత గూడ బుద్ధి లేకపాయే. పెండ్లాల మాట ఇనుకుంట అత్తగారింటికి తిరుగుతున్నరు. పండుగ పూట అవ్వ దగ్గరికి పొదామనే సోయి లేదు. అంటూ తన ఆవేదనని వ్యక్తం చేసింది.
పండుగ పూట నేనొచ్చి నిన్ను బాధ పెట్టిన అంటుంటే, అయ్యో బిడ్డ, నువ్వు ఇంటి దాకా వచ్చినవు. చాయ్ అన్న ఇయ్యక పోతి అంటుంటే వద్దులే అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాను…. (వేణుగోపాలాచారి సేపూరి ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరణ)
Share this Article