పార్ధసారధి పోట్లూరి …….. వారిస్ దే పంజాబ్ నాయకుడు భీంద్రన్ వాలే-2 గా చెప్పుకుంటున్న అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ అయ్యాడు ! 37 రోజుల నుండి పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్ ఎట్టకేలకి అరెస్ట్ అయ్యాడు ! గత మార్చి నెల 18 న నుండి పోలీసులకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న అమృత్పాల్ సింగ్ పంజాబ్ లోని మొగాలో పోలీసులకి లొంగిపోయాడు !
పంజాబ్ లోని మొగా జిల్లా, రోడే అనే గ్రామంలోని గురుద్వారాలో అమృత్ పాల్ ని అరెస్ట్ చేసినట్లు చెపుతున్నారు ! అమృత్ పాల్ సింగ్ ని అస్సాం లోని డిబ్రూగర్ జైలుకి తరలించనున్నారు పోలీసులు, ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ [NIA] ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే అమృత్ పాల్ కి సంబంధించి 8 మంది ముఖ్య అనుచరులని అరెస్ట్ చేసి, అస్సాంలోని డిబ్రూగర్ జైలులో పెట్టారు ! వీళ్ళ మీద ఎలాంటి చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కానీ NIA యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే, సంవత్సరం వరకు ఎలాంటి చార్జ్ షీట్ ఫైల్ చేయనక్కరలేకుండా జైలులో ఉంచవచ్చు ! ఇప్పుడు అమృత్ పాల్ సింగ్ కూడా సంవత్సరం పాటు జైలులో ఉండాల్సిందే !
గత మార్చి నెల 2 న అమృత్ పాల్ సింగ్ విషయం మీద పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యాక పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ మీద పోలీస్ యాక్షన్ మొదలయిన సంగతి తెలిసిందే !
Ads
అమృత్ పాల్ సింగ్ కి పాకిస్థాన్ ISI ఆయుధాలు సరఫరా చేస్తున్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్ ని భారత్ నుండి వేరు చేసి పాకిస్థాన్ లోని పంజాబ్ లో కలిపేయాలనే కుట్ర ఉంది. దీనికి పాకిస్థాన్ తో పాటు కెనడా, బ్రిటన్, అమెరికా దేశాలలోని ఖలిస్తానీ మద్దతు దారుల సహకారం ఉంది. మరీ ముఖ్యంగా బ్రిటన్, అమెరికా లు ఖలిస్తానీ మద్దతుదారుల మీద చర్యలు తీసుకోవడంలో అలక్ష్యం ప్రదర్శించాయి ! ఖలిస్తానీ ఉద్యమం యొక్క మూలాలు కెనడా, అమెరికా ,బ్రిటన్ లో ఉన్నాయి ! మూడు నెలల క్రితమే భారత జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవల్ అమెరికా, బ్రిటన్ దేశాలలో పర్యటించి స్థానిక ఖలిస్తానీ మద్దతుదారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అడిగినా, అమెరికాతో పాటు బ్రిటన్ లు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి !
ఎప్పుడయితే పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ మీద పోలీస్ యాక్షన్ మొదలయ్యిందో ఆ మరుసటి రోజునే అమెరికా, బ్రిటన్ దేశాలలో భారత రాయబార కార్యాలయాల మీద ఖలిస్తానీ మద్దతు దారులు దాడులు చేయడం మొదలు పెట్టారు. మార్చి 19 న అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో లో ఉన్న భారత కాన్సులేట్ కార్యాలయం మీద ఖలిస్తానీ మద్దతు దారులు దాడి చేసి, భారత కాన్సులేట్ కార్యాలయానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు. దాదాపుగా అరగంట సేపు అక్కడ భీతావహ వాతావరణం నెలకొన్నా, శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు అక్కడ ఎలాంటి చర్యకి పూనుకోలేదు. భారత కాన్సులేట్ కార్యాలయ సిబ్బంది ఫోనులో పోలీసులకి ఫిర్యాదు చేసినా అరగంట తరువాత, అంటే కార్యాలయం ధ్వంసం అయిన తరువాత మాత్రమే అక్కడికి చేరుకున్నారు !
