నందమూరి కల్యాణరామ్… ఏళ్లకేళ్లు ఎదురు చూడగా చూడగా డగా… ఒక్క హిట్… దాని పేరు బింబిసార… ఆహా, మావాడు కాకపోతే ఇంకెవ్వరూ ఈ పాత్ర పోషించలేరు, సూపర్, బంపర్ అంటూ జూనియర్ ఎన్టీయార్ తెగ మోశాడు… సరే, అప్పట్లో జానపద ఫిక్షన్ కథలు కాస్త ట్రెండ్ కదా… కాస్త కథ ట్రీట్‌మెంట్ కూడా బాగున్నట్టనిపించింది… సినిమా హిట్టయ్యింది…
ఇంకేముంది..? కల్యాణరాముడి సూపర్ ఇన్నింగ్స్ స్టార్టయినట్టే అని సైట్లు, యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సహా మోసేశారు… నిజానికి ఎన్టీయార్ వారసుల్లో బాలయ్య తరువాత జూనియర్ మాత్రమే హిట్ వారసుడు… ఇంకెవరూ లేరు… బాలయ్యకు ముసలితనం మీదపడుతోంది… జూనియర్ మాత్రమే వర్తమానంలో ఎన్టీయార్‌కు నటవారసుడు…
బింబిసార హిట్ తరువాత కల్యాణరాముడి అమిగోస్ సినిమా వచ్చింది… జూనియర్ జైలవకుశ తరహాలోనే అమిగోస్ సినిమాలో కల్యాణరాముడి పాత్రలు… అందులో ఒకటి నెగెటివ్ షేడ్స్ పాత్ర… నిజానికి ఆ పాత్రే సినిమా కథకు కీలకం… అది బలంగా పేలి ఉంటే సినిమా మరో బింబిసార అయ్యేది… కానీ కల్యాణరామ్ ఆ పాత్రకు అస్సలు సూట్ కాలేదు… ప్రత్యేకించి తన గొంతే ఆ పాత్రకు మైనస్…
Ads
ఆగండాగండి, ఈ సినిమా ముచ్చట ఇప్పుడెందుకు అంటారా..? రీసెంటుగా టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం చేశారు… కొత్త సినిమాయే కదా… కానీ రేటింగ్స్ తుస్సు… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో జస్ట్, 3.18… అంటే టీవీక్షకులు సైతం ఛీత్కరించేశారన్నమాట థియేటర్ ప్రేక్షకుల్లాగే… కల్యాణరామ్, మాటీవీలో బ్రహ్మముడి అనే సీరియల్ రేటింగ్స్ 13 చిల్లర… మరి మన అమిగోస్ రేంజ్ ఏమిటో సమజైంది కదా బ్రో…
అసలు ఈ సినిమాకు సంబంధించి మరో చిరాకు పాయింట్ ఉంది… 1992లో బాలకృష్ణ, దివ్యభారతి ధర్మక్షేత్రం సినిమాలో ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ అని ఒకరినొకరు గట్టిగా అల్లుకుపోయిన పాట… ట్యూన్ బాగుండి, పైకి క్లాస్‌గా వినిపించినా సరే… ఊర మాస్ పాట అది… వేటూరి అంత త్వరగా దొరకడు గానీ పచ్చిదనం పిచ్చిపిచ్చిగా పులుముకున్న పాట ఇది… పెదవి కొరికే పెదవి కొరకే వంటి భేషైన పదప్రయోగాలు ఒకటీరెండు బాగున్నా… వేడి చెమ్మ, తొడిమ తెరిచే తొనల రుచికే వంటి చాలా కథలు పడ్డాడు… ఆ పాటను అమిగోస్ సినిమా కోసం రీమిక్స్ చేసి వదిలారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే పాట బాగానే వినిపిస్తోంది… కానీ చిత్రీకరణలో ఖూనీ చేశారు… కళ్యాణరాముడు అస్సలు సూట్ కాలేదు… కానీ హీరోయిన్ ఆషికా మాత్రం ఇరగదీసింది…
ఈ సినిమా విడుదలకు ముందు కూడా ఎందుకో బజ్ రాలేదు… హైప్ క్రియేట్ కాలేదు… బింబిసార వసూళ్లను బట్టి సినిమాకు మంచి బిజినెస్ జరిగి ఉండాల్సింది… కాలేదు, అంటే అదే చెప్పింది ఈ సినిమాకు అంత సీన్ లేదని… అదే జరిగింది… చివరకు టీవీలో వేసినా అదే జరిగింది… ఓటీటీలో భిన్నంగా ఎందుకుంటుంది..? వాస్తవానికి కథ భిన్నంగా బాగుంటుంది… కానీ దాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు రాజేంద్రరెడ్డి బాగా తడబడ్డాడు… బోల్తాపడ్డాడు…
ఒక్కటి మాత్రం నవ్వించింది… మూడు పాత్రల లుక్కుల్లో వేరియేషన్ ఏమిటో తెలుసా..? ఒకటేమో ప్రజెంట్ ట్రెండ్ ఫుల్ బవిరి గడ్డం… రెండో పాత్ర కాస్త స్టయిలిష్ గడ్డం… మూడోది రాముడు మంచి బాలుడు తరహాలో క్లీన్ షేవ్… మూడు పాత్రల నడుమ వేరియేషన్ ఇదే తప్ప ఇంకేమీ కనిపించదు…!! వెరసి… సినిమాను టీవీక్షకులు కూడా ఫోఫోవోయ్ అనేశారు…
Share this Article