అమిన్ సయానీ రేడియో కట్టేశాడు…. – మహమ్మద్ ఖదీర్‌బాబు
1952. దృపద్ ఘరానాలో సంగీతం నేర్చుకున్న రాజకీయవేత్త బి.వి.కేస్కర్ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అయ్యాడు. ఆయనకు హిందూస్తానీ సంగీతం ‘ఇతర’ ఘరానాల వల్ల సంకరం చెందుతున్నదని గట్టి అనుమానం. ముస్లిం, బ్రిటిష్ పాలన కాలంలో హిందూస్తానీ సంగీతం భారతీయ ఆధ్యాత్మికతకు ఎడంగా జరిగిందని విశ్వాసం. ఇక సినిమా పాటలైతే సంకర భాషతో భారతీయ సంస్కృతిని మట్టిలో కలుపుతున్నాయని కారం మిరియం. మంత్రి పదవి సంస్కరణకు ఉపయోగపడింది. ఆల్ ఇండియా రేడియోలో హిందీ సినిమా పాటలను బ్యాన్ చేశాడు. ఏ కాలంలో అయితే హిందీ సినిమా గీతాలు సువర్ణ వర్ణం పొదువుకుంటున్నాయో ఆ కాలంలోనే ఈ నిషిద్ధం.
బొంబైలో గుజరాతీ స్కూల్‌లో ప్రతిరోజూ ఉదయం ‘సరస్వతి శారదా మాయీ.. విద్యాదానీ దయానిధానీ’ అని సరస్వతి వందనం చేసి పాఠాలు చదువుకున్న ముస్లిం కుర్రవాడు అమిన్ సయానీ అదే 1952లో రేడియో సిలోన్‌లో అనౌన్సర్‌గా జీవితం మొదలెట్టాడు. బ్రిటిష్ వాళ్లు కొలంబోలో వదిలెళ్లిన షార్ట్‌వేవ్ ట్రాన్స్‌మిటర్లు సిలోన్ రేడియోకు బాగా ఉపయోగపడి కార్యక్రమాల వల్ల ఆదాయం కూడా వస్తోంది. అప్పటికి పాప్ మ్యూజిక్ కౌండ్ డౌన్ షో పెద్ద హిట్టు. ఆల్ ఇండియా రేడియోలో హిందీ పాటలు కట్టేశారు కదా మనం ట్రై చేద్దామా అని కొత్త కుర్రాడు సయానీకి ఒక చాన్స్ ఇచ్చారు. ఫ్రీ లాన్సరు. వారానికి ఇచ్చే సొమ్ము? పాతిక రూపాయలు.
Ads
1952. డిసెంబర్ నెలలో మొదటి షో ప్రసారం అవ్వాలి. అమిన్ సయానీ ప్రిపేర్ అవ్వాలి. ఎలా? ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా’ అన్నాడు వివేకానంద. అమిన్‌కు అక్కచెల్లెళ్లు లేరు. స్త్రీలంటే అభిమానం, గౌరవం. ‘బెహనో ఔర్ భాయియో’… అనే సంబోధన ఎంచుకున్నాడు. పుట్టుకతో గుజరాతీ. బొంబాయి వల్ల మరాఠి తెలుసు. ఇంగ్లిష్‌లో ఘనాపాఠి. ఉర్దూ నేర్చుకున్నాడు. హిందీ పండితుడు. సంస్కృతం స్పష్టంగా పలుకగలడు. కనుక ఒక మిశ్రమ భాష అతని సొంతం. చిన్నప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం వల్ల, గ్వాలియర్‌లో రబీంద్ర సంగీత్ పాడటం వల్ల, తల్లిదండ్రులు తరచూ సినిమా రికార్డులు కొనేవారు కనుక బాల్యం నుంచే ఏది మంచిపాటో గుర్తించగలడు.
