Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్నో పౌడర్ల దందానూ వదలని ముఖేషుడు… అంబానీ అంటేనే అన్నీ…

April 14, 2023 by M S R

Beauty of Business:  భారతదేశంలో మొహానికి పూసుకునే పౌడర్లు, స్నోలు, గ్లోలు, వైటెనింగ్ క్రీములు, యాంటీ ఏజింగ్ క్రీములు, ఇతర సౌందర్య సాధనాల మార్కెట్ విలువ ఏటా రెండు లక్షల ఇరవై అయిదు వేల కోట్ల రూపాయలేనట. రెండు, మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్లకన్నా ఇది ఎక్కువే. మింగ మెతుకు లేకపోయినా…మీసాలకు సంపెంగ నూనె పూయాల్సిందే కాబట్టి మరో పదేళ్లలో ఈ ఉత్పత్తుల అమ్మకం విలువ ఏటా అయిదు లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదట.

ఇది ఆయా ఉత్పత్తులు తయారు చేసే హిందూస్తాన్ యూనీలీవర్, ఇమామి, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి పెద్ద కంపెనీల లెక్క. చిన్నా చితకా లోకల్ ముఖ సౌందర్య సాధనాల విలువ కూడా కలిపితే…మన మొహానికి కొట్టుకుంటున్న సున్నాలు, పూతలు, రాతలు, చల్లుళ్ళు, స్ప్రేలు, గిల్లుళ్ళు, కలరింగులు, కోటింగులు, కోతలు, వాతలు…కలిపి మొత్తం మీద భారత్ లో అన్ని రకాల అందాల మార్కెట్ విలువకు సున్నాలు చాలవు.

“ఎలుకతోలు దెచ్చి యేడాది ఉతికిన,
నలుపు నలుపె గాని తెలుపు రాదు
కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభిరామ వినుర వేమా !”

మూడు వందల యాభై ఏళ్ల కిందట వేమన కాలానికే ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివాడెవడో నల్లటి ఎలుక తోలును తెల తెల్లటి హంస తోలుగా మారుస్తానని దండోరా వేయించి ఉంటాడు. అది విని వేమన ఈ పద్యం చెప్పి ఉంటాడు! తెల్ల తోలు మీద మన వ్యామోహం ఈనాటిది కాదు. పెళ్లి సంబంధాల ప్రకటనల్లో పబ్లిగ్గా కారు తెలుపు అమ్మాయికి- బస్సు తెలుపు అబ్బాయి మాత్రమే కావలెను- అని ఇప్పటికీ తెల్లతోలు సంబంధ ప్రకటనలే వస్తున్నాయి. ఈ విషయంలో మనది తోలు మందం వ్యవహారం.

Ads

“ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ! ”
అని కూడా వేమనే అన్నాడు. పైకి కనిపించే అందం కాకుండా ఆత్మ శుద్ధి లేదా అంతః సౌందర్యం గురించి పాపం వేమన ఎంతగానో గుండెలు బాదుకున్నాడు.

వేమనకు రివర్సులో పౌడర్లు, స్నోలు, ఫేస్ క్రీములు తయారు చేసేవారు కూడా తమ ఉత్పత్తులు వాడకపోతే మీ మొహం మా మొహంలా అఘోరిస్తుందని గుండెలు బాదుకుంటున్నారు.

ఆమధ్య అమెరికాలో నల్ల జాతి పౌరుడు ఫ్లాయిడ్ ను ఒక తెల్లజాతి పోలీసు అధికారి గొంతు నులిమి చంపాడు. ఐ కాంట్ బ్రీత్ అన్న ఫ్లాయిడ్ మరణ వాంగ్మూలమే “బ్లాక్ లైవ్స్ మ్యాటర్” అన్న స్లోగన్ తో ప్రపంచవ్యాప్తంగా వర్ణ దురహంకారం మీద ఉద్యమంగా మారింది. ఈ నేపథ్యంలో సౌందర్య సాధనాల ప్రకటనల్లో ప్రపంచవ్యాప్తంగా నలుపును అవమానించే మాటలను తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. నెమ్మదిగా కంపెనీలు దారికొస్తున్నాయి. భారత దేశంలో ఆయా ఉత్పత్తుల పేర్లు, ప్రకటనల్లో తెలుపును తొలగించి పాజిటివ్ బ్యూటీ అన్న మాటను తగిలిస్తున్నారు. పాజిటివ్ బ్యూటీని తెలుగులో సకారాత్మక అందం అనాలా? ధనాత్మక అందం అనాలా?
అసలే కరోనా రోజులు. పాజిటివ్ అందానికి ఇంకే అర్థం వస్తుందో? యాడ్ ఏజెన్సీ అనువాద పండితులు పాజిటివ్ అందాన్ని ఎలా అనువధిస్తారో వేచి చూడాలి. సింపుల్ గా సహజ సౌందర్యం అనవచ్చు. అలా అంటే ఇక యాడ్ మేకర్ క్రియేటివిటీకి విలువేముంటుంది?

“దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే
వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే
చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!”

అన్నాడు ధూర్జటి. వయసు పెరిగేకొద్దీ పళ్లు ఊడడం, శరీర కాంతి తగ్గడం, ముడుతలు పడడం, జుట్టు తెల్లబడడం, రోగాలు పలకరించడం, మన మొహం మనమే గుర్తు పట్టలేనంతగా మారిపోవడం సహజం. ఎన్ని యాంటీ ఏజింగ్ క్రీములు మొహానికి దట్టించినా- వయసును ఆపగలమా?
అరవైలో ఇరవై వయసు ఎవరికైనా వచ్చేనా?

 Beauty Saloon Sector

వయసు పెరిగి-
పెదవి వంకర పోతే…కోయించుకుని వెంటనే సరిదిద్దుకోవాలి.
మూతి వంకరపోతే…వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి.
నలుపెక్కితే…వెంటనే చర్మం ఒలిపించుకుని…తెల్ల చర్మం తొడుక్కోవాలి.
పొట్ట లావెక్కితే పర పర రంపం పెట్టి కోయించుకోవాలి.
జుట్టు నెరవకూడదు.
పళ్లు ఊడకూడదు.
కళ్లకు చత్వారం రాకూడదు.
ఒళ్లు ఒంగకూడదు.
అరవైల్లో ఇరవై ఉక్కిరి బిక్కిరి చేస్తూ…బుగ్గలు చిదిమితే పాల కేంద్రం పెట్టుకోవాలి.
చెంపలు అద్దాలు కావాలి.
జీవితం అనునిత్యం అందాల్లో బందీ కావాలి.

అందాన్ని ధ్యానించాలి. శ్వాసించాలి. తపించాలి. అందం కోసం చచ్చిపోవాలి.

అన్నట్లు-
రిలయన్స్ సంస్థ బాంబేలో “తిరా” పేరుతో తొలి సౌందర్య సాధనాల అతి పెద్ద స్టోర్ ను ప్రారంభించింది. దశలవారీ అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో కూడా “తిరా” స్టోర్లు వెలుస్తాయట.

“తిరా” ఏ భాష పదమో మరి? బహుశా సంస్కృత మూలాలున్న హిందీ అయితే “మార్పు” అన్న అర్థం ఏమన్నా వస్తుందేమో?

ఇక తనివితీరా “తిరా” అందాలను అద్దుకుని…ఆనందాల తీరాలను చేరడం మన సౌందర్య ప్రతిజ్ఞ; అందాల కర్తవ్యం కావాలి!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

తిరా బ్యూటీ రిటైల్ స్టోర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions