నో, నో… మా బాస్ ముఖేష్ అంబానీ లండన్‌కు షిఫ్ట్ కావడం లేదు, ఆ వార్తలన్నీ అవాస్తవం… అని రిలయెన్స్ ఓ ఖండన జారీ చేసింది… కానీ ఆ వార్తలెలా పుట్టాయి..? బిజినెస్ సర్కిళ్లలో సాధారణంగా నిప్పు లేనిదే పొగరాదు… పొగ లేదు అని చెప్పినా సరే జనం అంత వీజీగా నమ్మరు… నిజమే, ఒక విజయ్ మాల్యా కాదు తను… దేశం విడిచిపారిపోవడానికి..! తన వ్యాపారాల నిర్వహణ తీరుపై ఎన్ని వివాదాలు, ఎన్ని విమర్శలు ఉన్నా సరే అంబానీ వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతదారు కాదు, ప్రపంచంలోని టాప్ టెన్ ధనికుల జాబితాలో ఒకడు… భారతంలో నంబర్ వన్ భాగ్యశీలి… అవసరమైతే ఇప్పటికిప్పుడు ‘జీరో డెట్’ అయిపోగలడు… మరెందుకు పారిపోవాలి..? ఇన్నాళ్లూ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ, ప్రభుత్వ వర్గాలను, వాణిజ్య వర్గాలను శాసిస్తూ, వేయి కాళ్ల జెర్రిలా అటూఇటూ ఇక్కడే తిరుగుతున్నాడు గానీ ఎటూ పోలేదు కదా, మరి ఇప్పుడెందుకీ వార్తలు..? తనలాగే సగం ఆస్తిని పంచుకున్నా తమ్ముడు దివాలా తీశాడు గానీ అంబానీ సాలిడ్‌గానే ఉన్నాడు…
ఎగవేతదారులే కాదు, చాలామంది ధనికులు విదేశాలకు వెళ్లడానికే మొగ్గు చూపిస్తున్నారు… వెళ్తున్నారు… అంతెందుకు, పూణె బేస్డ్ సీరం ఇన్‌స్టిట్యూట్ ఓనర్ అధర్ పూనావాలా కూడా లండన్ వెళ్లిపోయాడు కదా… కోవిషీల్డ్ వేక్సిన్ తయారీదారు… తనకంటే వివిధ రాష్ట్రాల సీఎంలు, నాయకుల నుంచి బెదిరింపులు వచ్చాయనుకుందాం… కానీ అంబానీని బెదిరించేవాడెవడున్నాడు ఈ దేశంలో..? పార్టీలన్నీ అంబానీ విసిరే బిస్కెట్ల కోసం ఆరాటపడేవే కదా… పైగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ ఉన్న వీవీఐపీ… అయితేనేం..? అభద్రతను ఫీలవుతున్నాడు… ప్రత్యేకించి ఆమధ్య తన కాన్వాయ్ మీద దాడికి ఉద్దేశించిన కుట్ర బయటపడటంతోనే అంబానీలో ఓ మథనం స్టార్టయినట్టు చెప్పుకుంటున్నాయి ముంబై వాణిజ్యవర్గాలు…
Ads
ఆ దాడి వెనుక పోలీస్ అధికారుల కథలూ బయటపడ్డాయి… అలాంటి అధికారులకు మాజీ హోం మంత్రి మద్దతు… తను ఎన్సీపీ, అంటే శరద్ పవార్ మనిషి, పవార్ ప్రభుత్వంలో పార్టనర్… రీఇన్‌స్టూట్ అయిన పోలీస్ అధికారులకు శివసేన మద్దతు… ఇసుకతక్కెడ, పేడతక్కెడ అన్నట్టు… అసలు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలకు ఏ విషయంలోనైనా సైద్ధాంతికంగా పోలికలున్నాయా..? అడ్డదిడ్డంగా సాగుతోంది పాలన… ఆర్యన్ ఖాన్ కేసు విషయంలో ఓ మంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్నాడు… కంగనా ఆఫీసు కూల్చేసిన తీరు చూశాం కదా… చాలా ఉదాహరణలు… ఆ సీఎం ఠాక్రేకు ఏమీ తెలియదు… ఎంపీ సంజయ్ రౌత్ ఏది చెబితే అదే శాసనం అన్నట్టుగా నడుస్తోంది… అంబానీని బెదిరించి డబ్బు వసూళ్ల కోసం దాడి నాటకం క్రియేట్ చేశారా..? లేక కేసు తవ్వేకొద్దీ ఇంకేమైనా అంబానీని కలవరపెట్టే విషయాలు బయటపడ్డాయా…? అందుకే ఇక ముంబైలోని తన వేల కోట్ల ఇల్లు అంటిలియా కూడా సేఫ్ కాదని అనుకున్నాడా..? ఇంతకీ ఆ కేసు మిస్టరీ ఏమిటి..? తెలియదు…
అంబానీ బకింగ్‌హామ్‌షైర్‌లో ఓ ప్యాలెస్ కొన్నమాట నిజమే… 600 కోట్ల ఖర్చు, 300 ఎకరాలు, 49 గదుల విశాల భవనం… కేవలం ఓ ఫామ్ హౌజుగా వాడుకోవడానికి, రిక్రియేషన్ కోసం అక్కడ అంత డబ్బు పెట్టాడనే వివరణలు నమ్మబుల్‌గా లేవు… సో, వీలైనంతవరకూ అక్కడే ఉంటూ… ఇండియా, బ్రిటన్‌ల నడుమ వచ్చీపోయే ఆలోచనలన్నమాట… ఇప్పుడు చాలామంది ధనిక వ్యాపారులు విదేశాల వైపు చూస్తున్నారు… అందులోనూ అమెరికాకన్నా కెనడా, బ్రిటన్ వైపే అధికంగా వెళ్తున్నారనే వార్త చదివినట్టు గుర్తు… కానీ, అంబానీ వంటి వ్యాపారులు గనుక దేశం విడిచివెళ్లిపోతే అది దేశానికే అవమానకరం… ఎహె, పోనీలే, ఎవడికి నష్టం, తను ఈ దేశాన్ని ఉద్దరించింది ఏముంది, ఇక్కడ దోచుకుని, ఇంకెక్కడో దాచుకుని ఇకపై అనుభవిస్తాడు అనే వితండులకు జవాబు ఏమీ చెప్పలేం… తనను కట్టడి చేసుకోవడం వేరు, తనను కాపాడుకోవడం వేరు… ఆ తేడా చాలా పెద్దది… భద్రత లేక ఘన వాణిజ్య ప్రముఖులు విదేశీబాట పడుతుంటే మాత్రం… మన సిస్టంలో ఎక్కడో ఏదో ప్రబలమైన వైరస్ ప్రభావం చూపిస్తుందని లెక్క…!! అవునూ అంబానీ సార్… భద్రత కోసమైతే లండన్ దేనికి..? దేశంలో సెక్యూర్డ్ ప్లేసులే లేవా..? పోనీ, హైదరాబాద్ వచ్చేయండి సార్…!! ఫలక్‌నామా పాలెస్ కోసం ట్రై చేద్దాం… అది గనుక దొరికితే ఇంకేం..? దునియా విలాసం, వైభోగం, రాజరికం, వాట్ నాట్..?!
Share this Article