Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రీల్ హీరోలు కాదురా… ఇదుగో వీళ్లు రియల్ హీరోలు… మార్గదర్శులు…

August 15, 2025 by M S R

.

వెనుకబడిన గిరిజన గ్రామం నుంచి ఉన్నత శిఖరాలకు… డా. రాజేంద్ర భరూడ్ అసాధారణ ప్రయాణం

“నేను పుట్టేలోపే నాన్న చనిపోయారు. ఇంట్లో ఒక మగ దిక్కు లేడు. మాది భిల్ అనే ఒక గిరిజన తెగ. అంతులేని పేదరికం. నాన్న ఎలా ఉంటారో చూడడానికి ఒక ఫోటో కూడా లేదు. సొంత భూమి లేదు, ఆస్తిపాస్తులు లేవు. మా ఇల్లు చెరకు ఆకులతో వేసిన ఒక గుడిసె. అలాంటి జీవితం మాది” –

Ads

…. ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు, డా. రాజేంద్ర భరూడ్. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా కలెక్టర్. ఒకప్పుడు దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన సామోడే గ్రామం నుంచి, అత్యున్నత పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారిగా ఎదిగిన అసాధారణ వ్యక్తి…

అమ్మ… నా మొదటి గురువు, నా బలం

పేదరికం, కష్టాలు తనను కుంగదీయలేదు. ఆయన తల్లి ‘మాయ్’, అసలు పేరు కాశీబాయి భరూడ్. ఆమె నిశ్శబ్ధంగా కూర్చుని, తమ పరిస్థితిని చూసి బాధపడలేదు. తన ఇద్దరు కొడుకుల భవిష్యత్తు కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు.

పూల నుంచి సారాయి చేసి అమ్మి జీవనం సాగించారు. పిల్లవాడిగా రాజేంద్ర, సారాయి కోసం వచ్చేవారికి పల్లీలు, ఇతర చిరుతిళ్లు తెచ్చిపెట్టేవాడు. “నేను చిన్నప్పుడు ఏడిస్తే, పనికి అడ్డు వస్తుందని నా కడుపులో రెండు చుక్కల సారాయి వేసేదిట… నేను నిద్రపోవాలని” అని ఆయన ఒకసారి నవ్వుతూ చెప్పారు.

అలాంటి పరిస్థితుల్లో కూడా, మాయ్ తన పిల్లలను బడికి పంపింది. ఆ గ్రామంలో బడికి వెళ్లిన మొదటి పిల్లలు వారే. చదువు విలువ గురించి ఎవరికీ తెలియని ఆ రోజుల్లో, పెన్నులు, పుస్తకాలు లేకపోయినా చదువు పట్ల రాజేంద్రకు ఆసక్తి ఉండేది.

ఒకసారి పరీక్షల కోసం చదువుకుంటున్నప్పుడు, ఒక కస్టమర్ “ఒక డాక్టర్, ఇంజనీర్ అవుతున్నట్లు కలగంటున్నావా..?” అని వెటకారంగా అన్నాడు. ఆ మాటలు రాజేంద్రకు కోపం తెప్పించాయి. కానీ మాయ్ ఆ కస్టమర్‌తో “నా కొడుకు నిజంగానే అలా అవుతాడు” అని ధీమాగా చెప్పింది. ఆమె ఆ నమ్మకమే రాజేంద్రలో గొప్ప సంకల్పాన్ని నింపింది.

కల సాకారం, కొత్త జీవితానికి తొలి అడుగు

150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్లకవలోని ఒక సిబిఎస్ఇ పాఠశాలలో చేరినప్పుడు, తల్లికి, కొడుకుకి కన్నీళ్లు ఆగలేదు. కానీ ఈ అవకాశం వృథా చేయకూడదని రాజేంద్ర నిర్ణయించుకున్నాడు. కష్టపడి చదివి 12వ తరగతిలో 97 శాతం మార్కులు సాధించాడు. ముంబైలోని జి.ఎస్. మెడికల్ కాలేజీలో మెరిట్‌తో సీటు సాధించాడు. స్కాలర్‌షిప్‌ల సహాయంతో చదువు, వసతి పూర్తి చేశాడు…

డాక్టర్ చదువుతున్నప్పుడే యుపిఎస్సీ పరీక్షలకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నాడు… ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో, ఇంటర్న్‌షిప్ చేస్తూనే యుపిఎస్సీ కోసం కష్టపడి చదివాడు… అప్పుడు కూడా మాయ్ తన కొడుకు డాక్టర్ అవుతున్నాడని మాత్రమే అనుకుంది… కలెక్టర్ అంటే ఏంటో, యుపిఎస్సీ అంటే ఏంటో ఆమెకు తెలియదు… తన ప్రపంచంలో అప్పటికి లోకల్ తహసీల్దార్ అనే పదం కూడా లేదు…

