Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కన్నడ ప్రతిపక్షాల నెత్తిన అమూల్ పాలధార

April 13, 2023 by Rishi

Palu – Pali’trick’s:

పల్లవి:-
పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ-
పాలిటి దైవమని బ్రహ్మాదులు

చరణం-1
రోల గట్టించుక పెద్ద రోలలుగా వాపోవు
బాలునిముందర వచ్చి పాడేరు
ఆలకించి వినుమని యంబర భాగమునందు
నాలుగుదిక్కులనుండి నారదాదులు

Ads

చరణం-2
నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో
పారేటిబిడ్డనివద్ద బాడేరు
వేరులేని వేదములు వెంటవెంట జదువుచు
జేరిచేరి యింతనంత శేషాదులు

చరణం-3
ముద్దులు మోమునగార మూలల మూలలదాగె-
బద్దులబాలుని వద్ద బాడేరు
అద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడని
చద్దికి వేడికి వచ్చి సనకాదులు

అన్నమయ్య 32 వేల కీర్తనల్లో ఒక కీర్తన ఇది. పదాలతో చిత్రాలను, కదిలే దృశ్యాలను; సామాన్యమయిన మాటలు, పోలికలతో పురాణ కథల మర్మాలను చెప్పడంలో అన్నమయ్యది అసామాన్యమయిన శైలి. వేటూరి వారన్నట్లు- “అన్నమయ్య జానపదం జ్ఞానపథం; వెలుగు పథానికి తెలుగు పదం“.

దొంగను ఎవరయినా పట్టుకుంటారు. పట్టుకుని దోషిగా విచారణ చేస్తారు. నేరం రుజువయ్యాక శిక్షిస్తారు. దొంగను దొంగగానే చూస్తారు. సామాజికంగా దొంగకు దూరంగా ఉంటారు. దొంగ అంటేనే భయపడతారు. అలాంటిది పాలు, పెరుగు, వెన్న, మీగడలు కుండలకు కుండలు దొంగిలించిన ఒక పాలదొంగ దగ్గరికి వచ్చి…మాపాలిటి నువ్వే దైవమని బ్రహ్మ మొదలు దేవతలందరూ కాళ్లా వేళ్లా పడుతున్నారట.

పొద్దున్నే యశోద వెన్న చిలుకుతూ ఉంటే…అమ్మా ఆకలి…వెంటనే వెన్న పెట్టు…అది పెట్టు…ఇది పెట్టు…అని ఒకటే విసిగిస్తున్నాడు. అలిగి…ఇంట్లో వస్తువులన్నీ చిందర వందర చేస్తున్నాడు. బయటికి పంపితే ఊళ్లో వాళ్లతో గొడవలు…ఇంట్లో ఉంటే ఏ పని చేసుకోనివ్వడు. దాంతో ఏమి చేయాలో పాలుపోక చివరికి ఉట్టికి కట్టే నాలుగయిదు తాళ్లను కలిపి ముడి వేసి ఒక కొసను పిల్లాడి నడుముకు మరొక కొసను రోటికి కట్టి…పనిలో మునిగిపోయింది. ఆ పిల్లాడేమో రోటిని లాక్కుంటూ వెళుతుంటే…పైన ఆకాశంలో నారదాదులు నిలుచుని…వాళ్ల వాళ్ల సమస్యలు ఆ పిల్లాడికి చెప్పుకుంటున్నారు.

రెండు చేతులతో వెన్న కుండల్లో చేతులు పెట్టి విసుగు విరామం లేకుండా తింటూనే ఉన్న పిల్లాడి మూతి చుట్టూ వెన్న. పొట్ట మీద వెన్న చారలు. ఒళ్లంతా జిడ్డు. అలాగే వీధిలోకి వెళ్లి దుమ్ము ధూళిలో ఆడుకుంటున్నాడు. జిడ్డుకు దుమ్ము అంటుకుంది. నోట్లో జొల్లు కారుతోంది. అలాంటి పిల్లాడి ముందు నిలుచుని ఆదిశేషుడు మొదలయిన వాళ్లు వేదాలను క్రమ ఘన ఝట పద్ధతుల్లో స్వరయుక్తంగా పాడుతున్నారు.

వీధిలో అల్లరి చేస్తూ ఆడుకునే ఆ పిల్లాడిని చూడడానికి ఊరు ఊరంతా మూలల్లో దాక్కుని ఉంది. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తోంది. “హమ్మయ్య! ఇక్కడున్నాడు వెంకన్న రూపంలో” అని సనక సనందాదులు ఆ పిల్లాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తమ కష్టసుఖాలను చెప్పుకుంటున్నారు.

