.
మన నేర దర్యాప్తు వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థల డొల్ల వ్యవహారాన్ని అప్పుడప్పుడూ కొన్ని కేసులు ప్రబలంగా, నగ్నంగా పట్టిస్తుంటాయి…
పేదలు, ఖర్చులు పెట్టి లాయర్లను పెట్టుకోలేని వాళ్లు జైళ్లలోనే మగ్గుతుంటారు, అసలు నేరమే చేయకపోయినా ఏళ్ల కొద్దీ జైళ్లలో ఉంటారు, లేదా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు… ఇదీ అలాంటిదే…
Ads
ఝాన్సీ… ఉత్తరప్రదేశ్‌లోని ఓ పట్టణం… ఆ పోలీసులు గస్తీ తిరుగుతున్నప్పుడు యాభయ్యేళ్ల ఓ వ్యక్తి తారసపడ్డాడు… రొటీన్‌గా ఆరా తీస్తే ఆయన పేరు నాథునిపాల్ అనీ, కొన్నాళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాడని తెలిసింది… కానీ మరింత గట్టిగా అడిగితే తనది బీహార్‌లోని డియేరియా నివాసం అనీ చెప్పాడు…
అనుమానంతో బీహార్ పోలీసు రికార్డులతో సరిపోల్చితే… సదరు వ్యక్తి 17 ఏళ్ల క్రితం మరణించాడని కనిపించింది… అవును, తను చనిపోయినట్టు రికార్డుల్లో నమోదు కావడమే కాదు… తనను హత్య చేశారనే కేసు కూడా నడుస్తోంది…
హత్యకు గురైనట్టు రికార్డుల్లో, కోర్టులో నమోదైన వ్యక్తి సజీవంగా కనిపించేసరికి పోలీసులు ఆశ్చర్యపోయి మరిన్ని వివరాలు సేకరించారు…
‘‘నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు… చాన్నాళ్ల క్రితమే నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది… 16 ఏళ్లుగా నేను మా ఊరికి వెళ్లలేదు… బయటే బతుకుతున్నాను’’ అని చెప్పాడు అతను…
బీహార్ పోలీసులు మరికొంత సమాచారం ఇచ్చారు… అది 2009… ఈ వ్యక్తి మిస్సింగ్… ఆస్తి కోసం తన పెదనాన్న, ఆయన కొడుకులు తనను హతమార్చి, శవం కూడా మాయం చేశారని మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు…
వాళ్లు కేసు పెట్టేశారు… పెదనాన్నను, నలుగురు కజిన్స్‌ను లోపలేశారు… ఎనిమిది నెలలు జైలులో ఉన్నారు… తరువాత పెదనాన్న చనిపోయాడు… కజిన్స్ బెయిల్ మీద బయటికొచ్చారు… చిన్నవాడు పోలీసు… పదే పదే అడిగితే ఓ డీఐజీ తనను మాత్రం కేసు నుంచి తప్పించాడు… అదీ కథ…
పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే నాథునిపాల్… మరి ఇన్నేళ్లు ఏం చేశాడు, ఎలా బతికాడు, ఎందుకు మళ్లీ స్వగ్రామం వెళ్లలేదు వంటి వివరాలు, మరింత లోతు దర్యాప్తు కోసం తనను బీహార్ పోలీసులకు అప్పగించారు…
ఈ సజీవ మృతుడి సమాచారం విన్న కజిన్స్ ఫుల్ ఖుషీ… హమ్మయ్య, మమ్మల్ని సమాజం హంతకులుగా చూసింది, ఆస్తి కోసం చంపామని నిందించింది… ఆ కేసు నుంచే కాదు, ఆ నిందల నుంచి కూడా ఎట్టకేలకు బయటపడ్డాం… కానీ మా నాన్న మాత్రం నేరస్తుడిగానే మరణించాడు, అదీ బాధ అంటున్నారు ఆ కజిన్స్…
మరి ఆ పోలీసులు వీళ్ల నేరాన్ని చార్జి షీట్లలో ఎలా ఎస్టాబ్లిష్ చేశారు..? అంతా బభ్రాజమానం భజగోవిందం..!!
Share this Article