డాక్టర్, కానీ అంతకంటే ఉన్నతమైన బాధ్యత

చివరికి, ఆయన కల నిజమైంది. ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు, యుపిఎస్సీ పరీక్షలో విజయం సాధించిన ఫలితాలు కూడా వచ్చాయి… చిన్న గుడిసెకు తిరిగి వచ్చినప్పుడు, తనను ఆహ్వానించడానికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులు వచ్చారు… తన తల్లి ఆశ్చర్యపోయి, ఏం జరిగిందో అర్థం చేసుకోలేకపోయింది…

అప్పుడు రాజేంద్ర “అమ్మా, నేను డాక్టర్ అయ్యాను” అని చెప్పాడు. ఆమె సంతోషంలో మునిగిపోయింది. “నేను డాక్టరుగా పనిచేయను, ఇప్పుడు కలెక్టర్ అయ్యాను” అని చెప్పినప్పుడు, దాని గొప్పదనం తెలియకపోయినా అది ఏదో గొప్ప పదవి అని ఆమెకు అర్థమైంది…

“మా ఊరిలో చాలామందికి కలెక్టర్ అంటే ఏంటో తెలియదు. ‘మా రాజు’ పెద్దవాడయ్యాడని సంతోషపడ్డారు. కొందరు కండక్టర్ అయ్యాడని కూడా అభినందించారు” అని రాజేంద్ర నవ్వుతూ వివరించారు…

నందుర్బార్ జిల్లా కలెక్టర్‌గా… కొత్త ఆశలు

ప్రస్తుతం ఆయన నందుర్బార్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. వెనుకబడిన గిరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయాలని ఆయన భావిస్తున్నారు. “నా ప్రయాణంలో నా బలం మా మాయ్. మేం పేదరికంలో పెరిగాం కాబట్టి అది నాకు కష్టమనిపించలేదు. మాకు ఆటలు కూడా కర్రలు, మామిడి గింజలే. కానీ అది మాకు శారీరకంగా, మానసికంగా బలాన్నిచ్చింది.” అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ముంబైకి వచ్చినప్పుడు మాత్రమే పేదరికం, సంపన్నత మధ్య తేడా గమనించానని చెప్పారు. కానీ దాని వల్ల ఎవరినీ అసూయపడలేదని, తన పరిస్థితిని మార్చుకోవడానికి తన కష్టమే మార్గమని గ్రహించానని చెప్పారు. ఆయన కృషి ఫలితంగానే ఈ రోజు ఒక భిల్ గిరిజన యువకుడు, తన 31 ఏళ్ల వయసులో, తన తెగలో మొదటి ఐఏఎస్ అధికారిగా నిలిచాడు…

“ఈరోజు నేను కలలు కన్నది, అంతకంటే ఎక్కువ సాధించాను. కానీ దానికంటే ముఖ్యమైనది, నా ప్రయాణం చూసి మా గ్రామంలో, మా తెగలో చాలామంది చదువు పట్ల అవగాహన పెంచుకున్నారు. వారు కూడా ఏదైనా సాధించగలమని నమ్ముతున్నారు. అదే నాకు నిజమైన బహుమతి.” అని రాజేంద్ర భరూడ్ ముక్తాయింపు…

.

వీళ్లు స్పూర్తిదాతలు… అణగారిన వర్గాల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచి, వాళ్లను నిజంగా అభివృద్ధి చెందే దిశకు నడిపించే కథలు… ఇవి తీయండ్రా సినిమాలు… స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్ల జీవితాలు కావు… 60, 70 దాటినాా ఇంకా కుర్రవేషాలు వేస్తూ, మీ వేల కోట్ల కోసం జనాన్ని వెనుకయుగాలకు నడిపించకండర్రా… ఈ సమాజం మీకు ఏం తక్కువ చేసింది..? ఇంకా ఇంకా ఎంత సంపాదించి ఏం చేసుకుంటార్రా..!! పైగా వీళ్లకు ఫ్యాన్లు… ఓ డిజార్డర్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!
  • విరిగిన ఎముకలకు ‘క్విక్ ఫిక్స్’… నిమిషాల్లో అతికించే మ్యాజికల్ జిగురు..!!
  • విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…
  • వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!
  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions