మనకు మలయాళీ సినిమా కథలు చాలా తెలుసు… ప్రయోగాలు చేస్తారు, భిన్నమైన కథలకు వెళ్తారు… కాస్తోకూస్తో తమిళ దర్శకులు కొందరు కూడా ఆ పంథాలో వెళ్తారు… చూసేవాళ్లు చూస్తారు, లేకపోతే మరో ప్రయోగానికి వెళ్తారు… అలాంటివాళ్లకు సినిమా ఓ ప్యాషన్… కాకపోతే చూడబుల్ స్పెక్ట్రమ్‌లోనే ఈ కథలు సాగుతుంటయ్…
ఇదేమో అస్సామీ మూవీ… ఇండియన్ సినిమా తెర మీద అస్సామీ మూవీస్ పాత్ర తక్కువే… ఈ సినిమా కథ మాత్రం మరీ ఎక్స్‌ట్రీమ్ జానర్… చదువుతుంటే సున్నిత మనస్కులకు చివరలో ఒళ్లు జలదరిస్తుంది… పేరుకు ప్రేమకథే… కానీ ఇదేం ప్రేమరా బాబోయ్ అనిపిస్తుంది… దీన్ని ఏం జానర్ అనాలో ఇంకా ఎవరూ పేరు పెట్టినట్టు లేదు… సరే, Srinadhchowdary Kondepati… (Senior award winning ad film director) రాసిన ఈ విశ్లేషణ చదవండి ఓసారి… ఇదేం సినిమా కథరా బాబోయ్ అని నన్ను తిట్టుకోవద్దు సుమా… సినిమా కథల్లో ఇలాంటి పోకడలూ ఉంటాయని చెప్పడమే ఈ దీర్ఘ కథనం ఉద్దేశం…
Ads
ఆమీస్… (తెలుగులో మాంసాహారం) ఇది “ప్రేక్షకులు జీర్ణించుకోలేని వినూత్న ప్రేమ కథ చిత్రం”! ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఐదు అవార్డులు గెలుచుకున్న చిత్రం!
భారతీయ భాషలలో ఒక భాష అయినటువంటి అస్సామీస్ భాషలో రూపొంది 2019లో విడుదలైన సినిమా!… విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐదు ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న చిత్రం!
అందులో నటించిన 40 ఏళ్ల లిమాదాస్ తన తొలి చిత్రంతోనే అవార్డు గెలుచుకున్నారు (ఇప్పుడు ఆమె వయసు 45 సంవత్సరాలు)
ఇది చాలా క్లీన్ సినిమా…. మృదువుగా ఉండే మంచి నేపథ్య సంగీతము, అందమైన హీరోయిన్, బూతులు లేని , జుగుప్సలేని ఒక అసహజ సిద్ధమైన కథ తో ఒక తెలియని ఫీలింగ్ తో సగటు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేని ప్రేమ కథే ఈ “అమిస్” ….
—————
సుమోన్ అనే ఒక కుర్రవాడు అంత్రోపాలజీలో పీజీ చేస్తూ ఉంటాడు అతను నార్త్ ఈస్ట్ కు సంబంధించిన ఇండియన్…
అతని స్నేహితుడికి కడుపులో నొప్పి రావడంతో తన ఇంటి దగ్గరలో ఒక లేడీ డాక్టర్ ఉంటుందని తెలిసి ఆమె దగ్గరకు వెళ్లి తన ఫ్రెండ్ కు చాలా సీరియస్ గా ఉందని చెబితే తాను, అడల్ట్ డాక్టర్ కానని తాను ఒక చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రమేనని చెప్తుంది…
అయినా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే సరేనని చెప్పి అతనితో కలిసి అతని రూమ్ కి వెళుతుంది…
ప్రాబ్లం ఏంటి అని అడగగా అతను పూర్తి శాకాహారి అని నేను మాత్రం నాన్వెజ్ తింటాను అని తొలిసారి తన స్నేహితుడు నాన్వెజ్ తినడంతో కడుపులో నొప్పితో విపరీతంగా బాధపడుతున్నాడని చెబితే మరేమి పర్వాలేదు స్టమక్ అప్సెట్ అయింది అని కొన్ని మెడిసిన్స్ రాసి ఆ పేషెంట్ కి ఇస్తుంది…
ఆ డాక్టర్ని ఆమె ఇంటి దగ్గర దిగబెట్టడానికి వెళ్తూ మాటల సంభాషణలో తాను ఒక మీట్ క్లబ్ నడుపుతున్నాను అని తాను నార్త్ ఈస్ట్ ఇండియాకు సంబంధించిన వ్యక్తిని అని మేము ఎక్కువగా నాన్ వెజ్ మాత్రమే తింటాము అని , అలాగే నేను మీట్ క్లబ్ ద్వారా మాంసాహారాన్ని కొత్త పద్ధతిలో వండుతూ ఉంటానని చెబితే ఆ డాక్టర్ కూడా మాంసాహార ప్రియులు కాబట్టి ఫీజు ఇస్తుంటే వద్దని చెప్పి తాను కొత్తగా ఏదైనా డిష్ తయారు చేస్తే తనకు తెచ్చి ఇవ్వమని నవ్వుతూ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది!