సరే.. సరే… మరి హృదయం కావాలి కదా మాటకు. మాటలోని ఆత్మకు. అమిన్ తల్లి గాంధీ గారికి కూతురు వంటిది. తాతగారు గాంధీ వ్యక్తిగత డాక్టర్లలో ఒకడు. గాంధీ ఆర్ద్రత, మాట మెత్తదనం అమిన్‌కు గొప్ప ఆదర్శం. ఇంకేంటి. మూర్తిమత్వం సిద్ధమైంది. మాట దయతో నిండింది.
తొలి షో బ్రాడ్‌కాస్ట్ అయితే అమిన్ పేరు మారుమోగిపోయింది. ఉత్తరాలు బస్తాలకు బస్తాలు వచ్చాయి. మరుసటి షో సూపర్‌హిట్. సంవత్సరం తిరిగే సరికి పోస్ట్‌ఆఫీస్ వాళ్లు ప్రతి వారం 60 వేల ఉత్తరాలు మోసుకొని రావాల్సి వచ్చింది.
అమిన్ హిందీ సినిమా సంగీతంలో ఉండే ‘మిఠాస్’ను శ్రోతలకు వివరించే తీరు, ఆ పాట ఎందుకు బాగుంది… అది ‘ప్యారా గీత్’ ఎందుకు అయ్యింది వివరిస్తూ ఉంటే లేని మాధుర్యం కనపడేది. బినాకా గీత్‌మాలా చార్ట్‌లో ఒక పాట నిలిస్తే ఆ పాట రికార్డులు అమ్ముడుపోయేవి. లతా, రఫీ, ముకేష్ గాయకులు… నౌషాద్, శంకర్–జైకిషన్ సంగీతదర్శకులు… గీత రచయితలు… ఎన్ని పనులు, రికార్డింగ్‌లు ఉన్నా బుధవారం సాయంత్రం ప్రసారమయ్యే బినాకా గీత్‌మాలా కోసం ఒక చెవి తీసి పక్కన పెట్టేవారు.
కళ ఉతృష్టం ఎప్పుడవుతుంటే అది ఉత్కృష్టమని చెప్పగలిగే ఆరాధ్యుడు ఉన్నప్పుడు. హిందీలో వచ్చిన గొప్ప గొప్ప పాటలు కేవలం అమిన్ సయాని చెప్పడం వల్ల సామాన్య శ్రోతల దృష్టిలో మరింత గొప్పవి అయ్యాయి. అనామకంగా పోయిన సినిమాల్లోని విలువైన వజ్రాలను దుమ్ము తుడిచి చూపితే ఆ పాటలు చనిపోకుండా బతికిన సందర్భాలున్నాయి.
‘బెహనో.. ఔర్ భాయియో’ అని కోట్లాది మంది శ్రోతల ఇంటి మనిషి అయిన అమిన్ తన శ్రోతల నుంచి పొందిన ప్రేమ అంతా ఇంతా కాదు. రాఖీ పండగ వస్తే అతని ఆఫీసు కుప్పలు తెప్పలుగా మహిళా శ్రోతల నుంచి వచ్చిన రాఖీలతో నిండిపోయేది.
‘సినిమా పాటలు ఏ భాషవైనా అవన్నీ భారతీయతను కలిగి ఉంటాయి. అందుకే భారతీయులను కలిపి ఉంచుతాయి’ అంటాడు అమిన్.
అమిన్‌కు ‘తూ గంగాకీ మౌజ్ మై జమునా కా ధారా’ ఇష్టం. ఈ దేశంలో గంగ, జమున… ఉభయ నదుల వొడ్డున విరాజిల్లిన అలాయి బలాయి సంస్కృతి బర్‌కరార్‌గా ఉండాలని కోరుకుంటాడు.
ఈ అమృతజీవి, అమిన్ సయానీ, తన 91వ ఏట నేడు– బుధవారం కన్ను మూశాడు. అతనికిష్టమైన మరో పాట– ‘ఆ మొహబ్బత్‌కి బస్తీ బసాయేంగే హమ్’. బేషక్.
Share this Article