నిజానికి సినిమా నటులతో పోలిస్తే టీవీ నటులకే నటన కష్టం… సినిమా నటులదేముంది..? ఎక్కువగా లాంగ్ షాట్స్ ఉంటయ్… ఎవరి మొహంలో ఏం ఉద్వేగాలు పలుకుతున్నాయో ఎవడు చూడొచ్చాడు..? మరీ క్లోజప్ షాట్స్ ఉంటనే సదరు నటుల అసలు సత్తా బయటపడేది… అలాంటి షాట్లు ఇప్పుడు సినిమాల్లో తక్కువగా ఉంటున్నయ్… ఎందుకంటే…
మన హీరోలకు, స్టార్ నటులకు పెద్దగా నటన రాదు… రకరకాల కారణాలతో ఇండస్ట్రీలో చెలామణీ అయిపోతుంటారు… వాళ్లకు క్లోజప్పులు పెట్టే సాహసం దర్శకులకు ఉండదు… పెట్టినా చూసే సాహసం ప్రేక్షకులకు ఉండదు… శర్వా, నాని వంటి కొందరు మినహాయింపు… ఇక హీరోయిన్లు, ఆడ తారలైతే ఇంకా ఘోరం…
Ads
వాళ్ల ఎంపికకూ బోలెడు తెర వెనుక కారణాలుంటయ్… దట్టంగా రంగులు పూసి, ఒంపుసొంపులు చూపి ప్రేక్షకుల కళ్లను కప్పేస్తారు… వాళ్లకూ క్లోజప్పు కష్టాలుంటయ్… అందుకే వీలైనంతవరకూ దర్శకులే రిస్క్ దేనికని అవాయిడ్ చేస్తుంటారు… కానీ టీవీ సీరియళ్లలో వేరు… వాటి కథాకథనాలు, ట్రీట్‌మెంట్, సాగదీత, కామన్ సెన్స్ లోపించిన సీన్లు గట్రా కామన్… ఏ సీరియలూ మినహాయింపు కాదు… డంపింగ్ యార్డు సరుకే… కానీ టీవీ నటుల్ని మాత్రం మెచ్చుకోవాలి…
…(private photo shoot)…
కొందరిని కాదు, చాలామందిని… కన్నడ టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తారలు అక్షరాలా తెలుగు టీవీ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు… అలాగని మెరిట్ లేక కాదు… బ్రహ్మాండంగా నటిస్తున్నారు… వాళ్ల మొహాల్లో భావోద్వేగ ప్రకటనకు కష్టపడతారు… రిహార్సల్ చేసుకుంటారు… ఒకరిద్దరు తమిళ, మలయాళ తారలు కూడా… మలయాళ తారల్లో ప్రేమి విశ్వనాథ్… తమిళ తారల్లో అమృత గౌరీరాజ్… ఎస్, ఈ గౌరీ రాజ్ గురించే చెప్పుకునేది…
ఒకప్పుడు జీతెలుగు చానెల్‌లో వచ్చే ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ ఆ టీవీ సీరియళ్లలో నంబర్ వన్… మంచి రేటింగులతో మాటీవీ సీరియళ్లకూ పోటీ ఇచ్చేది… తరువాత దాన్ని భ్రష్టుపట్టించారు… ఆ చానెల్ టాప్ 30 ప్రోగ్రాముల్లో ఎక్కడో దిగువన కనిపిస్తోంది ఇప్పుడు… సీరియల్ పరమ దరిద్రం… అందులో సందేహమే లేదు… కానీ అందులో నటించే వాళ్లు మాత్రం ఏక్‌సేఏక్… ఆమధ్య అనుశ్రీ ఇరగ్గొట్టేసింది… సీరియల్‌లో ప్రతి నటుడినీ, ప్రతి నటినీ డామినేట్ చేసింది ఒక దశలో…
ఇప్పుడు ఆ మీరా పాత్ర గానీ, ఆమె గానీ కనిపించడం లేదు… ఇప్పుడు అమృత గౌరీరాజ్ డామినేట్ చేస్తోంది… ఎవరబ్బా ఈమె అని ఆరా తీస్తే, చెన్నై బార్న్ అని తెలిసింది… ఆమధ్య రాజశేఖర్ అని తెలుగు పోలీసాఫీసర్‌ను పెళ్లిచేసుకుందట… ఇక వేరే బయోగ్రఫీ ఏమీ కనిపించదు… తెలుగు సీరియళ్లలో సీనియరే… మనసు మమత, గృహప్రవేశం, లక్ష్మి కల్యాణం, కథలో రాజకుమారి, రుద్రమదేవి, నిన్నే పెళ్లాడతా, రోజా, మట్టిగాజులు… అన్నీ ఆమే…
ప్రేమ ఎంత మధురం సినిమాలో రాగసుధ అనే కేరక్టర్‌లో చేస్తోంది… కేరక్టరైజేషన్ బాగాలేదు, కానీ ఈమె నటనకు ఢోకా లేదు… రోజురోజుకూ హీరో శ్రీరాం నటన పేలవంగా మారిపోతుండగా, కేరక్టరైజేషన్ లోపంతో రాంజగన్ కూడా చిరాకెత్తిస్తున్నాడు… హీరోయిన్ వర్ష వోెకే… అయితే గౌరీ రాజ్ తన సీనియారిటీ వల్ల కావచ్చు, తన మెరిట్ వల్ల కావచ్చు… పలు సీన్లను హైజాక్ చేసేస్తోంది… గుడ్…
నిజానికి సినిమాతారలతో పోలిస్తే వీళ్లకు ఏం తక్కువ..? వీళ్లకు కదా నిజానికి గుర్తింపు దక్కాల్సింది… గతంలో టీవీ అవార్డులు కూడా ఇచ్చేది ప్రభుత్వం… ఆ సంప్రదాయానికి పాతరేసినట్టున్నారు కదా… లేకపోతే ఇలాంటివాళ్లకు ఇంకాస్త ఎక్కువ గుర్తింపు వచ్చేదేమో…!!
Share this Article