ఈ కుర్రవాడు కాలేజీలో పీజీ చేస్తూనే ఒకరోజు కుందేలు మాంసం వండి ఆ డాక్టర్ ఉన్న హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు…
అప్పుడు ఆమె ఏంటి ఇది అని అడగ్గా నీకు ఇవ్వాల్సిన ఫీజు ఈ కుందేలు మాంసంలో తీసుకొచ్చాను అంటే నేను చికెన్ మటన్ తప్ప వేరేది ఏమీ తినను అంటే కుందేలు మాంసం ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అని చెప్తే ఆమె ససేమిరా వద్దు అంటుంది…. అప్పుడు అక్కడే ఉన్న కాంపౌండర్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మెత్తగా ఉంటుంది ఒకసారి తిని చూడండి అని చెబితే ఆమె టేస్ట్ చేస్తుంది. ఇతను వండిన విధానము ఆమెకు చాలా బాగా నచ్చుతుంది…
——–
ఇతను కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు ఆమె హాస్పిటల్లో పని చేసుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో రకరకాల డిషెస్ ఆమెకు తీసుకెళ్తూ ఉన్న క్రమంలో పరిచయం పెరిగి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది…. అలా తెలియకుండా ఒకరికొకరు దగ్గరవుతూ ఉంటారు అర్ధరాత్రి లేదు ఒక టైం ఉండదు వాట్సప్లో మెసేజ్లు పెట్టుకుంటూ ఆనందంగా గడుపుతో ఉంటారు…
ఒకరోజు ఉదయము తన స్నేహితురాలు ఈమె దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కువగా ఆ కుర్రవాడుతోనే స్పెండ్ చేస్తున్నావు ఆ కుర్రోడు చాలా బాగున్నాడు అతనిని ప్రేమిస్తున్నావా అని అడిగితే, నీకేమైనా పిచ్చా నా వయసులో సగం ఉంటుంది అతనికి, నాకు 12 సంవత్సరాలు కొడుకున్నాడు! నేను పెళ్లయిన దాన్ని! ఇలా ఎలా మాట్లాడుతావు అని చెప్పి అలాంటిదేమీ లేదని కొట్టి పడేస్తుంది….కానీ అతనికి మెసేజ్ చేయకుండా మాత్రం ఉండలేదు.
ఒకరోజు వీళ్ళిద్దరూ రెస్టారెంట్లో ఉండగా నేను ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళాలి రేపు ఉదయం మా హస్బెండ్ అబ్రాడ్ నుంచి వస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళగానే తన హస్బెండ్ ఆల్రెడీ వచ్చేసి తనకు సర్ప్రైజ్ ఇస్తాడు… మాటల మధ్యలో నాకు ఈ మధ్య ఒక కుర్రవాడు పరిచయం అయ్యాడు అతను ఎంతో ఇంటెలిజెంట్ నాన్ వెజ్ లో డిఫరెంట్ డిషెస్ చాలా బాగా చేస్తున్నాడు అని చెప్తే,ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు డాక్టర్స్ కాబట్టి మెచ్యూర్డ్ గా తనని ఇంటికి ఆహ్వానిస్తారు!
