కథ మన తెలుగు క్రియేటర్స్ కొత్తగా రాసుకున్నది ఏమీ కాదు… విన్సి డా అనే బెంగాలీ సినిమా కథను తెలుగీకరించుకుని, రావణాసుర అని పేరు పెట్టుకున్నారు… ప్లాట్ భిన్నంగా ఉంటుంది… కానీ ఎప్పుడైతే దర్శకుడు సుధీర్ వర్మ రవితేజ కమర్షియల్ ఇమేజీకి, మార్కెట్‌కు అనుగుణంగా ఓ సగటు సాదాసీదా తెలుగు సినిమాగా మార్చాడో అప్పుడే అసలు కథ దెబ్బతినిపోయింది…
నిజానికి రవితేజను ప్రశంసించాలి… మంచి మెరిట్ ఉన్న నటుడు… మధ్యలో దెబ్బతిన్నా సరే, కొన్ని పిచ్చి సినిమాలతో ప్రేక్షకుల్ని హింసించినా సరే, తరువాత తేరుకుని, ఈమధ్య ధమాకా వంటి మంచి హిట్స్ ఇచ్చాడు… కాకపోతే మొహంలో వయస్సు పైన బడుతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తూ, క్లోజప్ షాట్స్‌లో ఇబ్బందిపెడుతుంటాయి… డాన్సుల్లో, ఫైట్లలో మాత్రం రవితేజకు వయస్సయిపోలేదు… సేమ్ ఎనర్జీ, సేమ్ జోష్… తను ఓ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఇలాంటి డార్క్ కేరక్టర్ అంగీకరించి, చేసినందుకు అభినందించాలి…
రొటీన్, ఇమేజీ బిల్డప్పు, ఫార్ములా కథలతో ఏదో సరిపెట్టేయకుండా… ఓ భిన్నమైన పాత్రను చేసి తనలోని నటుడిని తృప్తిపరిచిన రవితేజ ఎంతటి అభినందనీయుడో… ట్రీట్‌మెంట్ విషయంలో సగటు తెలుగు సినిమా పోకడనే ఆశ్రయించిన దర్శకుడు ఈ సినిమా బోరింగుకు బాధ్యుడు… ఒక్క రవితేజ తప్ప మిగతా కేరక్టర్లకు బలం లేదు, పెద్దగా స్కోప్ లేదు…
Ads
చూడబోతే మాత్రం భారీ తారాగణమే… ఏకంగా ఐదుగురు హీరోయిన్లు… సారీ, హీరోయిన్లు అనలేమేమో…. అయిదు పాత్రలు… వారిలో ఒక ఫరియా తప్ప ఎవరికీ స్క్రీన్ స్పేస్ పెద్దగా దక్కలేదు… రవితేజతో పాటు సుశాంత్, అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, రావురమేష్, మురళిశర్మ, జయప్రకాష్, సత్య… ఇలా బోలెడు మంది… ఏం లాభం..? మొత్తం రవితేజే కనిపిస్తుంటాడు… పాత్ర మారింది కానీ రవితేజ మారలేదు, సేమ్, తన స్టయిల్‌లో తను నటిస్తూ పోయాడు…
ఫస్టాఫ్ ఏదో సోసో అన్నట్టు నడిచీ నడిచీ ఇంట్రవెల్ దాకా మనల్ని కూడా ఎలాగోలా తోసుకుంటూ పోతుంది… ఇంట్రవెల్ బ్యాంగ్ బాగున్నా, ఇక సెకండాఫ్‌లో ఆ టెంపో సడలకుండా చూడాల్సిన దర్శకుడు తరువాత చేతులెత్తేశాడు… కథ ఎటుపోతున్నదో, క్లైమాక్స్ ఎలా ఉండబోతున్నదో మనకు అర్థం అవుతూనే ఉంటుంది… క్రిమినల్ లాయర్ కాదు, లా తెలిసిన క్రిమినల్ పాత్ర అని గతంలో సినిమా టీం చెప్పింది కదా… అదే రవితేజ పాత్ర…
ఐతే ఈ పాత్ర విషయంలో రవితేజ సాహసం చేసినా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారా అనేది డౌటే… అనేకచోట్ల లాజిక్ కనిపించని సీన్స్‌తో ఏదో క్లైమాక్స్ దాకా అడ్డదిడ్డంగా కథను తోసుకుపోతాడు దర్శకుడు… ప్రొస్తెటిక్ మేకప్పులు, మాస్కులు సరిగ్గా కుదరక ఆ డిఫరెంట్ వేషాలు పేలవంగా మారిపోయాయి… ప్చ్, రవితేజ తప్పులేదు, సేఫ్ ప్రాజెక్టు అనే కోణంలో దర్శకుడికి కూడా అనేకరకాలుగా కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పలేదు… ఒక్కటి మాత్రం నిజం… రవితేజ ఈ పాత్ర ఎంపికకు చేసిన ధైర్యం పూర్తిగా ఫలించలేదు… ప్రేక్షకుడికి చాలాచోట్ల బోరింగ్… రవితేజ ఉండి కూడా…!!
Share this Article