సీనియర్ జర్నలిస్ట్ Murali Buddha….. రాసిన ఓ సెటైర్… ‘‘జగన్ సమక్షంలో ysrcp లో చేరిన పది రోజుల, రెండు గంటల, 36 నిమిషాల తరువాత పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన అంబటి రాయుడు… 20:20 మ్యాచ్ ల కాలంలో. ఓ క్రికెటర్ టెస్ట్ మ్యాచ్లా ఒక పార్టీలో 10 రోజుల సుదీర్ఘ కాలం ఉండడం గ్రేట్ …’’
నిజం… స్టార్ బ్యాట్స్‌మన్ క్రీజు వైపు బయల్దేరి, పిచ్ మీద కాలు కూడా పెట్టకుండానే, పెవిలియన్‌కు వాపస్ వెళ్లిపోవడం ఇదే తొలిసారి కావచ్చు… ఇది టైమ్ అవుట్ కాదు, టైమింగ్ కూడా చేతకాని అవుట్… పది రోజులపాటు కూడా వైసీపీలో ఉండలేకపోయాడు రాయుడు… ఒకరకంగా పార్టీ నుంచి బతుకుజీవుడా అని పారిపోయాడు… కారణం..?
నిజానికి కొంతకాలంగా వైసీపీలో తీవ్ర అనిశ్చితి… ఎడాపెడా సిట్టింగులను మార్చే పనిలో పడ్డాడు కదా జగన్… అదేమంటే సర్వేలో నువ్వు వీక్ అని తేలింది, సో, నువ్వు అవుట్, కొత్త ప్లేయర్‌ను తీసుకుంటాను అంటాడు… అవుటైన ప్లేయర్లు టీడీపీ వైపు వెళ్లిపోతున్నారు… కొందరు టీడీపీ నుంచి వైసీపీకి వస్తారు… ఇటూఅటూ… ఎవరికీ సొంత సిద్ధాంతాలు, బలాబలాలు ఏమీ లేవు… వాలీబాల్ నెట్‌కు అటు కొందరు, ఇటు కొందరు… జంపుతూ ఉంటారు…
Ads
సరే, రాజకీయాల్లో ఇవేవీ అసహజం కాదు… నమ్ముకున్నవాడిని అలాగే కాపాడుకోవడానికి జగన్ తన తండ్రి వైఎస్ వంటి నాయకుడూ కాదు… ఈయన లెక్కలు వేరు… ఆ లెక్కల్లో ఫిటయినవాడే ఉంటాడు… పార్టీ లాభనష్టాలకు హోల్‌సేల్ జవాబుదారీ తనే కాబట్టి తన నిర్ణయాలు, తన ఇష్టం… దాన్నలా వదిలేస్తే… అంబటి రాయుడు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చినట్టు..? అదీ వైసీపీలో ఎందుకు చేరినట్టు..? ఏం ఆలోచించుకుని చేరినట్టు..? మళ్లీ ఎందుకు వెంటనే వదిలేసినట్టు..?
కేఏపాల్ చాలా నయం అనిపిస్తుంది కొన్నిసార్లు ఇలాంటి కేరక్టర్లను చూస్తున్నప్పుడు…! సరే, పార్టీని వీడాడు సరే, దానికి కారణం ఏం చెప్పాడో తెలుసా..? కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట… పది రోజుల్లోనే రాజకీయాల మీద అంత వైరాగ్యం వచ్చిందా..? ఆ రేంజులో వైసీపీలో గందరగోళం కనిపిస్తోందా..? మరి ఏం ఆలోచించుకుని రాజకీయాల్లోకి వచ్చినట్టు..? ఇంత చంచల స్వభావి కాబట్టే క్రికెట్‌లోనూ ఎవరూ సహించలేదు తనను…
ఈయనకు గుంటూరు ఎంపీ టికెట్టు ఇస్తామని ఎవరో చెప్పారట… వెంటనే తను చేరిపోయాడట… తీరా జగన్ ఇంకెవరినో తీసుకొచ్చి గుంటూరులో పోటీ చేయించే ఆలోచనలో ఉన్నాడు, అది సందిగ్ధంలో ఉంది.., ఆ ఈక్వేషన్స్ వేరు… ఇవన్నీ చూసి బయటికి వచ్చేశాడట అంబటి రాయుడు… ఎవరు చెప్పారు తనకు గుంటూరు టికెట్ ఇస్తామని..? జగన్ తప్ప ఇంకెవరైనా టికెట్ల నిర్ణయాలు తీసుకునే సీన్ ఉందా వైసీపీలో..? పోనీ, జగన్ చెప్పాడా..? టికెట్ ఇస్తాను, వచ్చెయ్ అన్నాడా..? స్ట్రెయిట్, సింపుల్ ప్రశ్న… ఇలాంటి వాళ్ల రాజకీయాలతో సమాజానికి ఏం ఫాయిదా..?! (అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్లతో ఏం ఫాయిదా అంటారా..? అది మరింత నిజం…)
నవ్వొచ్చిందేమిటంటే… ఈనాడులో ఈ వార్త రాస్తూ… వైసీపీకి షాక్ అట… ఈ వికెట్ పడటంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిందట..! త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నాడట ఈయన..!!
Share this Article