అతను వస్తూ వస్తూ వివిధ రకాల చేపలతో డిఫరెంట్ ఐటమ్స్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు! అప్పటికే వాళ్ళింట్లో బ్రాయిలర్ చికెన్ వండి లంచ్ తింటూ ఉంటారు… ఈ కుర్రాడు మాత్రం బ్రాయిలర్ కోడి మాంసం తినడు! అతను ఏదైనా జంతువు గాని పక్షి గాని తనకు తాను సంపాదించుకొని ఆహారం సేవించే వాటినే తినడానికి ఇష్టపడతాడు కానీ ఆర్టిఫిషియల్ గా పెంచిన కోళ్లను తినడు…
ఇదే విషయం ఒకరోజు ఆమెకు చెప్పి ఒక రోజు నీకు గబ్బిలం వండి తీసుకొస్తాను అలాగే ఒకరోజు కుక్క మాంసం తీసుకొస్తాను ఒకరోజు బల్లి మాంసం తీసుకొస్తాను ఒక రోజు సాలె పురుగులు మాంసం తీసుకొస్తాను అని చెప్తూ… ఉన్న టైంలో ఆరోజు ఏదో డిష్ తీసుకొచ్చిన ఫుడ్ తింటూ ఉండగా ఆమె పెదవి కింద కొద్దిగా అంటుకుంటుంది.. దానిని ఇతను తుడవపోతే తనని ముట్టుకున్నాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది… ఇంటికి వెళ్లి భర్త ను కిస్ చేసి పడుకుండి పోతుంది…..
కానీ ఆ కుర్రవాన్ని మాత్రం మర్చిపోలేదు తన భర్తతో మాట్లాడదు, చివరికి ఆమె భర్త తిరిగి మళ్లీ అబ్రాడ్ వెళ్ళిపోతున్నా కూడా మౌనంగా ఉంటుంది! తన స్నేహితురాలు ఈమెతో మళ్ళీ అంటుంది నువ్వు ఆ కుర్రవాడిని మర్చిపోలేక పోతున్నావు, నీ ప్రవర్తనలో అందుకే మార్పు కనిపిస్తోంది అని చెప్పిన పైకి మాత్రం తన వయసు, సోషల్ స్టేటస్ , ఇంట్లో టీనేజ్ కి వస్తున్న బాబు ఇవన్నీ గుర్తుకొచ్చి ఎవరితో ఏం చెప్పుకోవాలో తెలియక తనలో తానే సతమతమవుతూ ఉంటుంది…
——–
ఈ కుర్రవాడికి కూడా ఆమె మీద విపరీతమైన వ్యామోహం పెరిగిపోతూ ఉంటుంది తనకోసం ఏదైనా కొత్తగా డిష్ చేసి తనకి ఇవ్వాలని అనుకుంటాడు…
ఇక్కడే ట్విస్ట్ మొదలవుతుంది!
ఒక రోజు వైవిద్యంగా ఒక డిష్ తయారు చేస్తాడు, ఒక కోడి గుడ్డుని రెండు ముక్కలుగా కట్ చేసి అందులో రెండు నాన్ వెజ్ పీసులు పెట్టి ఒక చిన్న క్యారియర్ లో తన హాస్పిటల్ కి ఇచ్చి వెళ్తాడు… క్యారియర్ మీరే ఇవ్వండి అని కాంపౌండర్ అంటే లేదు ఆవిడ బిజీ గా ఉన్నారు కదా , వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇచ్చి వెళ్ళాను అని చెప్పండి అని ఆ డిష్ ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోతాడు… అది ఆమె రాత్రికి తింటుంది… రకరకాల మాంసం అప్పుటికి ఎన్నోసార్లు అతను వండి ఇచ్చినా కూడా ఎప్పుడూ లేనంత రుచిగా ఉండి ఆ మాంసం తింటుంటే ఆమె గాలిలో తేలిపోతున్నట్లు ఆస్వాదిస్తూ ఉంటుంది…
ఆ మరుసటి రోజు వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ లో మీట్ అయ్యి ఇప్పటివరకు నువ్వు వండిన అనేక రకాల డిష్ లు తిన్నాను కానీ ఈ డిష్ లో ఏదో ప్రత్యేకత ఉంది ఎంతో రుచిగా ఉంది ఇందులో ఎలాంటి ఇంగ్రిడియంట్స్ వాడావు ఇది ఏం మాంసము అని అడిగితే…
రెండు కోడిగుడ్లతో పాటు మీకోసం నాతొడ కాలులో కొంత భాగం కట్ చేసుకుని దానినే వండి నీకు డిష్ గా పెట్టాను అని చెప్తాడు,..
