Taadi Prakash……… An extraordinary evening with a silverscreen Legend…
———————————-
అది 1993వ సంవత్సరం. మే నెల రెండోవారం. సికింద్రాబాద్ లోని ఆంధ్రభూమి దినపత్రిక ఆఫీసు. నేను న్యూస్ ఎడిటర్ని. డక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి ఎడిటోరియల్ సెక్షన్లు రెండూ ఒకే ఫ్లోరులో ఉండేవి. క్రానికల్ ఎడిటర్ టేబుల్ మీద ఒక లేండ్ లైన్, నా టేబుల్ మీద మరో లేండ్ లైన్ ఫోన్లు ఉండేవి.
క్రానికల్ లో రెండునెలల క్రితమే చేరిన ఇద్దరు కుర్ర జర్నలిస్టులు, ఎడిటర్ కేబిన్ లోకి వెళ్ళి ఫోన్ చేసే ధైర్యం లేక, నా దగ్గరికొచ్చారు. ఫోన్ చేసి మాట్లాడారు. “వచ్చేస్తాం, భానుమతిగారు రమ్మన్నారుగా, thank you” అన్నారు.
Ads
సినిమా భానుమతేనా? అని అడిగాను. అవునన్నారు. నేనూ రావచ్చా? అన్నాను. “రండి రండి” అన్నారు. ఈ చిన్న యాక్సిడెంట్ వల్ల భానుమతి గారిని ఇంటర్వ్యూ చేయగలిగాను
*** *** ***
సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో ఒక డాబా ఇల్లు. టెర్రస్ మీద ఏర్పాటు చేశారు. క్రానికల్ కుర్రాళ్ళు మాధవ్, సుబ్బు, భూమి రిపోర్టర్ ముక్కామల చక్రధర్ , నేనూ కూర్చున్నాం. ఒక అందమైన గుబురు చెట్టు మామీదికి వొంగి వుంది. పల్చని మేనెల వెన్నెలలో ఆకులు మెరుస్తున్నాయి. భానుమతి కొద్ది నిమిషాల్లో వస్తుందన్న ఊహే నన్ను కుదురుగా ఉండనివ్వడంలేదు.
బాటసారి సినిమాలో తెల్ల చీరలో ‘ఓ బాటసారి’ అని పాడే దిగులుకళ్ల ఎదురుచూపుల భానుమతి… ‘ కురియుమా కన్నీరు, ఆనవాలుగ బావమ్రోల’ అని మల్లీశ్వరిలో హృదయం ద్రవించేలా పాడిన భానుమతి…. ‘Queen of yester years’ కొన్ని నిమిషాల్లో మా ముందుకు రాబోతోంది.
భానుమతి వచ్చారు. ఒక సోఫాలాంటి పెద్ద కుర్చీలో కూర్చున్నారు. అపాయింట్ తీసుకున్నది క్రానికల్ కుర్రాళ్ళు గనక, నేను మాట్లాడకుండా కూర్చున్నాను. “మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నప్పుడు మీరెలా ఫీలయ్యారు.” అని మాధవ్ అడిగాడు. నిశ్శబ్దం. సమాధానం లేదు. మీరు నటించిన మొదటి సినిమా ఏంటి?… అదే నిశ్శబ్దం. “ఈ మాత్రం హోమ్ వర్క్ చేయకుండా నాతో మాట్లాడానికి వచ్చారా చవటసన్నాసుల్లారా?” అని ఆమె మౌనానికి అర్థం.
ఒక్క నిమిషం ఆగి,” మీరంతా కుర్రాళ్ళలా ఉన్నారు. నేనే మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. మీకు ఇప్పటి సినిమాలు నచ్చుతున్నాయా? అని ఆమె ఎదురుదాడికి దిగారు.” మాకు నచ్చవు” అని చెప్పాం. ఇలాకాదని కుర్రాళ్ళని వారించి నేను రంగం లోకి దిగాను. భానుమతిని చిత్తు చేసే ఎత్తుగడతో మొదలు పెట్టాను.
“మేడం, మల్లీశ్వరిలో తామరకొలను ముందు, ఎన్టీఆర్ ఒళ్లో తలపెట్టుకుని మీరు పాడిన” మనసున మల్లెల మాలలూగెనే “ఆంధ్రదేశం గుండెల్లో గుబాళించిందికదా, ఆ పాట పాడతారా? అని అడిగాను.” నాకే గుర్తు లేదు. ఆపాట మీకెలా తెలుసు? ” అన్నారామె. . కృష్ణశాస్త్రి గారు రాశారు కదండీ, మర్చిపోయారా? నిజమా? అన్నాను. ఏమో గుర్తులేదు బాబూ అన్నారు. నాకు ఆపాటంతా వచ్చు అన్నాను.” మీరు చెప్పండి పాడతా” అన్నారు.
