.
Jaganadha Rao ….. అమెరికా పౌరులే మెక్సికో, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, UK, స్పెయిన్ లాంటి దేశాలకి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వలసలు పోతున్నారు.
43 కోట్లు కడితే అమెరికా గోల్డ్ కార్డ్ (గ్రీన్ కార్డ్ తో సమానం, పౌరసత్వం కాదు) ఇస్తాం అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించాడు. నిజానికి అమెరికా అనే కాదు, కెనడా మరియూ చాలా దేశాల్లో కొంత ఎమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉద్యోగాలు క్రియేట్ చేస్తే ఆ దేశాల పర్మినెంట్ రెసిడెన్సీ, పౌరసత్వం ఇస్తారు. ఇది అప్పటినుంచో అమలులో ఉంది. అమెరికాలో అలా ఈబీ-5 కేటగిరీ క్రింద కొంత ఇన్వెస్ట్ చేసి ఒక 10 ఉద్యోగాలు క్రియేట్ చేస్తే గ్రీన్ కార్డ్ వస్తుంది.
Ads
అయితే ఈబీ- 5 ప్రోగ్రాం ద్వారా మోసాలు, అక్రమాలు జరుగుతున్నై, 10 కోట్లలోపే ఇన్వెస్ట్ చేసి ఉద్యోగాలు క్రియేట్ చేసినట్లు పత్రాలు చూపించి గ్రీన్ కార్డ్ పొందినవారు చాలా మంది ఉన్నారు అనేది ఒక వాదన. అందుకే దీన్ని అరికట్టటం కోసం సులభంగా ఎవరు అయితే 5 మిలియన్ల అమెరికన్ డాలర్లు (ప్రస్తుత ధర 43 కోట్లు) కడతారో వాళ్ళకి అమెరికా గోల్డ్ కార్డ్ ఇస్తాం అనేది అమెరికా వాణిజ్య మంత్రి చెప్పినమాట.
అమెరికాలో సెటిల్ అవుదాం అనుకునే సంపన్నులకి ఇది ఉపయోగపడుతుంది అనేది కాదనలేని నిజం.
అమెరికా గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్ళే పలువురు అమెరికాని విడిచి ఇండియా వెళ్దాం అనే అలోచనలో ఉన్నారు. వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉన్నై. అమెరికా పౌరులు కూడా చాలా మంది వివిధ దేశాలకి వలసలు పోతున్నారు.
వ్యాపారాలు ఉండి, అత్యంత సంపన్నులుగా ఉన్న వాళ్ళకి 43 కోట్లు కట్టి అమెరికా గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటే వాళ్ళ వ్యాపారాలకి ఏమైనా ఉపయోగం ఉంటుంది ఏమో కానీ సామాన్యులకి దీనివలన ఒరిగేది ఏమీ ఉండదు.
H1B వీసా మీద ఉండి ఉద్యోగం పోతే 90 రోజుల్లో అమెరికా నుంచి వెళ్ళిపోవాలి, అందుకే H1 ఉన్నవాళ్ళు స్వయంగా ట్యాక్స్ లు కట్టి పేస్లిప్స్ రన్ చేపించుకుంటూ ఉంటారు. అది పెద్ద తలనొప్పి. గ్రీన్ కార్డ్ ఉంటే ఆ బాధ ఉండదు.
అయినా, గ్రీన్ కార్డ్ ఉన్నా, అమెరికా పౌరసత్వం ఉన్నా ఉద్యోగం లేకపోతే సామాన్యులకి ఏమీ ఉపయోగం ఉండదు. అది ఒక కార్డ్ మాత్రమే; గ్రీన్ కార్డ్ వస్తే పిల్లల చదువులకి తక్కువ ఖర్చు అవుతుంది, భవిష్యత్తుకి ఢోకా ఉండదు అనేది కొంతమంది ఆలోచన. కానీ అమెరికా ఆర్ధిక వ్యవస్థ బాగాలేదు, అప్పుల్లో ఉంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనే భావనతోనే అమెరికా గోల్డ్ కార్డులు అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.
అమెరికాలో ప్రతి దాని రేట్లు బాగా పెరిగిపోయాయి, గన్ కల్చర్ మరియూ విపరీత ధోరణి కలిగిన న్యాయవ్యవస్థ. దీనికి తోడు సామాన్యులకి అస్థవ్యస్థంగా ఉండే హెల్థ్ కేర్ సిస్టం. ఎన్నికలప్పుడు అమెరికా గురించి, అమెరికాలో నెలకొన్న, దిగజారిన పరిస్థితులను గురించి ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ ఏమన్నాడో ఎక్కువ మంది చూసి, విని ఉంటారు.
ఎంత డబ్బు ఉన్నా ఇండియా పౌరసత్వం కొనటం కుదరదు మరియూ డబ్బు ఉంటే ఇండియాలో 70% పనులే అవుతాయి కానీ డబ్బు ఉంటే అమెరికా గ్రీన్ కార్డ్ కొని ఆ తర్వాత అమెరికా పౌరసత్వం పొందొచ్చు. ఎక్కువ డబ్బు ఉంటే అమెరికాలో ఏదైనా సాధ్యమే, 90% పనులు ఏవైనా చేయొచ్చు. డోనాల్డ్ ట్రంప్ మీద ఎన్ని కేసులు ఉన్నా చివరికి అతనే అమెరికా అధ్యక్షుడు అయ్యాడు.
