.
అంబుబాచీ… పేరెప్పుడైనా విన్నారా..? అస్సోం రాజధాని గౌహతిలో ఉన్న కామాఖ్య దేవాలయానికి సంబంధించిన పేరు… ఇప్పుడు ఈ పేరు ఎందుకు వినిపిస్తున్నదంటే… ప్రస్తుతం అంబుబాచీ పేరిట ఆ గుడిని మూడు రోజులపాటు మూసేశారు కాబట్టి… కానీ ఎందుకు మూసేస్తారు..?
ఇది అమ్మవారి గుడి… శక్తిపీఠాల్లో ఒకటి… ఎక్కడా లేనట్టు ఇక్కడ అమ్మవారి రుతుస్రావ చక్రం పాటిస్తారు… అంటే సహజంగానే రుతుస్రావ మహిళ్లలో నెలకు మూణ్నాలుగు రోజులు పీరియడ్స్ ఉంటాయి కదా… ఇక్కడ ఏడాదిలో మూడు రోజులు పాటిస్తారు…
Ads
ఏ శక్తిపీఠంలోనూ ఈ ఆనవాయితీ కనిపించదు… ఈ మూడు రోజులు గుడి మొత్తం మూసేసి, అమ్మవారికి విశ్రాంతి దశలో ఉంచుతారు… 22 నుంచి 25 వరకు… తరువాత శుద్ధి చేసి, గుడి తలుపులు తెరుస్తారు… తెరవగానే భక్తులు పోటెత్తుతారు…
ఏ ప్రధాన దేవాలయంలోనూ లేని మరో విశిష్టత ఏమిటంటే..? ఇక్కడ వామాచార పూజలే ప్రధానం… మనం గ్రామ దేవతల దగ్గర బలులు ఇవ్వడం, కల్లు లేదా సారా సాకపోయడంలాగే… కామాఖ్య కూడా అలాంటి శక్తే కాబట్టి ఇక్కడా దాదాపు సేమ్ పూజావిధానాలు… బలులుంటయ్, మద్యం తర్పణలూ ఉంటయ్…
వామాచార పద్ధతిలో దశమహావిద్య పూజల్ని నిర్వర్తించే పూజారులు అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి ఆ పూజల చివరి తంతులు నిర్వహిస్తుంటారు… (క్షుద్ర పూజలు కావు ఇవి… క్షుద్ర శక్తులను ఆవాహన చేసుకోవడానికి చేసే ఆ క్షుద్ర పూజల విధానం వేరు, సంకల్పం వేరు… చాలామంది వామాచారాన్ని క్షుద్ర పూజలుగా పొరబడుతూ ఉంటారు… ప్రత్యేకించి మీడియా…)
ఎప్పుడైనా పితృకర్మలు చేసినప్పుడు గమనించారా..? దక్షిణాచారంలో అక్షితలు, వామాచారంలో నువ్వులు, మార్చి మార్చి కర్మ చేయిస్తుంటారు, జంధ్యాన్ని కూడా సవ్యం, అపసవ్యం చేయిస్తూ… ఎస్, మామూలు ఆగమ పూజలకూ ఈ వామాచార పూజలకూ నడుమ కూడా తేడా అంతే…
హైదరాబాద్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి కామాఖ్య వెళ్లే భక్తుల సంఖ్య బాగా పెరిగింది… కామాఖ్య మహాశక్తి కాబట్టి పూజిస్తే మంచి జరుగుతుందనేది నమ్మకం… నమ్మకమే కదా భక్తి… ట్రెయిన్ జర్నీ సుదీర్ఘం కాబట్టి, భక్తుల అఫర్డబులిటీ కూడా పెరిగింది కాబట్టి స్ట్రెయిట్‌గా గౌహతికి ఫ్లయిట్ జర్నీ చేస్తున్నారు ఈమధ్య…
హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలున్నాయి… రెండున్నర నుంచి మూడు గంటల ప్రయాణం… అంబుబాచీ మేళా సందర్భంగా… భక్తుల తాకిడి ఇక్కడి నుంచీ పెరిగింది కాబట్టి ఈ కథనం… ఇంకా కామాఖ్య విశేషాలు కావాలా..? చెప్పుకుందాం…
వయోవృద్ధులు, కాస్త ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి చార్ ధామ్, వైష్ణో, అమరనాథ్, మానససరోవర్ వ్యయం, ప్రయాస కాబట్టి… అలాంటివాళ్లు కామాఖ్య వైపు చూస్తున్నారు, వెళ్తున్నారు… అస్సోం ఆధ్మాత్మిక, సాంస్కృతిక చిహ్నం కామాఖ్య గుడి..!!
Share this Article