భానుమతి ముందు నాదరిద్రపు గొంతువిప్పి పాటపాడటమా? ఐనా పట్టిన అదృష్టాన్ని పోగొట్టుకోదల్చుకోలేదు. పల్లవి అందించాను. భానుమతి పాడారు. “.. దవ్వుల వేణువు సవ్వడి వినినా.. నీవు వచ్చేవని… నీ పిలుపే విని… అనేసరికి ఆమె నాతో కలిసి పాడుతున్నారు. “కన్నుల నీరిడి కలయజూసితిని.. అన్నాను.
ఆమె చిరునవ్వుతో అలవోకగా పాడుతూ ‘ఓరి భడవా’ అన్నట్టు మురిపెంగా చూస్తున్నారు. “గడియయేని ఇక విడిచిపోకుమా… ఎగసిన హృదయము పగులనీకుమా..”ఇద్దరం కలిసే అన్నాం. పాట ముగిసింది. నేను ఆనందంతో కంపించిపోతున్నా. అది ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఇంటర్వూని మబ్బుల మీద నడిపించా.
1960 ప్రాంతాల్లో మద్రాస్ నుంచి ‘కాగడా’ ‘హిందూ నేషన్’ అనే రెండు scandal sheets వచ్చేవి. సినిమా వాళ్ళ గురించి చాలా నీచంగా రాసేవి ఆ పత్రికలు. మేం ఎంతో గౌరవంతో, ఇష్టంతో వచ్చామని, ఒక్క మాట కూడా నెగెటివ్ గా రాయమనీ భానుమతి గారితో ముందే చెప్పాను…
**** ***** ****
పాట తర్వాత భానుమతి చాలా ఫ్రెండ్లీగా, లవ్లీగా నేను ఏం అడిగినా సమాధానం చెబుతూనే వున్నారు. “మనసున మల్లెలు ‘అనుభవం చెప్పండి”?
మీకో నగ్నసత్యం చెబుతున్నా. బి. ఎన్. రెడ్డి ఆలోచనే అయినా, అసలా సన్నివేశాన్ని అంత బాగా తీర్చిదిద్దినవాడు ఆర్ట్ డైరెక్టర్ రామనాథ్ శేఖర్. తుంగభద్ర ఒడ్డుని స్టూడియోలోనే సృష్టించాడాయన. ఎన్టీఆర్ ఎత్తుమీదినుంచి వేణుగానంతో మెట్లు దిగి రావడం, కొలను ముందు హీరో ఒళ్లో తలపెట్టుకుని నేను కూర్చోవడం, చాలా మంచి బ్యాక్ గ్రౌండ్, శేఖర్ అరేంజ్ చేశారు. ఆ పాటని మూడు రోజులు తీశారు.
అప్పట్లో ఇప్పటంత టెక్నిక్ ఇంప్రూవ్ కాలేదు. టీంవర్క్ వుండేది. వుయ్ యూజ్ డ్ టు కమ్యూనికేట్… సీతా అనసూయ పాడిన ఒక మరాఠీ పాట ట్యూన్ తీసుకుని “మనసున మల్లెల మాలలూగెనే.. ‘ బాణీకట్టారు ఎస్. రాజేశ్వరరావు. ఆయన జీనియస్.” నెల రాజా వెన్నెల రాజా..’ పాట సాకీ నేను కంపోజ్ చేశాను. “ఆసూ బహానా బర్ బాద్ లో..” అనే నూర్జహాన్ పాట ట్యూన్ లో.. ‘ఎవ్వరేమని విందురూ..’ కట్టాను. అని చెబుతూ భానుమతి నూర్జహాన్ పాట పల్లవి అందుకున్నారు. ఎదురుగా ఉన్నది భానుమతి. ఆయాచితంగా పాడుతున్నది నూర్జహాన్ పాటని. బతుకు ధన్యమైనంత సంబరపడ్డాం. మా ఉత్సాహాన్ని ఆమె ఇట్టే గ్రహించారు.
*** *** ***
భానుమతి 1925 సెప్టెంబర్ 7న పుట్టారు. ప్రకాశం జిల్లా doddavaram కి చెందిన దేశిరాజు వెంకటసుబ్బయ్య గారి కూతురు. నియోగి బ్రాహ్మలు. 1993 నాటికి ఆమెకి 68 ఏళ్లు. ముంగురులు నెరిశాయి. పెద్ద కళ్లజోడు. ముడివేసుకోవడానికి వీలుపడని చిన్న జుట్టు. పొడవాటి కుంకుమబొట్టు. ఎడంచేతి వేళ్ళకి మూడు ఉంగరాలు. కుడిచెయ్యి రెండువేళ్ళకీ ఉంగరాలు. మెడలో రెండు రుద్రాక్ష మాలలు. ఒక బంగారు గొలుసు. బాపు గీసిన లావుపాటి పక్కింటి పిన్నిగారిలా వున్నారు. ఆమే గనక రోడ్డు మీద కనిపిస్తే ‘ఈవిడెవరోగానీ బాగా భానుమతి పోలిక వుందే’ అనుకుంటాం.
