జైనుల ప్రార్థనల్లో తరచూ వినిపించేది మిచ్చామి దుఃఖడం… అంటే ఉజ్జాయింపుగా అర్థం… ‘‘అమంగళం అంతా తొలగిపోవుగాక…’’ అంటే చెడు, బాధాకరమైనవి వెళ్లిపోవుగాక అని..! మనో ప్రక్షాళన ఇది… భావి వైపు ఆశావాదపు చూపు… అమీర్‌ఖాన్ తీసిన లాల్‌సింగ్‌చద్దా అత్యంత ఘోరమైన డిజాస్టర్‌ను చవిచూసిన సంగతి తెలుసు కదా… ఇదుగో ఈ వాక్యంతో ఓ క్షమాపణ వీడియో అమీర్‌ఖాన్ ప్రొడక్షన్‌కు సంబంధించిన సోషల్ మీడియా వేదికల మీద ప్రత్యక్షమైంది…
నిజంగానే ఓ విశేషమే… చాలామంది నమ్మడం లేదు… బహుశా అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాకింగుకు గురైనవేమో, అందుకే ఈ సారీ ప్రకటనలు వస్తున్నాయేమో అనుకుంటున్నారు… ఈ వీడియోలో ఒకసారి ఇన్‌సేన్ అని వచ్చింది తొలుత… తరువాత నెటిజనమే గుర్తుచేయడంతో ఆ వీడియో డిలిట్ చేసి, ఇన్‌సాన్ అని సరిచేసి, మళ్లీ పోస్ట్ చేశారు… సో, రియల్ వీడియోయే కావచ్చు… అయితే ఎందుకీ క్షమాపణ..? ఎవరికి..?
Ads
సినిమా అనేది ఓ దందా… వినోదవ్యాపారం… కోట్లు పెట్టుబడి పెట్టి అమీర్‌ఖాన్ ఓ సినిమా తీశాడు… చివరకు చిరంజీవి వంటి ప్రముఖులు కూడా మద్దతు పలికి, ఆ వ్యాపారానికి సమర్పకులు కూడా అయ్యారు… ఎవరి డబ్బు యావ వాళ్లది… కానీ అమీర్‌ఖాన్, కరీనాఖాన్ గత వైఖరులు కొందరికి నచ్చలేదు, బాయ్‌కాట్ పిలుపులు ఇచ్చారు… ఇవన్నీ ఈకాలంలో సహజమే…
సినిమా ఏమాత్రం బాగున్నా ఆ పిలుపులు ఏమీ పనిచేయవు, ఎవడినీ థియేటర్‌కు రాకుండా ఆ పిలుపులు ఆపలేవు… సింపుల్‌గా సినిమా బాగాలేదు… ఆమీర్‌ఖాన్ సినిమాలో ఉండాల్సినంత బలం, జిగి, థ్రిల్, పంచ్ లేవు… దాంతో మౌత్ టాక్ ప్రబలింది… దాంతో సినిమా తన్నేసింది… అసలే యాంటీ -హిందీ సినిమా ట్రెండ్ నడుస్తోంది… దానికితోడు నాసిరకం సరుకు… అదీ కారణం…
చాలా దారుణమైన డిజాస్టర్… కొందరు బయ్యర్లకు ఆమీర్‌ఖాన్ కొంత డబ్బు పరిహారంగా కూడా ఇవ్వడానికి అంగీకరించాడని తాజా వార్తలు చెబుతున్నాయి… అవన్నీ సరే, అది కూడా కామనే… ప్రత్యేకించి తెలుగు, తమిళ రంగాల్లో పిచ్చిపిచ్చిగా కోట్లు వెనకేసుకుంటున్న హీరోలు బయ్యర్లు నెత్తిన ఎర్ర తువ్వాలేసుకుంటే ఎంతోకొంత పరిహారం పడేస్తున్నారు… అదిప్పుడు దీంతో హిందీలోకి పాకినట్టుంది తాజాగా…
‘‘మనం మనుషులం… తప్పులు చేస్తుంటాం… కొన్నిసార్లు మన మాటలతో… కొన్ని చేష్టలతో… కొన్నిసార్లు తెలిసి, ఇంకొన్నిసార్లు కోపంతో… మరికొన్నిసార్లు నవ్వులాటగా… అసలు కొన్నిసార్లు ఏమీ మాట్లాడకుండా… నేను మిమ్మల్ని ఏ విధంగానైనా నొప్పించి ఉంటే, క్షమించండి, మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను’’… రఫ్‌గా ఆ వీడియోలో ఉన్నది ఇదే… షారూక్ ఖాన్ ‘కల్ హో నహో’ థీమ్ బ్యాక్ డ్రాప్‌లో… నిజానికి ఆ వాయిస్ ఆమీర్‌ఖాన్‌ది కాదు…
ఇంతకీ ఎవరిని క్షమాపణ అడుగుతున్నట్టు..? బాయ్‌కాట్ పిలుపునిచ్చినవాళ్లనా..? అలా అడిగితే తప్పే… వాళ్ల ఆరోపణల్ని అంగీకరించినట్టు..!! ప్రేక్షకులను అడుగుతున్నట్టా..? ఆఫ్టరాల్ సినిమా… అన్నీ వాళ్లకు నచ్చాలని ఏముంది..? నచ్చితే చూస్తారు, లేదంటే మరో సినిమా… ప్రతి సరుకూ మెచ్చాలని ఏమీ లేదు కదా… సో, వాళ్లకూ క్షమాపణ అవసరం లేదు… పోనీ, బయ్యర్లకా..? వాళ్లదీ దందాయే… సినిమా హిట్టయితే లాభపడేవాళ్లు కదా… ఇందులో పోయింది, ఇది వ్యాపారబంధం, వాళ్లకు బహిరంగ క్షమాపణలు అక్కర్లేదు… ఎవరికి ఈ వింత క్షమాపణ ఆమీర్..?! దేనికోసం..!! అమంగళం, చెడు అంతా తొలగిపోవుగాక అంటున్నావంటే నీ పాత వ్యవహారశైలి చెడు అని ఒప్పుకుంటున్నట్టా..?!
Share this Article