.
తప్పు చేసేవాడు ఇతరుల తప్పుల్ని వెతకడం, తప్పుపట్టడం తప్పు..! ఉదాహరణకు అమిష్ త్రిపాఠి… పాపులర్ రచయిత… బహుశా ఇండియన్ ఇంగ్లిష్ రైటర్లలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ తనే కావచ్చు, అమ్మిన పుస్తకాల ప్రతుల సంఖ్య కోణంలో చూస్తే…
తన తాజా పుస్తకం ది చోళ టైగర్స్, అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ విడుదల చేశాడు మొన్న… ఇది ఆయన ఇండిక్ క్రానికల్స్ సీరీస్‌లో రెండో భాగం… ఈ బుక్ రిలీజ్ కార్యక్రమానికి నటుడు జిమ్మీ షేర్‌గిల్, దర్శకుడు ఒమ్ ప్రకాశ్ మెహ్రా, నటుడు- నిర్మాత జంట రవి దూబే, సర్గున్ మెహతా హాజరయ్యారు…
Ads
పుస్తకావిష్కరణ సందర్భంగా అమిష్ చరిత్ర వక్రీకరణపై మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు… ‘‘పాఠ్యపుస్తకాలు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కూడా చరిత్రను తప్పుగా చూపడంలో పాత్ర వహించింది… మనకు అలావుద్దీన్ ఖిల్జీ అంటే రణవీర్ సింగ్, అక్బర్ అంటే హృతిక్ రోషన్, ఔరంగజేబ్ అంటే అక్షయ్ ఖన్నా గుర్తొస్తారు… కానీ వారు నిజానికి సెంట్రల్ ఏషియా నుండి వచ్చినవారు… మనం వెనక్కి కాలయానం చేస్తే, వారు మనకు చైనీస్‌లా కనిపిస్తారు… నిజానికి వారు చైనీయులు కాదు కానీ చైనాను కూడా దెబ్బతీసినవారే.. ”
‘‘ఖిల్జీ, అక్బర్ వంటి పాలకులు ఉర్దూ మాట్లాడలేదు… వారు టర్కిష్ లేదా ఫార్సీ భాషలు మాట్లాడేవారు. బ్రిటిష్ పాలకులు సినిమాల్లో విదేశీయుల్లా కనిపిస్తారు, ఇంగ్లీష్ మాట్లాడుతారు. కానీ ఖిల్జీని రణవీర్ సింగ్ ఉర్దూలో మాట్లాడుతున్నట్లు చూపించడం వాళ్లను స్థానికుల్లా భావించేలా చేస్తుంది. ఇది చరిత్రకు అన్యాయం..,”
ఇలాంటి చిత్రణలు ఆక్రమణదారుల అసలు స్వరూపాన్ని చెదరగొడతాయి, దాడులు విదేశీ పాలకుల వల్ల జరిగాయి కానీ వాటిని భారతీయ ముస్లింలతో అనవసరంగా కలిపేస్తారు… అలాగే చరిత్రను బోధించే తీరు ఉద్దేశపూర్వకంగా విభజనాత్మకంగా ఉంది…
మన చరిత్రను ప్రధానంగా బ్రిటిష్ రాసారు. వారి అజెండా స్పష్టంగా ఉంది. దురదృష్టవశాత్తూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. ఉదాహరణకు, బ్రిటిష్ వలసరాజ్యాన్ని ఎప్పుడూ క్రైస్తవ ఆక్రమణగా పిలవలేదు. కానీ టర్కిష్ పాలనను ‘ఇస్లామిక్ ఆక్రమణ’ అని పిలిచారు. ఎందుకు? ఇది మనలో విభజన కలిగించడానికే..,” … ఇవీ తన అభిప్రాయాలు…
సరే, భారతీయులు తమ సంస్కృతిని కాపాడుకునేందుకు 1300 ఏళ్లు పోరాడారనీ, దాన్ని గర్వంగా చెప్పుకోవడమే ఇండిక్ క్రానికల్స్ సీరీస్ ఉద్దేశమని చెప్పుకొచ్చాడు…
ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే..? సినిమాల్లో ఒక పాత్రను ఎలా చూపాలి అనేది రచయిత, దర్శకుడు దృష్టికోణం, ఆలోచనల ప్రకారం ఉంటుంది… కొంత ఫిక్షన్ యాడ్ అవుతుంది… ఖిల్జీ, ఔరంగజేబు, అక్బర్ పాత్రలకు వేరే దేశాల నుంచి హీరోలను తీసుకురావాలా..? ఉర్దూ మాట్లాడితే తప్పేముంది..? భారతీయులకు ఎలా ఆ కథలు చెబితే బాగుంటుందో అది ఆ సినిమా టీమ్స్ ఇష్టం కదా, అందులో వక్రీకరణ ఏముంది..? తప్పు చిత్రణ ఏముంది..?
అసలు చరిత్రలు, వక్రీకరణలు అంటే మొదట గుర్తొచ్చే పేరే ఈ రచయితది… అందరికీ తెలిసిన కథల్ని లేదా పురాణాల్ని రీటెల్లింగ్ చేస్తే తప్పేమీ లేదు… చాలామంది చేస్తారు… కానీ మూలకథను ఎవరూ మార్చరు… తమ దృక్కోణంలో కథ రాస్తారు లేదా చెబుతారు… కానీ ఈ అమిష్ ఇష్టారాజ్యంగా పురాణాల్ని మార్చేశాడు… ఒరిజినల్ కథకు కాస్త ఫిక్షన్ జతకలవడం కాదు, ఏకంగా ఫిక్షన్‌నే ఒరిజినల్ కథ అన్నట్టు నమ్మించే విఫల ప్రయత్నం చేస్తాడు…
తను గతంలో రాసిన శివ ట్రయాలజీ (ఇమోర్టల్స్ ఆఫ్ మెలుహా, సీక్రెట్ ఆఫ్ ది నాగాస్, ది ఓత్ ఆఫ్ ది వాయుపుత్రాస్) గానీ, అలాగే తరువాత రాసిన రామ్-సీతా-రావణ్ సిరీస్ గానీ… ఇవి అసలు పురాణాల, ఇతిహాసాల కథలు కానేకాదు — మిథాలజికల్ ఫిక్షన్ (mythological fiction)… అంటే, పురాణాల/ ఇతిహాసాల నుంచి ప్రేరణ తీసుకుని, తన ఊహాశక్తితో కొత్తగా కథలు మలచాడు… ఇది కదా వక్రీకరణ అంటే…
ఇప్పుడు తను ఇతరులు చరిత్రను వక్రీకరిస్తున్నారని… అదీ స్థానిక మొహాలు, స్థానిక భాష వాడితేనే వక్రీకరణ అన్నట్టుగా మాట్లాడటం అబ్సర్డ్… అంటే పురాణాలను తన కల్పనకు తగ్గట్టు మార్చుకోవడంలో ఎటువంటి సంకోచం చూపని రచయిత, చరిత్రను మాత్రం వక్రీకరించకూడదని ఇతరులకు బోధలు ఇవ్వడం ఎంత వరకు సమంజసం..? ఇతరులను తప్పుపట్టే హక్కు ఉందా..? ద్వంద్వ వైఖరి, ముందు పురాణాల వక్రీకరణలకు నువ్వు కదా సమాధానం ఇవ్వాల్సింది అమిష్..?
Share this Article