“బాల కృష్ణుడు” అన్న మాటే చెప్పకుండా చివరికి…ఆ బాలకృష్ణుడిని వెంకన్నగా మార్చిన అన్నమయ్య విన్యాసం ఇంకెన్ని యుగాలకయినా ఇంకొకరికి అసాధ్యం.

కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలో వీరశైవానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. శైవానికి సంబంధించిన లింగాయత్ అన్న కులమే పుట్టిన నేల అది. శివుడి వాహనం నంది. ఆ నంది అంటే కర్ణాటకలో భావోద్వేగపరమయిన అంశం. నంది బెట్టె( నంది హిల్స్) కొండల్లోనే పెన్నా నది పుట్టి…అనేక ఉపనదులతో కలిసి…ఆంధ్రలోకి ప్రవేశించి అనంతపురం, కడప, నెల్లూరుల మీదుగా బంగాళాఖాతంలో కలుస్తోంది.

మైసూరు చాముండేశ్వరి ఆలయం దారిలో అతి పెద్ద నంది కొలువై ఉంది.

కొన్ని దశాబ్దాలుగా కర్ణాటకలో ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోని నందిని పాలు, ఇతర పాల ఉత్పత్తులు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలోకి గుజరాత్ అమూల్ పాలు రావడంతో…నందిని-అమూల్ మధ్య యుద్ధంగా మారింది వాతావరణం.

సాధారణంగా హోమ్ మంత్రి అమిత్ షా ఆచి తూచి మాట్లాడతారు. ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ బల్బ్ వెలగలో ఆయన లెక్కలు ఆయనకుంటాయి. బల్బ్ వెలిగినా…స్విచ్ ఎక్కడుందో? ఎవరు ఆన్ చేశారో? తెలియకుండా జాగ్రత్తపడతారు. అలాంటిది ఎన్నికల వేళ  “ఇకపై కర్ణాటకలో నందిని పాలతో పాటు…అమూల్ పాలు కూడా ప్రవహిస్తాయి” అని ప్రకటించారు.

దాంతో ప్రతిపక్షాల నెత్తిన నిజంగానే అమిత్ షా పాలు పోసినట్లయింది. వెతకబోయిన తీగ ప్రతిపక్షాల కాలికి తగిలినట్లయింది. నందిని పాల ఉత్పత్తిదారులు లక్షల సంఖ్యలో ఉన్నారు.
“చూశారా!
ఎప్పుడూ వినంది!
ఎన్నడూ కనంది!
మన కర్ణాటక నందిని కాదన్నది గుజరాత్ అమూల్ నంది!”
అని కాంగ్రెస్, జె డి ఎస్ నంది పాట పాడుతున్నాయి.

బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాల్లో నందిని పాల ఉత్పత్తిదారుల్లో ఆందోళన మొదలయ్యింది. దాంతో స్థానిక బి జె పి నాయకులు  “మన ఎన్నికల నంది పాలకుండలో అమూల్ ఉప్పుకల్లు పడిందేమిటిరా నాయనా?” అని తలలు పట్టుకుంటున్నారు.

“పాలదొంగ వద్ద వచ్చి పాడేరు
తమ పాలిటి దైవమని”
అన్న అన్నమయ్య పాటనే మరో అర్థంలో
ప్రతిపక్షాలు పరవశించి పాడుకుంటున్నాయి.

ద్వాపరయుగంలో పిల్లాడు హేలగా పాలు దొంగిలిస్తే- “లీల”.
కలియుగంలో వ్యాపారానికి పాలు కలిపితే- “గోల”.

పాలముంచినా, నీట ముంచినా నీవే దిక్కు అన్నది సామెత.

కర్ణాటకలో పార్టీల ప్రచారంలో కూడా ఇదే సామెత తిరుగుతోంది-
“అమూల్ పాలు ముంచినా…
నందిని పాలు తేల్చినా…
మాపాల ఈ పాలే దిక్కు.
మా పాపాలు కడగడానికి ఈ పాలే మొక్కు”
అని.

ఫలితం ఎవరిపాలో కానీ…
ఎన్నికలు మాత్రం పాలసంద్రంలో మునిగితేలుతున్నాయి!

అందుకే-
పాలు తాగే పసిపిల్లలకు కూడా అర్థమయ్యేలా
“బొగ్గు పాల కడుగ పోవునా మలినంబు?”
అని వేమన అన్నాడేమో!
ఏమో!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions