నితిశ్ ఓ పాము… పాము తరచూ కుబుసం విడిచినట్టే, ప్రతి రెండేళ్లకు నితిశ్ కొత్త కుబుసం ధరిస్తాడు… ఈమాట ఎవరో అన్నది కాదు… 2017లో లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ట్వీట్ ఇది… బీహార్ సీఎం నితిశ్ రాజకీయాల గురించి ఇంతకుమించి ఎవరూ చెప్పలేరు… పైగా ఇప్పుడు అదే నితిశ్ అదే లాలూ కొడుకు తేజస్వి యాదవ్ అనే కొత్త చర్మాన్ని ధరించి, కొత్త కిరీటం పెట్టుకుంటున్నాడు… ఏళ్లుగా బీహార్ పాలకుడు తను… కానీ రాష్ట్రం మాత్రం అదే బీమారు రాష్ట్రం…
దేశంలో ఎక్కడ కూలీలనైనా అడిగి చూడండి, బీహార్ అని చెబుతారు… ఎక్కడ పనిదొరికితే చాలు, అక్కడ టెంట్లు వేసుకుని ఉండిపోతారు… పేదరికానికి, వలసలకు, నిరక్షరాస్యతకు, ఇతర జీవననాణ్యత సూచికలకు బీహార్ తరువాతే మరొకటి… అఫ్‌కోర్స్, బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్… ఏ పార్టీ కూడా శుద్ధపూస కాదు… అందరూ అందరే… రాజకీయాలు, అధికారం ఆటలే… సుపరిపాలన జాడలు లేని రాష్ట్రం…
వర్తమాన రాజకీయాలకు వద్దాం… లాలూ చెప్పినట్టు నితిశ్ పామో కాదో చెప్పలేం గానీ కప్ప… అటూ దూకుతాడు… కిరీటం ధరిస్తాడు… మళ్లీ వాళ్లకు జెల్లకొడతాడు… మరోవైపు దూకుతాడు… మళ్లీ కిరీటం… మళ్లీ కొన్నాళ్లకు మళ్లీ జంప్… కావచ్చు, రాజకీయాల్లో నైతికతలు, స్థిరత్వాలు ఏముంటయ్..? అంతా చంచలం, అంతిమంగా అధికారమే లక్ష్యంగా సాగే పాచికలాట… కాదు, పత్తాలాట… ఇప్పుడూ అంతే…
Ads
మహారాష్ట్రలోలాగా ఎవరో బీహారీ షిండేను ముందుపెట్టి బీజేపీ నితిశ్‌ను కూలదోసే ప్రమాదముందట… వెంటనే ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకుని, మహాఘట్‌బంధన్ కూటమిలో చేరిపోయాడు… ఇది కంటిన్యూ అవుతుందని కాదు… ఇంకేదో గేమ్ మొదలుపెడతాడు… సరే, బీజేపీ అడుగులన్నీ నైతికమనే సర్టిఫికెట్ మనం ఇవ్వనక్కర్లేదు… రాజకీయాల్లో నైతికత అనే మాటే పెద్ద బూతుగా పరిగణిస్తారు మోడీ అండ్ షా… కానీ మహారాష్ట్ర, బీహార్‌లలో బీజేపీ చేసింది తప్పుకాదు…
మహారాష్ట్రలో ప్రజలు బీజేపీ, శివసేన కూటమికి పట్టం కట్టారు… కేవలం సీఎం కుర్చీ కోసం ఉద్దవ్ ఠాక్రే బీజేపీని తరిమేసి, ఎన్సీపీ-కాంగ్రెస్‌లతో చేతులు కలిపాడు… శివసేన మూలసిద్ధాంతాల్ని పాతరేశాడు… చివరకు ఏమైంది..? సొంత పార్టీ నాయకులే థూ అనేశారు… ప్రజలు తిరస్కరించిన ఎన్సీపీ-కాంగ్రెస్ శివసేనతో ఎందుకు చేతులు కలిపాయి..? అధికారం కోసం..! అది అనైతికం అని ఎవడూ రాయడు… సరే, బీహార్‌కు వద్దాం… ఒక్కసారి ఈ టేబుల్ చూడండి…
బీజేపీ, జేడీయూ దాదాపు ఒకే సంఖ్య సీట్లకు పోటీచేశాయి… బీజేపికి 74 రాగా, జేడీయూకు కేవలం 43 వచ్చాయి… నిజానికి నితిశ్‌ను జనం తిరస్కరించారు… నిలబడిన సీట్లలో కేవలం మూడోవంతు సీట్లలో మాత్రమే గెలిచాడు… ఐనా సరే, కలిసి పోటీచేశారు కాబట్టి, ముందే ఒప్పందం కాబట్టి నితిశ్‌నే సీఎంను చేశారు… తనకు 43 సీట్లే రావడానికి కారణం లోకజనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ అనీ, కావాలనే బీజేపీ రెబల్స్‌ను తమకు వ్యతిరేకంగా లోకజనశక్తి పేరిట నిలబెట్టారనీ అంటాడు నితిశ్… ఒకవేళ నిజంగానే బీజేపీ అంత నమ్మకద్రోహానికి పాల్పడి ఉంటే… రెండేళ్లుగా ఆ పార్టీతో సంసారం ఎందుకు చేస్తున్నట్టు..? ఇప్పుడు విడాకులు దేనికి..?
నిజానికి బీహార్‌లో ఆర్జేడీ పుంజుకుంటోంది… స్కూల్ డ్రాపవుట్ అయినా సరే, తేజస్వి తమ పార్టీని కాపాడుకుంటున్నాడు… లెఫ్ట్, కాంగ్రెస్ సపోర్టుతో బలోపేతం అయ్యాడు… 144 సీట్లలో పోటీచేస్తే 75 గెలిచాడు… తరువాత ఎంఐఎం వాళ్లు చేరినట్టున్నారు ముగ్గురో నలుగురో… ఈలెక్కన కాంగ్రెస్‌ను జనం తిరస్కరించారు… ఐనాసరే, ఆర్జేడీ కాంగ్రెస్‌తో కలిసే ఉంటోంది… లెఫ్ట్‌లో సీపీఎం, సీపీఐలతో పోలిస్తే సీపీఐఎంఎల్ బాగా బలపడింది…
కొన్నాళ్లుగా ఇదే తంతు… ఎవడికీ స్థిర, పూర్ణ మెజారిటీ రాదు… అటూ ఇటూ ఆటలు… ఎవరికీ రాష్ట్ర పాలన మీద సోయి లేదు… నితిశ్ ఇప్పుడు హఠాత్తుగా సెక్యులర్ డ్రెస్ ధరిస్తున్నాడు… ఐనా తనకు ఈ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు జాన్తానై… ఎవడి చంకనెక్కాలి… కుర్చీ ఎలా కాపాడుకోవాలి… ఇదే ధ్యాస… ఈ ఆటలో ఈరోజుకూ విజేత నితిశే… ఆట నేర్చినోడు..!! కొన్నేళ్లుగా హ్యాండ్ ఫుల్ రెయిజింగులో ఉంది… ఎన్నాళ్లో చూడాలి…!!
చివరగా….. తను ఎనిమిదోసారి సీఎం అవుతున్నాడు కదా… 1989 నుంచి అసలు ఎమ్మెల్యేగా గెలవలేదు… MLC గా కథ నడిపించేస్తున్నాడు… బట్ ఏమాటకామాట నితీశ్ మీద అవినీతి ఆరోపణల్లేవు..!!
Share this Article