అంతే ఆమెకి నోటి వెంట మాటరాదు, అక్కడి నుండి వెళ్ళిపోయి ఎంతగానో వాంతులు చేసుకోవాలన్నా అది కడుపులో జీర్ణం అయిపోయి వాంతులు రావు.
ఒక విధమైన బాధ, ఆవేశం, కానీ అతనితో డైరెక్ట్ చెప్పుకోలేదు గాని అతని మీద పీకల లోతు ప్రేమలో ఉంటుంది.. అంతకు మించి ఆమె మాంసాహారానికి బానిసగా మారిపోయి ఉంటుంది.. మరుసటి రోజు ఈ కుర్రవాడు తన శరీరంలో మరొక భాగంలో కొంత భాగం కట్ చేసి వండి ఆమెకు మళ్ళీ వెరైటీ డిష్ తీసుకొని వస్తాడు…. ఆమె ఎంతో ఇష్టంగా తింటుంది…
ఇతను తన శరీరంలో ఏదో ఒక భాగం కట్ చేయడం, దానిని వండి ఆమెకు ఇవ్వడం, అందులోనే తన ప్రేమను తెలియజేస్తూ వస్తున్నాడు… ఒకరోజు ఆమె వండి ఇతనికి ఒక డిష్ చేసి తీసుకొస్తుంది… అప్పుడతను నాకన్నా బాగా వండావు ఇది ఏ మాంసం అని అడిగితే ఆమె చీర కాస్త పైకి లేపి మోకాలు కింద దిగువ భాగంలో కట్ చేసుకుని వండి తీసుకొచ్చాను అనేది ఆ గాయాన్ని చూపించి ప్రేక్షకుడికి చెప్పకనే చెప్తుంది… వెంటనే కుర్రవాడు అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లి వాంతులు చేసుకొని అక్కడి నుంచి భాదతో వెళ్ళిపోతాడు!
కారణం ఈ కుర్రవాడు తన శరీరం నుంచి కొంత మాంసాన్ని తీసి వండి పెడితే తను ఇష్టంగా తింటుందని తనను తాను బలి చేసుకోవాలనుకున్నాడు కానీ, అదే ప్రేమ తన ప్రేయసిలో కనిపించి ఆమె తన శరీర భాగాన్ని కూడా కోసి వండుకుని తీసుకొచ్చి తనకి ఆహారంగా పెడితే తట్టుకోలేక పోతాడు! కానీ తన ప్రేయసి మనిషి మాంసానికి బానిస అయింది అనేది కొద్దిగా ఆలస్యంగా గుర్తిస్తాడు!
ఒకరోజు అర్జెంటుగా హాస్పిటల్ కి రమ్మని పిలుస్తుంది, ఇతను వెళ్లగానే మార్చురి రూమ్ లోకి తీసుకెళ్తుంది … అక్కడ అప్పుడే ఆక్సిడెంట్ లో చనిపోయిన డెడ్ బాడీ ఉంటుంది… ఆ శరీరంలో తొడ, పొట్ట, ఇలా మిగిలిన భాగాల్లో కట్ చేయి, ఆ మాంసం చాలా బాగుంటుంది అని చెప్పి అతనిని ప్రేరేపిస్తూ ఒక కత్తిని ఇస్తున్న సమయంలో మార్చరీ రూమ్ లోకి వేరే ఒక వ్యక్తి ఎంటరవడంతో అక్కడి నుండి వాళ్ళు ఎస్కేప్ అవుతారు!
ఒకరినొకరు ముట్టుకోరు, కళ్ళతోనే ప్రేమించుకుంటారు…. ఒకరికొకరు కనీసం నువ్వంటే నాకిష్టమని కూడా ఎక్కడా కూడా చెప్పుకోరు! ఇతను ఆమెకు నచ్చింది వండి పెట్టాలనుకుంటాడు తనకు ఏదైనా తినాలనే కోరిక కలిగితే దానిని తీర్చాలనుకుంటాడు.. అలా ఆలోచిస్తున్న సమయంలో ఇంటికి వెళుతూ ఒక రిక్షా మాట్లాడుకుంటాడు…
అలా రిక్షాలో వెళుతున్న సమయంలో ఒక రైల్వే ట్రాక్ కనిపిస్తుంది.. నన్ను ఇక్కడ దించేసెయ్ అనీ రిక్షావాడికి చెప్పి డబ్బులు ఇస్తున్నట్లు ఇచ్చి అతని మీద కలబడి చివరికి అతన్ని చంపేసి, అతని శరీరంలోని కొంత భాగాన్ని కట్ చేస్తూ ఉండగా ఆ ప్రదేశానికి యూరిన్ చేసుకోవడానికి వచ్చిన ఒక బీట్ కానిస్టేబుల్ కి దొరికిపోతాడు..