భారత కాన్సులేట్ కార్యాలయం నగరం బయట ఉండదు కదా ? అరగంట సేపు పోలీసులు ఎందుకు స్పందించలేదు ? అంటే భారత కాన్సులేట్ కార్యాలయం ధ్వంసం అయ్యేదాకా ఎందుకు ఆగినట్లు ? ఖలిస్తానీ మద్దతు దారులు పట్టుమని 10 మంది కూడా లేరు కానీ ఆ వీడియోలు వైరల్ అయ్యే వరకు ఆగి తరువాత తీరికగా వచ్చారు పోలీసులు. అమెరికా ద్వంద్వ వైఖరికి ఇది సాక్ష్యంగా నిలిచింది !
ఇక లండన్ లోని భారత రాయబార కార్యాలయం మీద ఖలిస్తానీ మద్దతు దారులు దాడి చేసి భారత జాతీయ పతాకాన్ని దించేసి ఖలిస్తానీ జెండాని ఎగురువేస్తున్నా లండన్ పోలీసులు అక్కడికి రాలేదు. అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు కావాలనే చోద్యం చూస్తూ కూర్చున్నాయి అన్నది స్పష్టంగా తెలుస్తున్నది. ఈ రెండు ఘటనల మీద భారత దేశం నిరసన వ్యక్తం చేసింది షరా మామూలుగానే ! అంతకంటే ఇంకేం చేయగలం ?
బ్రిటన్ విషయంలో మాత్రం భారత్ తీవ్రంగానే స్పందించింది ! మొదట న్యూఢిల్లీలోని బ్రిటన్ హై కమిషన్ వద్ద ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ ని తీసేశారు అధికారులు. బ్రిటన్ హై కమిషన్ కి భారత్ లో ఎలాంటి ముప్పు లేదు కాబట్టి పోలీస్ అవుట్ పోస్ట్ తీసేస్తున్నామని తెలిపారు అధికారులు. అలాగే బ్రిటన్ హై కమిషన్ ఉన్న కార్యాలయం బయట ఉన్న బారికేడ్స్ కూడా తీసేశారు !
ఒక దశలో మరో తీవ్రమయిన చర్యకి పూనుకున్నారు అధికారులు ! ప్రజల సౌకర్యం కోసం అంటూ బ్రిటన్ హై కమిషన్ ఉన్న కార్యాలయం బయట ఫుట్ పాత్ మీద పబ్లిక్ టాయిలెట్లు నిర్మించడానికి పూనుకొని, ఆ విషయాన్ని బ్రిటన్ హై కమిషనర్ కి తెలియచేసారు అధికారులు! అప్పటికి కానీ బ్రిటన్ హై కమిషనర్ కి అర్ధం కాలేదు భారత్ ఎలాంటి ప్రతీకార చర్య తీసుకోబోతున్నది అన్నది !
బ్రిటన్ విదేశాంగ శాఖ సెక్రటరీ జేమ్స్ క్లవర్లీ [James Cleverly ] లండన్ లోని భారత హై కమిషన్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాను అంటూ ప్రకటన చేశాడు ! ఇది జస్ట్ ఐ వాష్ మాత్రమే ! ఎందుకంటే ఒక నేర పూరితమయిన ఘటన జరిగిన తరువాత అదీ ఒక దేశపు రాయబార కార్యాలయం మీద బ్రిటన్ పౌరులు చేసిన దాడి విషయంలో వెంటనే స్పందించినట్లయితే అది వియన్నా ఒప్పందాన్ని గౌరవించినట్లుగా ఉండేది కానీ బ్రిటన్ ఆ పని చేయలేదు !
తీరిగ్గా.. అదీ భారత్ తీవ్రంగా స్పందించే సరికి ముక్తాయింపుగా విచారణకి ఆదేశాలు ఇవ్వడాన్ని బట్టి బ్రిటన్ పరోక్షంగా ఖలిస్తానీ ఉద్యమకారులకి మద్దతు ఇస్తున్నట్లుగానే ఉంది ! అఫ్కోర్స్ ! ఇస్తున్నట్లుగా కాదు నిజంగానే 1903 నుండి బ్రిటన్, అమెరికాలు ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతుగా ఉంటూనే వస్తున్నాయి, కాకపోతే ఇప్పుడు రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొని, దానిని శుద్ధి చేసి తిరిగి అమెరికా, బ్రిటన్ దేశాలకి భారత్ అమ్మడం మీద తమ అక్కసుని వెళ్లబోసుకోవడానికి ఆయుధంగా వాడుకుంటున్నాయి !
Share this Article