.
Rochish Mon ….. ఇళైయరాజా పాట —– ‘ఆఘోరీ-పాట’ “ఓం శివో హం…”
2009లో వచ్చిన నాన్ కడవుళ్ తమిళ్ష్ సినిమాలోని పాట “ఓం శివో హం…”
ఇళైయరాజా పాటకు పెద్ద శాతం పామరులు, విజ్ఞులు, విదేశీయులు, సంగీత సాంకేతిక నిపుణులు, శాస్త్రీయ సంగీత వేత్తలు ఆకర్షితులవడం, ఇళైయరాజాను శ్లాఘించడం తెలిసిందే. అంతే కాదు ఇళైయరాజా పాటకు ఏనుగులు ఆకర్షితులవడం వంటి ఆశ్చర్యకరమైన సంఘటనలూ జరిగాయి.
Ads
ఈ “ఓం శివో హం…” పాటకు ఈ ప్రపంచ జీవనానికి అతీతమైన ఒక కోపిష్టుడు (కోపిష్టి) అఘోరీ ఆకర్షితుడయ్యాడు!
ఈ “ఓం శివో హం…” పాట చోటు చేసుకున్న నాన్ కడవుళ్ సినిమా కథ అఘోరీ జీవనం కేంద్రంగా ఉంటుంది.
ప్రముఖ, నాణ్యమైన, గొప్ప తమిళ్ష్ రచయిత జయమోహన్. నాన్ కడవుళ్ సినిమాకు మూలం జయమోహన్ రాసిన కథ. సినిమా కోసం పెనుమార్పులు వచ్చాయి. సినిమా స్క్రిప్ట్‌లోనూ, షూటింగ్‌లోనూ జయమోహన్ పెద్ద ఎత్తున పనిచేశారు.
సినిమా షూటింగ్ కాశీ అఘోరీల పూర్వరంగంలో (నేపథ్యంలో కాదు) జరిగింది… సినిమాలో వచ్చే ఒక పాత్రకు ఏ నటుడూ కాకుండా నిజమైన అఘోరీ అయితేనే బావుంటుందని దర్శకుడు బాలా, జయమోహన్ నిర్ణయించుకున్నారు.
- జయమోహన్ తన 23 యేళ్ల వయసులో అదే కాశీలో భిక్షాటన చేస్తూ అఘోరీల మధ్య తిరుగుతూ కొంత కాలం గడిపారు. తొలి దశలో జయమోహన్ ఒక కమ్యూనిస్ట్. జీవితంలో కలిగిన మార్పులు, వాస్తవాల అవగాహన, మానసిక పరిణతి, బుద్ధి పరిపక్వత రాగా కమ్యూనిజమ్ భయంకర రుగ్మతను వదిలించుకుని సరైన, మేలైన, విలువైన వ్యక్తి, రచయిత, పరిశీలకుడు అయ్యారు జయమోహన్!
నాన్ కడవుళ్ షూటింగ్ కాలంలో ఒక రోజున జంగిలీ బాబా అని పిలవబడుతున్న ఒక అఘోరీ జయమోహన్ కంటబడ్డారు. ఆ జంగిలీ బాబా తాను చిన్నప్పుడు చూసిన వ్యక్తే. కొన్ని దశాబ్దుల తరువాత కూడా ఆ అఘోరీ ఏ శారీరిక మార్పూ లేకుండా కనిపించారు.
ఆ అఘోరీని గుర్తుపట్టిన జయమోహన్
ధైర్యం చేసి దర్శకుడు బాలాతో ఆయన దగ్గరకు వెళ్లి ఆయన్ను సినిమాలో నటించమని అడిగారు. ఆ బాబా కోపంతో కొట్టినంత పని చేసి ఇద్దరినీ తరిమేశారు. ఆ బాబా పలు భాషల్లో మాట్లాడగలరు. బాలా, జయమోహన్ చేసేది లేక సినిమాలో ఆ బాబా పాత్రనే తొలగించేద్దామనుకున్నారు.
సినిమా షూటింగ్ కాశీలో కొనసాగుతోంది. ఒక రోజు ఈ “ఓం శివో హం…” పాట చిత్రీకరణ జరుగుతోంది… అటుగా వెళుతున్న సదరు జంగిలీ బాబా ఈ పాట విని షూటింగ్ మధ్యలోకి వచ్చారు. బాలా, జయమోహన్ ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఆ బాబా జయమోహన్ దగ్గరికి వచ్చి తమిళ్ష్‌లో “ఏమిటి ఈ పాట, ఏమిటి ఇదంతా” అని అడిగారు.