పోలీసులు విచారిస్తుండగా అతని ప్రేయసి వాట్సప్లో మెసేజ్ చేస్తుంది…. పోలీసులు ఆ వాట్సప్ సంభాషణ మొత్తం చదివిన తర్వాత వీరిద్దరూ ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోగలుగుతారు… దీంతో ఆమె కూడా నేరస్థురాలిగా దొరికిపోతుంది…
గౌహతి నగరం అంతా ఈ విషయం సంచలనం అవుతుంది… ఇద్దరికీ పోలీసులు ముసుగులు వేసి మీడియా ముందు హాజరు పరుస్తుంటే, చివరికి జైలుకు వెళ్లిపోతాము ఇంకెప్పటికీ కలవలేము అని తెలిసి, అప్పటిదాకా కూడా నోటితో ఎన్నడూ ఐలవ్యూ అని చెప్పక, అతనిని ఎంత గాఢంగా ప్రేమిస్తుందో … ప్రేక్షకులకు తెలియజేసే విధంగా అతని చేతి వేళ్లలో ఈమె చేతి వేళ్ళు పెట్టి గట్టిగా అతని చేతిని పట్టుకుంటుంది… అక్కడితో చిత్రాన్ని ముగించేస్తాడు దర్శకుడు!
చిత్రం పూర్తయ్యాక సినిమా చూసిన ప్రేక్షకుడు ఒక రకమైన సందిగ్ధంలో మునిగిపోతాడు అసలు ఇది ఎలాంటి ప్రేమ కథ ….. అనేది అతనికి ఒక పట్టాన అంతు పట్టదు… అందుకే అన్నాను. “ఇది ప్రేక్షకులు జీర్ణించుకోలేని వినూత్న ప్రేమ కథ ” అని!
ఎక్కడా కూడా ఒక జుగుప్సాకరమైన డైలాగుండదు, ఎక్కడా కూడా ఎక్స్పోజింగ్ ఉండదు, అలాగే ఎక్కడా కూడా హింస అనేది చూపెట్టడు…. 40 సంవత్సరాల వయసులో ఆ హీరోయిన్ ఎంత అందంగా ఉందంటే నిండైన చీరకట్టు పెద్ద బొట్టు అప్పట్లో రేఖ గారిని గుర్తు చేశారు.. ఈ హీరోయిన్ ఎంతో ముగ్ద మనోహరంగా ఉంది…. తొలి చిత్రంతోనే అవార్డును సొంతం చేసుకున్నారు…
అలాగే ఈ చిత్రాన్ని రూపొందించింది కూడా ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిలిం డైరెక్టర్ అమీన్ భాస్కర్ హజారియా!
ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత సెన్సార్ బోర్డ్ నుండి మాత్రమే కాకుండా ఎందరో విమర్శకుల ప్రశంసలు అందుకుంది… ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ లో 10 కి గాను 7.9 రేటింగ్లో ఉన్న భారతీయ అస్సామీస్ భాషా చిత్రం…. ఈ చిత్రానికి సమర్పణ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్! అలాగే బ్యానర్ పేరు కూడా వెరైటీగా ఉంది గుడ్ అండ్ బాడ్ ఫిలిమ్స్ అని!
ఈ చిత్రం సోనీ లీవ్ ఓటీటీలో ఉంది, యూట్యూబ్ లో కూడా ఫ్రీగా అందుబాటులో ఉంది, అస్సామీస్ భాష మనకు అర్థం కాకపోయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండటంతో చిత్రాన్ని కాస్త ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా చూసి ఆస్వాదించవచ్చు! నిస్సందేహంగా మనకి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది కలుగుతుంది! హ్యాట్సాఫ్ టు డైరెక్టర్ అమీన్ భాస్కర్ హజారియా… అనొచ్చు అంటారా..?!
Share this Article