.
అంబికా కృష్ణ… ఈ అగరుబత్తుల వ్యాపారి, అనంతరం రాజకీయవేత్త… బాగా నొప్పి కలుగుతోందట పాపం… ఎందుకయ్యా అంటే… తెలుగు సినిమాల్లో ఆంధ్రా యాస కనుమరుగైపోతోందట… తెలుగు నిర్మాతలు ఉద్యమ స్పూర్తితో దాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకోవాలట… ఏపీలో ఎడాపెడా సినిమాలు తీసేయాలట…
సదరు సినీ నిర్మాత గారు ఇప్పుడు టీడీపీలో ఉన్నాడా, ఉండీలేనట్టుండే బీజేపీలో ఉన్నాడా ఉండీలేనట్టుగా… సరిగ్గా తెలియదు గానీ… అయ్యా, సారు గారూ… ఆంధ్రా యాస అనగానేమి..? మీ గోదావరి జిల్లాల యాసా..? లేక తరాలుగా రాయలసీమపై, ఉత్తర కోస్తాపై, తెలంగాణపై నిర్బంధంగా రుద్దబడిన రెండున్నర జిల్లాల యాసా..? ఏ భాష సార్..?
Ads
మీవి రెండు ప్లస్ మిగతా రెండున్నర జిల్లాల భాష, యాస… అనగా మీ నాలుగున్నర జిల్లాల భాషను, యాసను, సంస్కృతిని, రాజకీయాల్ని, పెత్తనాల్ని, ఆధిపత్యాన్ని, ఆభిజాత్యాన్ని ఇతర ప్రాంతాల మీద రుద్దీ రుద్దీ అసలు తెలుగంటే మీరే అన్నంతగా అణిచేశారు కదా… ఇప్పుడు నాలుగు సినిమాల్లో తెలంగాణ యాస కనిపిస్తే అంత ఓర్వలేని తనమా..? మీరు మారరు… అస్సలు మారరు…
జనం చూస్తున్నారు, ఆదరిస్తున్నారు అని తెలంగాణ యాసను ఒకటీరెండు సినిమాల్లో పెట్టినా సరే, మళ్లీ మీ ఆంధ్రా హీరోలు, నటులతో దాన్ని ఖూనీ చేయిస్తున్నారు కదా మీరే… సరే, తమరేమంటిరి, ఏమంటిరి..? ఏపీలో కనీసం రెండు షెడ్యూళ్లయినా ఏపీలో చేయాలా..? దాంతో వేలాది మంది లైట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్టులు, రవాణా, హోటల్, కేటరింగు కార్మికులు బాగుపడతారా..? ఆల్రెడీ బాలకృష్ణ ముందడుగు వేశాడా..?
ఓసారి ఎమ్మెల్యేగా కూడా చేసినట్టున్నారు తమరు, ఏకంగా ఫిలిమ్ ఫెడరేషన్ (APSFTTDC) చైర్మన్ గిరీ వెలగబెట్టినట్టున్నారు, అప్పుడెందుకు లేదు ఈ సోయి..? చివరకు ఆ నంది అవార్డులు కూడా ఈరోజుకూ పునరుద్దరణకు నోచుకోలేదు… తమరు ఏం చేసినట్టు మరి..?
తెలుగు హీరోలందరూ ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టి, పెరిగి, ఇక్కడే మొదటి ముద్ద తిన్నారట.. కానీ నేడు షూటింగ్‌ల కోసం విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్తూ సొంత రాష్ట్రాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారట… గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఏపీలో పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారట…
రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయింది, పుష్కరకాలం… ఐనా ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఈరోజుకూ ఓ పాలసీ అంటూ ఏడ్చిందా మాస్టారూ… సినిమా విడుదల అనగానే బెనిఫిట్ షోలు, అడ్డగోలు టికెట్ రేట్ల పెంపు తప్ప మీ సర్కార్లు ఉద్దరించింది ఏమిటి..? ఆ వైఫల్యాలు అన్నీ మరిచి, పైగా తెలంగాణ యాస మీద మళ్లీ అదే దిక్కుమాలిన ఏడుపు..! ముందు మీ గోచీబట్ట సర్దుకోవయ్యా అంబికా..!!
సినిమా అనేది పక్కా ఓ దందా… ఎవరూ ఎవరినీ ఉద్దరించడానికి ప్రయత్నించరు… ఎవడి లాభాపేక్ష వాడిది… అంతే… పోనీ, ఎన్టీయార్- ఏఎన్నార్ చెన్నై నుంచి వచ్చి హైదరాబాదులో ఇండస్ట్రీని పాతారని కదా అంటున్నది… అదే ఎన్టీయార్ కొడుకు బాలకృష్ణను, అదే ఏఎన్నార్ కొడుకు నాగార్జునను అమరావతికి షిఫ్టయిపోయి, ‘తెలుగు ఇండస్ట్రీ’కి పునాదులు వేస్తారేమో అడగవయ్యా అగరుబత్తుల వ్యాపారీ..!! నువ్వూ నిర్మాతవే కదా, నువ్వే ఆ ముందడుగు వేయొచ్చు కదా!!
Share this Article