పాత రోజులు గుర్తుచేసుకుంటూ, “నా తొలి సినిమా వరవిక్రయం. అందులో నేను నటించలేదు. మా ఇంట్లో ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. ఆ సినిమాలో,” పలుకు లేని దైవమా.. “అనే తొలి త్యాగరాయ కృతి పాడాను. ఆక్రెడిట్ నాదే. వరవిక్రయంలో నేను జీవించానని అప్పట్లో రాశారు. లేదు. నేను జీవించలేదు. అది నా అదృష్టం అంటాను. అప్పట్లో మా నాన్న నిర్మాతలకు షరతులు పెట్టేవారు. మా అమ్మాయిని ఎవరూ ముట్టుకోకూడదని… వాళ్ళూ దానికి ఒప్పుకునేవారు. అప్పట్లో నాకు నెలకి 150 ఇచ్చేవారు. రెండు నెలలకి సినిమా అయ్యేది.
‘వరవిక్రయం’ తర్వాత నెలకి 1500 రూపాయలు ఇచ్చారు. రెండో సినిమా, ‘మాలతీమాధవీయం” ఫ్లాప్ అయింది. హీరో హీరోయిన్ చేతులు పట్టుకుని కెమెరా ముందుకొచ్చే సన్నివేశం వుంది. నాకు సిగ్గు. అందరూ చూస్తుంటారు. ఎలాగో చేతులు పట్టుకుని నడిచి ఇద్దరం కెమెరా ముందుకు వచ్చేసరికి, మేం బాగా దూరం జరిగిపోయేవాళ్ళం. కెమెరాలో రెండు చేతులే వచ్చాయి. కట్.. కట్.. అని దర్శకుడు గోలపెట్టేవాడు. మళ్లీ చేసేవాళ్ళం.
‘మాలతీమాధవీయం’ ఫ్లాప్ కి నేనే కారణం. ఆ పాత్రని ఖూనీ చేశాను. మాలతీమాధవీయం భవభూతి కావ్యం. ఆ హీరో నేనూ కలిసి భవభూతిని పాతిపెట్టేశాం. నెలకి 150 పారితోషికం తీసుకున్న “వరవిక్రయం” హిట్టయి వందరోజులాడింది. 1500 వందలు తీసుకున్న మాలతీమాధవీయం ఫ్లాప్ అయింది. ” అని నవ్వుతూ ఆనందంగా చెప్పారు.
‘సావిరహే తవదీనా..’ పాటకి మరాఠీ ఒరిజినల్ “నామజపన్ క్యోంఛోడ్ దియా..” కూడా ఓ ముక్క పాడి వినిపించారు. నాకు కళ్యాణి రాగం అంటే ఇష్టం అని చెప్పారు. ‘స్వర్గ సీమ’ నుంచి నేను యాక్ట్ చేయడం మొదలు పెట్టాను. అందులో మొదట పల్లెటూరి పిల్లగా, తర్వాత మారిన యువతిగా బాగా చేశాను. సినిమా చివరికి ఆధునిక యువతిగా, వ్యాంప్ లా నటించాలి. చేతకాలేదు. రీటా హేవర్త్ నటించిన ‘బ్లడ్ అండ్ శాండ్’ నాకు చూపించారు. ఆ సినిమా చూసే స్వర్గసీమ తీశారు. అది చూసి రీటాహేవర్త్ ని కంప్లీట్ గా ఇమిటేట్ చేశాను. నన్ను చూసి నేనే నవ్వుకుంటాను. బాగా అనుకరించగలిగాను.. ‘అని చెప్పారు.
మంచి రచయిత్రి, గొప్ప నటి, అద్భుతమైన గాయకురాలు అయిన భానుమతి సినిమా కెరీర్ లో రెండు HISTORIC BLUNDERS చేశారు.