“వీరభద్రుడిపై పాట ఇది; పాటను చిత్రీకరిస్తున్నాం” అన్నారు జయమోహన్. షూటింగ్ చూస్తూ “మీరడిగనట్టు నేను ఇందులో నటిస్తాను” అని ఆ అఘోరీ బాబా అన్నారు; ఆపై నటించారు. సినిమా చివరి ఘట్టాలలో మనకు ఆ అఘోరీ కనిపిస్తారు. (ఈ ఉదంతాన్ని జయమోహన్ స్వయంగా చెప్పిన వీడియో నెట్లో ఉంది)
- డబ్బు విలువ ఎంత మాత్రమూ తెలియని ఆ జంగిలీ బాబా తాను ఏమడుగుతున్నారో తెలియకుండానే తాను నటించినందుకుగానూ బాలాను 50,000 అడిగి తీసుకున్నారు. ఆ మరుసటి రోజు ఆ ప్రాంతంలో ఉన్న జిలేబీ కొట్ల వాళ్లందరికీ ఆ డబ్బును పంచేసి ఆ బాబా తన దారిన వెళ్లిపోయారట.
జంగిలీ బాబా వంటి అఘోరీని సైతం ఒక ఇళైయరాజా పాట ఆకర్షించడం ఆశ్చర్యకరమైన విశేషం.
“ఓం శివో హం…” పాట ఇళైయరాజా చాల గొప్పగా చేసిన పాటల్లో ఒకటి. ఇళైయ రాజా 80ల వరకే గొప్ప పాటలు చేశారని కొందరు, 1995 తరువాత ఆయన గొప్ప పాటలు చెయ్యలేదని కొందరు అంటూంటారు… 2009లో కూడా ఇళైయరాజా ఇదిగో ఈ గొప్ప పాటను చేశారు.
ప్రధానంగా పంతువరాళి రాగంలో ఈ పాటను చేశారు ఇళైయరాజా. ఈ పాట సందర్భానికి పంతువరాళి రాగాన్ని ఎన్నుకోవడమే ఇళైయరాజా ప్రజ్ఞ. ఆ రాగాన్ని శ్రేష్ఠంగా సంధించారు ఈ పాటలో ఇళైయరాజా. వాద్య సంగీతం కూర్చిన విధం ఉన్నతం. కాల ప్రమాణాల పరంగా ఇళైయరాజా వాద్య సంగీత నిర్మాణ నైపుణ్యానికి ఈ పాట ఒక మేలైన మచ్చుతునక.
ఒక సినిమా పాట బావుండడం, మధురంగా ఉండడం, భావ స్ఫోరకంగా ఉండడం వంటివి చాల మౌలికమైన అంశాలు. ఆ అంశాలకు మించిన ఎత్తుల్లో విశిష్టత్వం, శ్రేష్ఠత్వం ఉంటాయి. ఆ విశిష్టత్వంతో, శ్రేష్ఠత్వంతో మౌలికమైన స్థాయికి మించిన ఎత్తులో ఎలమితో వచ్చిన పాట ఇది!
- పూర్తి సంస్కృత రచన ఇది. కవి వాలి రాశారు. గొప్ప సంస్కృతంతో, గొప్ప భావనా గరిమతో వాలి చాల గొప్పగా రాశారు! ఈ పాటకు పూర్వం వాలి ఒక ప్రైవేట్ పాటను “కామాక్షీ కరుణా విలాసిని కామకోఠి పీఠ వాసిని…” అంటూ సంస్కృతంలో రాశారు. అదీ ఇళైయరాజా సంగీతంలోనే; ఆ పాట పాడింది కూడా ఇళైయరాజానే.
అంతకు ముందు కణ్ణదాసన్ ఒక ప్రైవేట్ పాటగా కృష్ణుడిపై సంస్కృతం పాట రాశారు. ఆ పాటకు సంగీతం, గానం ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్.
“ఓం శివో హం…” అంటూ విజయ్ ప్రకాష్ చాల బాగా పాడారు. విజయ్ ప్రకాష్ గాత్ర ధర్మం ఈ పాటకు గొప్పగా పొసిగింది.
నాన్ కడవుళ్ సినిమాను ఎంత గొప్పగా తీశారో అంత గొప్పగా ఈ పాటను తీశారు దర్శకుడు బాలా. దర్శకుడు బాలాకు ప్రత్యేకమైన అభినందనలు.
‘మధ్య తరగతి అభిరుచి’, ‘మధ్య తరగతి ఆలోచనా సరళి’, మధ్య తరగతి బుద్ధి మాంద్యం’, ‘మానసిక దోషాల్ని మేధ అనుకోవడం’… వీటికి అతీతంగా మరో మేలైన స్థాయి చింతనతో, ప్రతిభతో, తెలివిడితో, తెలివితో ఇళైయరాజా చేసిన గొప్ప పాట ఇది.
వినండి
https://youtu.be/Xm9kjceWeEc?si=ydzwt1mrJ7CwffTn
రోచిష్మాన్
9444012279
Share this Article