మామూలుగా దిష్టిదోషం, అనగా దృష్టిదోషం నివారణకు ఏం చేస్తారు..? గతంలో పర్టిక్యులర్‌గా ఏమీ చేయకపోయేవారు… తరువాత కాలంలో భూతం, రాక్షస, పిశాచ బొమ్మల్ని ఇంట్లో లేదా ఇంటి బయట గోడల మీద వేలాడదీయడం ప్రారంభమైంది… నరుడి దృష్టి పోవడానికి కాదు, విరుగుడూ కాదు, జస్ట్, దృష్టిని మరల్చడానికి…
అందమైన మొహం మీద ఓ నల్లచుక్క పెట్టడం ఇప్పుడు ఫ్యాషన్ కావచ్చుగాక, కానీ అది స్టార్టయిందే దృష్టిదోష నివారణగా… పచ్చటి ఛాయపై నుంచి నల్లటి మచ్చ మీదకు నరుడి దృష్టి మళ్లడమే దాని ఉద్దేశం… విరగకాసిన తోటలు, నిండుగా పండిన పంటల నడుమ కూడా దిష్టి బొమ్మలు పెడతారు… అఫ్‌కోర్స్, పిట్టలు ఎవరో ఉన్నారనుకుని పంట మీదకు రాకపోవడం కూడా ఓ ఉద్దేశం…
ఈమధ్య చాలా కొత్త పోకడలు కనిపిస్తున్నయ్ ఈ దిష్టి బొమ్మల విషయంలో… పర్టిక్యులర్‌గా హైదరాబాద్‌లో,.. పాత టైర్లను బిల్డింగ్ ఎలివేషన్ మీద నుంచి దృష్టి మళ్లించేలా వేలాడదీయడం… నిజంగానే మంచి ఎలివేషన్‌కు అవి దిష్టిచుక్కల్లా కనిపిస్తయ్… కొందరేమో అలోవీర (కలబంద) మొక్కను లేదా నాలుగైదు ఆకుల్ని ప్రధాన ద్వారం దగ్గర వేలాడదీస్తున్నారు… ఇంకొందరైతే ఈ ఆకులు, మొక్కలు వేలాడదీయడం దేనికి అనుకుని ఏకంగా ప్రధాన గేటుకు ఉండే పిల్లర్‌పై కుండీ పెట్టి అలోవీరా పెంచేస్తున్నారు… ఫరెవర్ దిష్టి దోష నివారణ అన్నమాట… గుమ్మడి కాయ ఏనాటి నుంచో ఉన్నదే…
Ads
జియో వాడి చీప్ బ్రాండ్ బ్యాండ్ పుణ్యమాని యూట్యూబ్ వీక్షణల సంఖ్య విపరీతంగా పెరిగింది కదా… యూట్యూబ్ వీడియోల ద్వారా రెవిన్యూ కూడా వస్తోంది అనేకమందికి… దాంతో ఎవడుపడితే వాడు, ఏదిపడితే అది వీడియోల్లో కుమ్మేసి, వాళ్ల పైత్యాన్ని కక్కేసి జనం మీదకు వదులుతున్నారు… అందులో వాస్తు సలహాలు, దిష్టిదోష నివారణలు కూడా… గరికపాటి వంటి ప్రవచనకారులు సైతం ఈ వాస్తు పైత్యాల్ని, దిష్టిదోష నివారణ వేషాల్ని స్పష్టంగా తిరస్కరిస్తున్నా సరే రోజురోజుకూ పెరుగుతున్నాయి తప్ప పోవడం లేదు…
సాధారణంగా వినాయకుడి బొమ్మను వీథిపోటు ఉన్న ఇళ్ల యజమానులు ఆ వీథికి ఎదురుగా ఉండే తమ ఇంటి గోడలపై పెడుతుంటారు… ఇది విరుగుడు ఏమీ కాదు, కాకపోతే కాస్త ఉపశమనం… (వీథి పోట్లకు కూడా వీథి దిశలను బట్టి మినహాయింపులు, సడలింపులు ఉన్నాయండోయ్…) హఠాత్తుగా ఓ వ్యాపార సంస్థ (కొత్త రెస్టారెంట్) బిల్ కౌంటర్ మీద తెల్లటి పదార్థం ఒకటి కనిపించింది… పటికలాగా అనిపించింది… ఇదేమిటండీ అనడిగితే పటిక అన్నాడు… దాదాపు కిలో బరువు ఉంటుంది…
అమాయకంగా ఎందుకు అనడిగితే… దిష్టిదోషం పోవడానికి అన్నాడు… ముందు వైపు చూపించాడు… రెస్టారెంట్‌లోకి అడుగు పెట్టే ద్వారం పైన సేమ్, అంతే పరిమాణంలోని పటిక వేలాడదీసి ఉంది… అదీ అందుకేనట… తీరా యూట్యూబ్‌లో చూస్తే అది వాస్తు దోషాల నివారణకు, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు కూడా ఉపయోగకరమని తేల్చారు కొందరు వాస్తు పండిత మణులు… వాస్తవంగా వాస్తు ఏమిటో, దిష్టిదోషం ఏమిటో తెలియదు గానీ పటిక సమర్థ నీటి శుద్దీకరణి…
బిందెలో పటిక ముక్క వేస్తే నీళ్లలోని బురద పార్టికల్స్ అన్నీ కింద పేరుకుంటాయి… సేమ్, చిల్ల గింజల్లాగే… రెంటికీ ఔషధ గుణాలున్నయ్… కలబందలాగే… ఇప్పుడవన్నీ దిష్టి, వాస్తు నివారణ పరికరాలు అయిపోతున్నయ్… కొందరు ఆమధ్య చైనా వాస్తుకు సంబంధించి ఫెంగ్ షూయ్ బొమ్మల్ని పెట్టేవాళ్లు… ఇప్పుడవి తగ్గిపోయినట్టు కనిపిస్తోంది… నరుడి దృష్టి నిజంగానే అంత ప్రమాదకరమైతే ఈ చిన్న చిన్న చిట్కాలతో పోతుందా..? మన పిచ్చి గానీ…!! ఈమధ్య గృహప్రవేశాలకు వాస్తుపురుషుడి పూజ అని చేయిస్తున్నారు… వాస్తు పురుషుడు అనే పాత్ర గురించి ఏ పురాణమూ చెప్పలేదు… మీరు ఏమంటారు గరికపాటి వారూ…!!
Share this Article