…….. ఏయ్ హారికా… నీకు బుద్దుందా..? నువ్వు బెస్ట్ కెప్టెన్వా..? కానేకాదు, అసలు అభిజిత్ ఇంగ్లిషులో మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకున్నవ్..? ఎందుకు పనిష్ చేయలేదు..? అసలు కెప్టెన్ బాధ్యతలేమిటో నీకు తెలుసా….. అంటూ నాగార్జున హారికకు క్లాస్ పీకుతుంటే… ఫాఫం నాగార్జున అని తెలుగు ప్రేక్షకులందరూ విపరీతంగా జాలిపడిపోయారు తన మీద… అదే నాగార్జున అభిజిత్‌ను మందలిస్తూ, ఉత్తుత్తిగా బెదిరిస్తూ… యు డూ ఇట్, దెన్ అపాలైజ్… యు డూ ఇట్, దెన్ అపాలైజ్ అని తను కూడా ఇంగ్లిషులో కోపగిస్తుంటే… జనమంతా పకపకా నవ్వుకున్నారు… మరి నువ్వు మాట్లాడింది ఏమిటి నాగార్జున అంకుల్…
ఈరోజు ఓ గెస్టును పట్టుకొచ్చాడు… తన పేరు కిచ్చా సుదీప్… కన్నడ నటుడు… తను కన్నడ బిగ్‌బాస్ షోకు హోస్ట్… నాగార్జున కేవలం రెండు సీజన్లకే హోస్ట్… కానీ సుదీప్ వరుసగా ఏడు సీజన్లకూ తనే హోస్ట్… రాబోయే ఎనిమిదో సీజన్‌కు కూడా తనే… తనకు తెలుగు రాదు, ఇంగ్లిషే, సరే, గెస్ట్ కాబట్టి వోకే అనుకుందాం…
Ads
మరి మొన్నమొన్నటిదాకా అమ్మా రాజశేఖర్ మాట్లాడింది ఏ భాష..? అది తెలుగా..? తమిళమా..? రెండూ కలిసిన ఓ చిత్రమైన సంకర కిలికిలి భాషా..? మరి దాన్ని ఎలా సహించావు నాగార్జున..? అది తెలుగులా వినిపించిందా నీకు..? మొదట్లో సూర్యకిరణ్ కూడా అంతే కదా… వాళ్లకు తెలుగు రాదని బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఎంపిక సమయంలో తెలియదా..? మోనాల్ ఈరోజుకూ తెలుగులో మాట్లాడలేదు… ఆమెకు తెలుగు ముక్క రాదని బిగ్‌బాస్ టీంకు తెలియదా..?
మూడునాలుగు వారాల్లో తెలుగు నేర్చేసుకుంటుంది, ధారాళంగా మాట్లాడేస్తుంది అనుకున్నారా..? జోకా..? తెలుగు నేర్చుకోవడం అంత వీజీయా..? అసలు మోనాల్ ఒక్కతే కాదు… అభిజిత్, అఖిల్ ఎప్పుడు తన్నుకున్నా ఇంగ్లిషులోనే కదా… మధ్య మధ్య సొహెయిల్ కూడా సింగరేణి ఇంగ్లిషు మాట్లాడుతూనే ఉన్నాడు… అసలు మందలించాల్సిన హారిక కూడా ఆంగ్లేయురాలే కదా… అందరూ ప్యూర్ ఆక్స్ఫర్డ్ బాపతే కదా నాగ్ అంకుల్… చివరకు మా అవినాష్ కూడా ఇక బాగుండదని భావించి తనూ చిన్నచిన్నగా ఇంగ్లిషులో పేకుతూనే ఉన్నాడు కదా… అరియానా కూడా ఆంగ్ల ప్రేమికురాలే కదా…
మరిక హౌసులో తెలుగుతనం మిగిలింది ఎక్కడ..? సోషల్ మీడియాలో జోరుగా ఓ జోక్ వ్యాప్తి చెందుతూనే ఉంది… ‘‘అయ్యా, స్టార్ మాటీవీ ఓనర్ గారూ… ఇకపై బిగ్‌బాస్ షో నడిచినంతసేపూ కాస్త ఈరోజు ఇచ్చినట్లుగానే తెలుగులో సబ్‌టైటిల్స్ వేయగలరు’’ అని ప్రేక్షకులు మొరపెట్టుకుంటున్నారట… అసలు బిగ్‌బాస్ అనే షో పేరు దగ్గర్నుంచి ఫినాలె అనే పదం వరకూ ఇంగ్లిష్ తప్ప ఏం ఏడ్చింది బాసూ అందులో…? మరి గొంగట్లో అన్నం తింటూ అభిజిత్ తెలుగు మాట్లాడటం లేదంటూ వెంట్రుకలు ఏరే పని దేనికి చెప్పు..? హారిక చెవులు పిండే కార్యక్రమం దేనికి చెప్పు…? మరీ ఇడ్డూరం కాకపోతే…!!
Share this Article