.
. ( Paresh Turlapati ) .. … TTD EO గారూ విన్నపాలు వినవలె…
మొన్న అలిపిరి మెట్ల మార్గం మీదుగా నడక ద్వారా తిరుమల కొండమీదకు చేరుకున్నప్పుడు నేను గమనించినవి.. భవిష్యత్తులో మార్పులు చేయాల్సినవి ఇక్కడ ఇస్తున్నాను.
Ads
దయచేసి పరిశీలించి చర్యలు తీసుకోగలరు !
1. నడక మార్గంలో టీటీడీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు చాలామంది పాదచారులకు ఉపయోగకరంగా ఉన్నాయి.. ఈ సెంటర్లో ఒక డాక్టరు, నర్సు ఉండి వచ్చినవారికి వెంటనే ప్రాథమిక చికిత్స చేస్తున్నారు.. డీ హైడ్రేషన్ లేకుండా ORS పాకెట్స్ ఇస్తున్నారు..ఈ ఏర్పాటు బావుంది
2. దాదాపు ప్రతి 500 మెట్లకు ఒకరు చొప్పున TTD విజిలెన్స్ విభాగానికి చెందిన కానిస్టేబుల్స్ పహరా కాస్తున్నారు.. ఈ ఏర్పాటు కూడా బావుంది
3. కొండపైకి వెళ్ళే భక్తులకు ఆయాసం వచ్చి, మంచి నీరు అవసరం ఎక్కువ పడుతుంది.. దుకాణాల్లో గాజు బాటిల్లో వాటర్ అమ్ముతున్నారు కానీ అదో పెద్ద ప్రహసనం అయిపోతుంది.. బాటిల్ ధర 30 రూపాయలు అదనంగా డిపాజిట్ చెయ్యాల్సి వస్తుంది.. అంతేకాదు 750 ml బాటిల్ వాటర్ ఖరీదు 30 రూపాయలు తీసుకుంటున్నారు ( బాటిల్ ఖరీదుకి ఇది అదనం ) రేటు ఎక్కువ వాటర్ తక్కువ అయ్యింది..
టీటీడీ ఆధ్వర్యంలో చాలా చోట్ల మంచి నీటి పంపులు ఏర్పాటు చేశారు కానీ దారిలో హనుమాన్ విగ్రహం వద్ద మాత్రమే RO plant water unit కనిపించింది .. అలాటి RO plant water unit’s మరో రెండు మూడు దారిలో ఏర్పాటు చేస్తే చాలామంది భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.. అలాగే నడక దారిలో చలివేంద్రాలు లాంటివి ఏర్పాటు చేసి భక్తులకు వేడి పాలు మజ్జిగ ప్యాకెట్లు అందచేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది
4. దారి పొడవునా జంతువులకు ఆహారం వెయ్యకండి అని బోర్దులు ఏర్పాటు చేశారు.. బహుశా ఆహారం వెయ్యడం వల్ల వాటికోసం జంతువులు నడక దారిలోకి వస్తాయని ఈ బొర్దులు ఏర్పాటు చేసి ఉంటారు.. మంచి ఏర్పాటు.. అయితే చాలామంది భక్తులు నడక దారిలోకి వస్తున్న జింకలకు ఆహారం అందించి సెల్ఫీలు తీసుకోవడం చూశా..
జింకల వరకు ఓకే.. అదే ఏ పులో వస్తే పరిస్థితి ఏంటి? తప్పు ఒకరిది.. శిక్ష అందరికీ ఫార్ములా అవుతుంది.. అందుచేత నడక మార్గంలో ఇరువైపులా ఫెన్సింగ్ వేయించడం ఉత్తమ సురక్షితమైన మార్గం.. గతంలో పులుల బారినపడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మీకు తెలిసిందే
5. ఒక కొండ మీదకు వచ్చే భక్తులకు టీటీడీ ఆధ్వర్యంలో వెంగమాంబ అన్నదాన సత్రంలో ఇస్తున్న ఆహారం నాణ్యత బావుంది కాబట్టి తిరుమలలో ఇంకో నాలుగైదు పాయింట్లు ఏర్పాటు చేస్తే భక్తులు ప్రైవేట్ హోటళ్ల దోపిడీ బారిన పడకుండా ఉంటారు.. నేను కొండపైన గమనించిన రెండు మూడు ఫుడ్ కోర్టులలో నాసిరకం ఆహారాన్ని అమ్మడం చూశా.. పరిశుభ్రత కూడా అంతంత మాత్రమే
6. మహాద్వారం దాటి లోపలికి వచ్చిన తర్వాత క్యూ లైన్ కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతుంది.. బంగారు వాకిలి దగ్గర యెటువంటి క్యూ లైన్ రెయిలింగులు లేకపోవడంతో అక్కడ విపరీతమైన తోపులాట ఉంటుంది.. మహాద్వారం నుంచి బంగారు వాకిలి దాటి లోపలికి వచ్చేవరకు ఒకరి వెనక ఒకరు మాత్రమే పట్టేంత రెయిలింగులు వేయిస్తే అక్కడ తోపులాట పెద్దగా ఉండదు..
అలాగే దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పుడు కూడా గర్భాలయం చుట్టూ యెటువంటి రెయిలింగ్ లు లేకపోవడంతో భక్తులు గుంపులు గుంపులుగా ద్వారం దాటవల్సి వస్తుంది.. కాబట్టి బంగారు వాకిలి దగ్గరా.. తిరిగి బయటకు వచ్చేటప్పుడు భక్తులను వన్ బై వన్ రెయిలింగ్ ద్వారా బయటకు పంపించగలరు
7. అన్నిటికన్నా ముఖ్యం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్.. గతంలో బ్రోకర్లు ఆన్లైన్ స్లాట్లు దుర్వినియోగం చేసి టికెట్లు బ్లాకులో అమ్ముకున్న సంగతి తెలిసిందే .. అప్పటి మీద పరిస్థితి కొంత మెరుగుపడ్డా ఇంకా బ్రోకర్ల హవా నడుస్తున్నట్టు ఆన్లైన్ స్లాట్ ప్లాట్ఫారం ఓపెన్ చేసి ట్రయల్ రన్ వేస్తే విషయం మీకు అర్థమౌతుంది..
ఆన్లైన్ స్లాట్ లో ఇంకో ఇబ్బంది దర్శనం స్లాట్ దొరికినవాళ్లకు రూమ్ స్లాట్ దొరకకపోవడం.. దర్శనం మరియు రూమ్ స్లాట్ కలిపి ఇస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది…
Share this Article