ఇది ఈనాడులో వచ్చిన న్యూస్ స్టోరీ అని ఫేస్బుక్లో తెగ వైరల్ అయిపోయింది ఈరోజు… నిజంగానే ఓ స్పూర్తిదాయక కథనం… నిజానికి జనానికి ఇవే ప్రస్తుతావసరం… ఓ పేదరాలు సమస్యల్ని, జీవన దుస్థితిగతుల్ని అధిగమించి ఓ చదువుల సరస్వతిగా అవతరించిన వైనం ఇప్పుడు అకారణ ఫ్రస్ట్రేషన్లో పడి కొట్టుకుపోతున్న యువతరానికి అవసరం… ముందుగా ఈ కథనం చదవండి… (ఈనాడు సౌజన్యంతో…)
అది అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లె. ఆ ఊరి చివర ఓ చిన్న రేకుల షెడ్డు ముందు పెద్ద ఎత్తున జనాలు. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, మరింత సంతోషం. ఎందుకా అని ఆరాతీస్తే నిత్యం తమతో పాటు కూలి పనులకొచ్చే భారతి డాక్టర్ అయ్యిందని సంబరపడిపోతున్నారు కొందరు. కోచింగ్‌లూ, అదనపు తరగతుల సాయం లేకుండా రసాయన శాస్త్రాన్ని ఔపోసన ఎలా పట్టిందని ఆశ్చర్యపోతున్నారు మరికొందరు.
ఈ భావోద్వేగాలన్నీ శుభాకాంక్షలుగా వెల్లువెత్తిన క్రమంలోనూ ఆ చదువుల తల్లి భారతిలో అదే నిలకడ. రెండో సందర్భం… అది అనంతపురం నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. పీహెచ్డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురుతో కలిసి వచ్చింది భారతి. పారగాన్ చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలూ, అతిథుల ముఖాల్లోనూ ఒకటే ఆశ్చర్యం. పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేస్తూ నడిచొస్తున్న ఆ చదువుల సరస్వతిని చూసి అబ్బురపడిపోయారు. అయినా సరే, ఆమెలో ఇసుమంతైనా గర్వం కనిపించలేదు.
Ads
చిన్నప్పటి నుంచీ బాగా చదువుకోవాలనుకునేది భారతి. పదో తరగతి వరకూ శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలో పూర్తిచేసింది. తల్లిదండ్రులకు ముగ్గురాడపిల్లలు. వారిలో ఈమే పెద్దది. వీరందరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక మేనమామ శివప్రసాద్‌తో తనకి పెళ్లి చేశారు. భవిష్యత్తు గురించి ఎన్ని కలలున్నా… ఆ విషయం భర్తకు చెప్పలేక పోయింది. అతడే ఆమె కోరికను అర్థం చేసుకున్నాడు.
పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు. భారతి కూడా తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఇదో అవకాశం అనుకుంది. భర్త ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. అందుకే కొన్నిరోజులు కాలేజీకి వెళ్తూ, మరికొన్ని దినాలు కూలీపనులు చేస్తూనే అనంతపురం ఎస్ఎస్బీఎన్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. అప్పటికే తనకో కూతురు గాయత్రి. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే చదువూ, పనులూ సమన్వయం చేసుకునేది.
రోజూ రాత్రి పొద్దుపోయే వరకూ, మళ్లీ కోడి కూయక ముందే లేచి పుస్తకాలతో కుస్తీ పట్టేది. కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి కనీసం 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడ బస్సెక్కేది. ఇన్ని కష్టాల మధ్యా భారతి డిగ్రీ, పీజీ మంచి మార్కులతో పూర్తిచేసింది. అది చూసి భర్త, టీచర్లూ పీహెచ్డీ దిశగా ఆలోచించమన్నారు.
ప్రయత్నిస్తే ప్రొఫెసర్ డా.ఎంసీఎస్ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్’ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఇందుకోసం వచ్చే ఉపకార వేతనం భారతికి కొంత సాయపడింది. అయినా తను కూలి పనులు మానలేదు. ‘డాక్టరేట్ చేస్తే వర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చు. అది మా జీవితాల్ని బాగు చేస్తుంది. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరెంతో మంది పంచొచ్చు. నేను సాధిస్తే అది మరెంతో మందికి ప్రేరణ కూడా కల్పిస్తుంది… ఇవన్నీ నన్ను నడిపించాయ’నే భారతి జీవిత పయనం స్ఫూర్తిదాయకం కదూ!
ఇదీ కథ… ఎస్, ఆమె పట్టుదల, శ్రమ అన్నీ మెచ్చుకోదగినవే… కానీ నాకెందుకో ఆమె భర్తను మనసారి అభినందించాలని ఉంది… ఎందరు భర్తలు ఇలా ఉంటారు..? భార్య చేతికి పట్టాలు వస్తున్నా, ఏకంగా పీహెచ్డీ వస్తున్నా, నిగర్విగా ఆమె వెంట వెళ్లి, ఆ పట్టా కోసం ఆమెతోపాటు వేదిక ఎక్కి, వినయంగా కనిపిస్తున్న ఆ భర్త కదా చప్పట్లకు అసలైన అర్హుడు… మొగుడంటే నువ్వేనోయ్…!! ఆమెను వెక్కిరిస్తూ, పలురకాలుగా సతాయించి ఉంటారు గ్రామస్థులు… ఐనాసరే, ఆమెలో పట్టుదలను పెంచినందుకు వారికి కూడా కంగ్రాట్స్, థాంక్స్…
Share this Article