నేను చూసిన దాని ప్రకారం అమెరికాలో 50% మంచి ఉంది, 50% చెడు ఉంది. ఇండియాలో అంతే, 50% మంచి, 50% చెడు. ఏ దేశంలో అయినా మంచి చెడులు ఉంటై. మనకి కావాల్సిన లేదా మనం చూసే మంచి ఎక్కడ ఎక్కువ ఉంది అని చూసుకోవటమే.
నా అనుభవాన్ని అంతా ఉపయోగించి అమెరికా- ఇండియా ప్రధాన తేడాల గురించి ఒక మాట చెప్పమంటే ఒకటి చెప్తాను. అమెరికాలో పక్కోడు ఎంత ఎదిగినా గొప్పగా మాట్లాడరు, ఎంత సంకనాకిపోయినా, ఫెయిల్ అయినా తక్కువ చేసి మాట్లాడరు, రెండూ ఉండవు. ఇతరులని ఎక్కువ పట్టించుకోరు కాబట్టి ఇతరుల గురించి వెనక మాట్లాడటం, ఇతరుల గురించి పాలిటిక్స్ చేయటం ఎక్కువ ఉండదు.
అదే ఇండియాకి వచ్చేసరికి పక్కోళ్ళని పట్టించుకుంటాం, ఎదిగితే విపరీతంగా పొగుడుతారు, ఫెయిల్ అయితే విపరీతంగా తక్కువ చేసి మాట్లాడతారు ఎక్కువమంది. అందుకే ఇండియాలో పాలిటిక్స్ ఎక్కువ. అక్కడా ఇక్కడా, ఒకటి ఉంది కాబట్టి ఇంకోటి లేదు.
కోహ్లి ఎప్పటి నుంచో క్రికెట్ ఆడుతున్నాడు. మొన్న ఏదో మ్యాచులో సెంచరీ చేశాడు అని పొగడాల్సిన దానికంటే ఎక్కువ పొగడటం అవసరం లేదు, అక్కడ పెద్ద పోటీ కూడా లేదు. రాహూల్ గాంధీ ఆన్ క్లౌడ్ షూ వేసుకున్నాడు, అవి 2 లక్షలు అని అతని మీద ఏవో మాటలు…
అతను ధనవంతుల కుటుంబంలో పుట్టాడు, వాళ్ళ ఇంట్లో ముగ్గురు ప్రధానులు ఉన్నారు. అతను కూడా మనలాగే 100 రూపాయలు పెట్టి అమీర్ పేట్ సంతలో కొన్న చెప్పులే వేసుకోవాలా..? కెనడాలో ఉండే కల్లు గీత కార్మికుడి కొడుకు దగ్గర కూడా అవే ఆన్ క్లౌడ్ షూ ఉన్నై. నిజానికి అవి ఎవరు అయినా కొనొచ్చు. అంబానీ కొడుకు పెళ్ళి 500 కోట్లు పెట్టి చేస్తే దాని మీద కూడా ఏడుపులు.
అదే అమెరికాలో బిల్ గేట్స్ జీవితాంతం తోడు ఉన్న భార్యకి విడాకులు ఇచ్చి ఒక యంగ్ అమ్మాయిని చేసుకుంటే ఒక్కడు అంటే ఒక్కడూ అమెరికాలో పెద్ద గా మాట్లాడలేదు, ఒలంపిక్స్ లో 8 స్వర్ణాలు సాధించి అమెరికాలో ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్టినా వాళ్ళే స్వయంగా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తారు కానీ ర్యాలీలు, ఇంకొకరు వచ్చి కార్ బుక్ చేయటం ఉండదు.
ఇండియాలో మనిషి- మనిషి పలకరించుకుంటారు, సంఘ జీవనం ఉంటుంది, ఆ పండగలు, బంధుత్వాలు, మనస్సులు వేరే. చెడు లేదు అనటం లేదు కానీ చాలా మంది మనుష్యులు సహాయం చేస్తారు. మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు, మన బాగు కోరుకునే వాళ్ళూ ఉంటారు.
అమెరికాలో అసలు ఏదీ కోరుకోరు, బతికినా పట్టించుకోరు, చచ్చినా పట్టించుకోరు, ఎవరి జీవితం వాళ్ళది.
చివరగా……. ఇండియాలో “ఇండియా” ఉంది, అమెరికాలో “అమెరికా” ఉంది. ఏ దేశంలో పూర్తిగా మంచి లేదు , పూర్తిగా చెడు లేదు. కార్డులు, దేశాలు అనేవి మాట్లాడుకోటానికే కాని వాటిల్లో జీవితం ఉండదు. మన జీవితం అనేది మనం “జీవించటం” లో ఉంటుంది, అది ఎక్కడైనా….. – పూర్తి వ్యక్తిగత అభిప్రాయం
Share this Article