1. భర్త రామకృష్ణ దగ్గర’ భరణీ ప్రోడక్షన్ ” లో పనిచేసే వాళ్లంతా సుబ్బరాయన్ తో కలిసి సొంత కంపెనీ పెట్టుకున్నారు. అది వినోదా పిక్చర్స్. ఆ విషయం గోప్యంగా ఉంచి’ మేం ఒక సినిమా తీస్తున్నాం. మీ ఆవిడ అందులో నటించాలి’ అని రామకృష్ణని అడిగారు. ఆయనకి కోపం వచ్చింది. భానుమతినే అడగండి అన్నారు. వాళ్లు నన్నడిగారు. నా సబార్డినేట్స్ తీస్తున్న చిత్రంలో నటించడానికి నేను ఒప్పుకోలేదు.. వాళ్లు తీసిన సినిమా ‘దేవదాసు’. హీరోయిన్ పాత్ర సావిత్రి దక్కించుకుంది
2. “మిస్సమ్మ లో మొదట నన్నే హీరోయిన్ గా బుక్ చేశారు. నాలుగు రీళ్ళు సినిమా కూడా తీశారు. ‘మేరీ’ పాత్ర నేను చాలా బాగా చేశాను. ఆరోజు వరలక్ష్మీ వ్రతం. ఆడవాళ్లకి చాలా ముఖ్యమైంది. షూటింగ్ కి ఉదయం 8 గంటలకు వెళ్ళాను. చక్రపాణికి కోపం వచ్చింది. నన్ను క్షమాపణ చెప్పమన్నారు. చెప్పకుండా నేను ఇంటికి వెళ్లిపోయాను. దాని గురించి మాత్రం నేను బాధపడతాను. ఆ పాత్ర చాలా బాగా చేశాను.” అని సిన్సియర్ గా చెప్పారు భానుమతి.
మిస్సమ్మతో ఆంధ్ర, తమిళ దేశాల్ని ఉర్రూతలూగించిన సావిత్రి సూపర్ స్టార్ డమ్ సాధించారు. అలా భానుమతి అనే ఒక సిల్వర్ స్క్రీన్ లెజెండ్ చేసిన రెండు చారిత్రక తప్పిదాలవల్ల సావిత్రి అనే ఒక నటనామృతభాండం మనకి దొరికిందని అనుకోవచ్ఛు గా…..
*** *** ***
భానుమతి చెప్పిన జోకులు..
‘జగదేకవీరుని కథ’ సినిమా తీస్తున్నపుడు బి. సరోజాదేవి షూటింగ్ కి 11 గంటలకి వెళ్లేదట. నిర్మాత చక్రపాణి నెత్తి కొట్టుకుని భానుమతి ఎనిమిదింటికన్నా వచ్చేది అని వాపోయారట. కంట్లో గ్లిజరిన్ వేస్తే గానీ నాకు ఏడుపు రాదు. హాస్యం ఇష్టం. ఏడుపు గిట్టదు. ఒకసారి ‘చంద్రమతి’ సినిమాకి నన్ను హీరోయిన్ గా తీసుకుందామని ఎవరో చక్రపాణితో అంటే ఆయన “భానుమతి ఏడిస్తే ఎవరు చూస్తారూ, భానుమతి ఎవరినన్నా ఏడిపిస్తే చూస్తారు గానీ అని జోకేశారట.
నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. మంచి కథ రాశావు అని ఎవరన్నా అంటే ఎంతో ఆనందించేదాన్ని. సినిమాల్లో ఉన్నా మధ్యతరగతి జీవితాన్నే ఇష్టపడతాను….. అంటూ ఎన్నెన్నో కబుర్లు చెప్పారు. కొద్దిసేపట్లోనే మేము స్నేహితులం అయిపోయాం. ఇంటర్య్వూ ముగిసినట్టే, భానుమతి లేచి నిల్చున్నారు. మేమూ నించున్నాం….
“ఒక్క మాట, మీకు పొగరు, కొవ్వు అంటారు చాలా మంది…” అని తెగించి అన్నాను. “సినిమా వాళ్ళు మంచివాళ్ళు కాదని నా లేతమనసులో పడిపోయింది. సినిమా వాళ్లంటే నాకిప్పటికీ ద్వేషం పోలేదు. ఆవిడ దగ్గరకు వెళ్ళాలంటే భయం అనే పేరు కావాలనే తెచ్చుకున్నాను. అందుకే నన్ను గర్విష్టి అంటారు. కాస్త మంచిగా, చనువుగా ఉంటే, సాయంత్రం హొటల్ రూంకి వచ్చేయ్ అంటాడు ప్రతీ వెధవ… అని ఈజీగా చెప్పి, నా భుజం తట్టి… “మరి ఉండనా”… అన్నారు భానుమతి.
ఎంత మాటకారితనం….
ఆ విశాలమైన నల్లని కళ్ళలో ఎంత ప్రశాంతత…. ఆమె అతిశయంలో ఎంత అందం….
ఆ పెదవి చివర విరిసే చిరుగర్వరేఖలో
ఎంత ధిక్కారం….
మనసున మల్లెల మాలలూగిన మధుర క్షణాలవి….” ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
అని పాడుకుంటూ మెట్లు దిగాను… తాడి ప్రకాశ్: 9704541559
Share this Article