మీరు ఏదో సమస్య మీద జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి పత్రం అందించి, సమస్య పరిష్కారం కోసం మొరపెట్టుకోవాలని వెళ్లారు… అక్కడ జిల్లా కలెక్టర్‌ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది మీకు… కాసేపటికి వెలిగింది… తను రోజూ పొద్దున్నే తమ ఇంటికి డెయిలీ పేపర్ వేసేవాడు కదా… ఎహే, పేపర్ బాయ్ కుర్చీలో ఉన్నది ఏమిటి..? మీలో అయోమయం… సందిగ్ధం… ఆ కలెక్టరే అన్నాడు, మీ సందేహం నిజమే, నేను మీ ఇంటికి పేపర్ వేసేవాడిని నవ్వుతూ…
ఏదో సినిమా కథలా బాగుంది కదా… ఎస్, దాదాపు అలాంటిదే ఈ రియల్ స్టోరీ… చిన్న చిన్న ఉద్యోగాలకు, జీవన వేటలకు విసిగి వేసారిపోయి, ఆశల్ని వదిలేసి డిప్రెషన్‌లోకి జారిపోయే లక్షలాది మందికి ఓ స్పూర్తిదాయకమైన సక్సెస్ స్టోరీ ఇది… అబ్దుల్ నాజర్… అయిదేళ్ల వయసులోనే బతుకు విషాదాలు ఆరంభమయ్యాయి… అయిదో ఏట తండ్రిని కోల్పోయాడు.,. తరువాత తను తల్లి పోషణకూ భారంగా మారి ఓ అనాథాశ్రమానికి చేరుకున్నాడు… తప్పలేదు… బంధువులు, స్నేహితులు, అందమైన బాల్యం, ఆప్యాయతలు గట్రా ఏమీ లేవు…
తన వితంతు తల్లి ఎదుర్కొంటున్న అవస్థల్ని చిన్న వయస్సులోనే అర్థం చేసుకున్నాడు, అనాథాశ్రమంలో అలాగే కొనసాగాడు… తనకు తల్లి ఒక పూజ కూడా భోజనం పెట్టే స్థితిలో లేదు… అనాథాశ్రమం ఆ పిల్లాడిని చదివించింది… దాన్ని అందిపుచ్చుకున్నాడు తను… బతుకు కష్టాల మధ్య చదువునే ఓ ఉపశమనంగా, బతుకు మార్గంగా మార్చుకున్నాడు…
Ads
తన పదో ఏటా ఓ ఐఏఎస్ ఆఫీసర్‌తో సంభాషణ తరువాత తనకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు… జీవితంలో ఎలాగైనా సరే, ఎప్పటికైనా సరే ఐఏఎస్ అధికారి కావాలి… ఇదీ టార్గెట్… ఎక్కడి అనాథాశ్రమం, ఎక్కడి ఐఏఎస్… ఏటా లక్షలాది మంది నిద్రాహారాలు మాని, విద్యను ఓ తపస్సులా కొనసాగిస్తే తప్ప, బోలెడంత వెచ్చించి కోచింగులు పెట్టించుకుంటే తప్ప గట్టెక్కని క్లిష్టమైన ఐఏఎస్ పోస్టు… మరి ఆ అనాథకు ఎలా దక్కాలి..? సరే, సంకల్పానికి దరిద్రం దేనికి..? పెద్ద టార్గెటే పెట్టుకున్నాడు…
తను వెళ్లాలనుకున్న మార్గంలో ఎన్ని అడ్డంకులుంటాయో తెలుసు తనకు… పూటకు దిక్కులేని తను ఏకంగా ఓ జిల్లాకు కలెక్టర్ కావాలనుకోవడం మరీ పెద్ద టార్గెట్ కదా… అటు అనాథాశ్రమం దయతో చదువుకుంటూనే రకరకాల చిన్న చిన్న కొలువులు చేసేవాడు… పేపర్లు వేసేవాడు… హోటల్ క్లీనర్, సప్లయర్… ఎస్టీడీ బూతుల్లో పనిచేసేవాడు… తరువాత బయటికి వచ్చాడు, కేరళ, తలసెరిలో స్కూలింగ్, కాలేజీ ఎలాగోలా గట్టెక్కాడు… 1994లో పీఎస్సీ పరీక్ష పాస్…
సొంత కాళ్ల మీద నిలబడాలి ముందు… తరువాత సివిల్స్… ఇదీ తను ఎంచుకున్న పంథా… ఫస్ట్ జూనియర్ హెల్త్ ఇన్‌స్పెక్టరయ్యాడు… ఓవైపు కొలువు, మరోవైపు రాత్రంతా నిద్రలేని చదువు… ఫలితంగా 2006లో సుదీర్ఘ నిరీక్షణ తరువాత స్టేట్ సివిల్ సర్వీసెస్ పరీక్ష గట్టెక్కాడు… పీజీ కూడా అయిపోయింది… ఈసారి డిప్యూటీ కలెక్టరయ్యాడు…
ఆ పోస్టులో సిన్సియర్‌గా వర్క్ చేస్తూన్నాడు… అందరి మన్ననలూ పొందుతున్నాడు… యూపీఎస్సీకి రాయలేడు… కానీ తన విధినిర్వహణలోని ప్రతిభ, సిన్సియారిటీ ద్వారా 2017లో ఐఏఎస్ అధికారిగా కన్ఫర్డ్… ఇక్కడ ఓ క్లారిటీ… తను నేరుగా యూపీఎస్సీ క్లియర్ చేసి, స్ట్రెయిట్‌గా ఐఏఎస్ కాలేదు… కానీ ఏం తక్కువ..? అనేక అడ్డంకుల్ని దాటిన ఈ సక్సెస్ స్టోరీయే కదా అసలైన స్పూర్తి… ఒక పేపర్ బాయ్ ఓ రేంజ్ కొలువు దాకా ఎదిగిన ప్రస్థానాన్ని మించిన ఇన్‌స్పిరేషనల్ స్టోరీ ఏముంటుంది..? 2019లో కొల్లం కలెక్టర్ తను… ఇప్పుడు రెవిన్యూ శాఖలో అదనపు కార్యదర్శి..!!
Share this Article