మానవాసక్తి కథనాలు… అంటే ప్రత్యేకంగా ఆఫ్ బీట్ స్టోరీలు ఏమీ కాదు… రొటీన్‌కు భిన్నంగా మనస్సులను కనెక్ట్ చేసే స్టోరీలు… తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ స్టోరీలను వదిలేసి చాలాకాలమైంది… రొటీన్ పొలిటికల్ బురదను మాత్రమే ప్రేమిస్తోంది… అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు పిల్లల కథ చాలా ఆసక్తికరంగా ఉంది… ఆంధ్రజ్యోతి సరిగ్గా ప్రజెంట్ చేసింది తప్ప మిగతా పత్రికల్లో, టీవీల్లో ఈ వార్త జాడే కనిపించలేదు… ఇంతకీ ఆ వార్త ఏమిటో తెలుసా..?
ప్రపంచంలోకెల్లా అత్యంత దట్టమైనవి అమెజాన్ అడవులు… భీకరమైనవి కూడా… రోజూ వర్షం, పొడవైన దృఢమైన చెట్లు, విషసర్పాలు, క్రూరజంతువులు… ప్రతి అడుగూ ప్రాణాంతకమే… రనేక్ మకుటయ్ 11 నెలలు, 4 ఏళ్లు, 9 ఏళ్ల వయస్సున్న కుమారులు, 13 ఏళ్ల కుమార్తెతో కలిసి ఈనెల ఒకటిన ఓ చిన్న విమానంలో అమెజాన్ ప్రావిన్సులోని అరరాక్వారా నుంచి శానోస్ డెల్ గువియారేకు బయల్దేరారు…
ఇంజిన్ ఫెయిలైంది… (పాపం పసివాడు సినిమా గుర్తొస్తోందా..? అప్పట్లో ఇంగ్లిషులోనూ ఓ సినిమా వచ్చింది, ఇద్దరు పిల్లలు అడవిలో తప్పిపోవడం మీద…) విమానం కూలిపోయింది… ఇందులో రనోక్, ఆమె పిల్లలు మాత్రమే కాదు… మరొకరు కూడా ఉన్నారు… విమానం కూలిపోయిన దుర్ఘటనలో పైలట్, రనోక్, ఆ మరో వ్యక్తి కూడా మరణించారు… ఆ నలుగురు పిల్లలు మాత్రం ప్రాణాలు దక్కించుకున్నారు… లక్కీగా, అన్ లక్కీగా…
Ads
అడవిలో విమానం కూలిపోయిన సమాచారం తెలిసింది ప్రభుత్వానికి… పిల్లలు బతికి ఉంటారా..? తప్పిపోయి ఇంకా బతికే ఉంటారా..? ఆపరేషన్ హోప్ పేరిట సైనికులు వెతుకులాట ప్రారంభించారు… దక్షిణ కాక్వెటా ప్రాంతంలో సైనికులకు కర్రలు, కొమ్మలతో కూడిన ఓ షెల్టర్ కనిపించింది… ముందు ఆశ్చర్యపోయినా, పిల్లలు అక్కడ వసతి సమకూర్చుకున్నట్టు ఊహించి ఆ పరిసరాల్లోనే హెలికాప్టర్లు దింపి సెర్చింగ్ స్టార్ట్ చేశారు…
రనోక్ సహా ముగ్గురి శవాలూ కనిపించాయి… మరి పిల్లలు..? అన్వేషణ మరింత సీరియస్‌గా సాగింది… ఎలాగైతేనేం దొరికారు… అందరూ బతికే ఉన్నారు… 17 రోజులపాటు చిన్న చిన్న షెల్టర్లు వేసుకుంటూ, తలదాచుకుంటూ, దొరికిన పండ్లు తింటూ ప్రాణాలు నిలుపుకున్నారు… కాస్త పెద్ద వయస్సున్న పిల్లలు సరే, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆ 11 నెలల పిల్ల కూడా మొండిగా బతికింది… అదీ ఆశ్చర్యం…
అడవుల్లో ఎలా బతకాలనేది ఆ పిల్లల నెత్తుటిలో ఉంది… నిజం, కష్టకాలంలో ఆ నెత్తుటిలోని తమ వారసత్వ నైపుణ్యాలు బయటికొచ్చాయి… వాళ్లది హుయిటోటో తెగ… ఈ తెగ ప్రజలు తరతరాలుగా చేపలు పట్టడం, జంతువుల వేట వృత్తులుగా అడవుల్లోనే బతికేవారు… ఆ పిల్లల్ని సజీవంగా ఉంచినవి కూడా వాళ్ల నెత్తుటిలోని ఆ లక్షణాలు, నైపుణ్యాలు, ప్రతికూలతలను తట్టుకునే దైహిక తత్వమే కారణమని ఇప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు… సదరు ప్రావిన్స్ అధ్యక్షుడు గుస్తావో పెట్రోస్ ఈ పిల్లలు బతికి ఉండటాన్ని (జాయ్ ఆఫ్ ది నేషన్) అని వ్యాఖ్యానించాడు… నిజమే, సంతోషమే, అబ్బురమే…!!
Share this Article