బహుభార్యత్వం… అధికారికంగానే చాలా దేశాల్లో చెల్లుబాటులో ఉంది… అనధికారికం సంగతి వదిలేయండి, చిన్నిల్లు, పెద్దిల్లు, మూడో ఇల్లు గట్రా బోలెడు ఉదాహరణలు మన సమాజంలోనూ ఉన్నవే… మగాధిపత్య ప్రపంచమే కదా అధికశాతం… మరి ఆడాధిపత్యం ఎలా..? అవి ఉన్న సమాజాలు కూడా ప్రపంచంలో చాలా ఉన్నయ్… కానీ ఆయా సమాజాల్లో కూడా సంప్రదాయికంగా వస్తున్నదే తప్ప అధికారిక బహుభర్తృత్వం ఉందానేది డౌటే… బహుభర్తృత్వం అంటే ఒక భార్యకు ఒకరికన్నా ఎక్కువ మంది భర్తలు ఉండటం… అధికారికంగా..! చాలా దేశాల్లో ఈ పదం వింటేనే ఏదో పాపపు మాట విన్నట్టుగా చెవులు మూసుకుంటారు… కానీ భారతీయ సమాజానికి ఈ పదం కొత్తదేమీ కాదు… ద్రౌపది, పాంచాలీ పంచ భర్తృక… ఇక్కడ పాంచాలి అంటే అయిదుగురికి ఆలి అని కాదు అర్థం, పాంచాల దేశ రాచమహిళ… ఇప్పుడు తెలుగు టీవీ సీరియల్‌లాగా ఇంత ఉపోద్ఘాతం ఎందుకయ్యా అంటే… దక్షిణాఫ్రికాలో ప్రభుత్వమే బహుభర్తృత్వాన్ని చట్టబద్ధం చేయాలనే ఆలోచనలో ఉంది… విప్లవాత్మకమే కదా… సంప్రదాయవాదులు లబోదిబో… సహజంగానే…
నిజానికి ప్రపంచంలో ఎక్కడెక్కడికో ఎందుకు..? మన హిమాలయ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కులాల్లో, మారుమూల తెగల్లో ఈ బహుభర్తృత్వం ఇప్పటికీ ఉంది… పత్రికల్లో, బ్లాగుల్లో, సైట్లలో పలు కథనాలు కూడా వచ్చాయి… ఉదాహరణకు పైన చూపిన ఫోటో… పేరు రజోవర్మ… ఓ డెహ్రాడూన్ గ్రామం ఇది… ఈమెకు అయిదుగురు భర్తలు… (2016 నాటి ఫోటో)… ఆ అయిదుగురు భర్తలూ అన్నదమ్ములే… రోజుకొకరితో సంసారం వాళ్ల నియమం… హిందూ వివాహచట్టం ఒప్పుకోకపోవచ్చు… కానీ వాళ్ల సంప్రదాయం అంగీకరిస్తుంది… ఇలాంటి ఉదాహరణలు మన దేశంలోనే బోలెడు… అవునూ, ఒక మగాడికి ఎందరు భార్యలున్నా సరే అయినప్పుడు ఒక ఆడదానికి ఎందరు భర్తలుంటేనేం..? జటిలమైన ప్రశ్న కదా… ఆ ప్రశ్నపైనే ఇప్పుడు దక్షిణాఫ్రికా సమాజం మథనపడుతోంది…
Ads
దక్షిణాఫ్రికాలో ఒక మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు, చట్టబద్ధమే… ఎందరిని భరిస్తాడనేది వాడి ‘కెపాసిటీ’ మీద ఆధారపడి ఉంటుంది… దైహికమే కాదు, ఆర్థికం, సామాజికం, టైం సర్దుబాటు, ప్రేమ ఎట్సెట్రా చాలా ఉంటయ్ కదా… సేమ్, ఎక్కువ మంది భర్తల్ని రేప్పొద్దున ఆ దేశ చట్టం అంగీకరించినా సరే… ఆమె కెపాసిటీ, ఎబిలిటీ కూడా ముఖ్యమే… మగ ఇగోల నడుమ సాము చేయాల్సి ఉంటుంది… అందరి కోరికలనూ భరించాల్సి ఉంటుంది… ప్రభుత్వం ఒకటి ప్రతిపాదిస్తే చాలు, ప్రతిపక్షం వెంటనే వ్యతిరేకించాలి కదా, ఇదో దిక్కుమాలిన ఆనవాయితీ మన దేశంలోనే కాదు, అన్నిచోట్లా ఉన్నదే కదా… వెంటనే దక్షిణాఫ్రికా ప్రతిపక్షం African Christian Democratic Party (ACDP) ఈ మతిలేనిచర్య మన సంస్కృతిని నాశనం చేస్తుందని గగ్గోలు స్టార్ట్ చేసింది… మత సంప్రదాయవాదులు కూడా ఠాట్, వీల్లేదు అంటున్నయ్…
ఐదుగురు భార్యల్ని పెళ్లిచేసుకున్న ఓ రియాలిటీ స్టార్ ఉన్నాడు… పేరు Musa Mseleku… బీబీసీతో మాట్లాడుతూ… ‘‘ఈ చట్టం తీసుకొస్తే ఆఫ్రికా సంస్కృతికే అవమానం… ధ్వంసమే…’’ అంటున్నాడు… తన రీజనబుల్ బాధేమిటయ్యా అంటే… సంతానానికి జెనెటికల్ తండ్రిని ఎలా ఖరారు చేస్తారు అని…! అసలు తండ్రి పేరునే ధ్రువపత్రాల నుంచి తీసేసి, కేవలం తల్లి పేరు మాత్రమే పరిగణనలోకి తీసుకోబడుతుంది అని ప్రకటిస్తే..?! అది మరో సెన్సేషన్ అవుతుందేమో… ‘‘ఆమె ఇంటిపేరును మేం తగిలించుకోవాలా ఇకపై..? కట్నం బదులు కన్యాశుల్కం ఇవ్వాల్సి ఉంటుందా..? ఆమె పెత్తనాన్ని మోయాలా..?’’ ఇవీ తన ప్రశ్నలు… పలువురు సామాజికవేత్తలు ‘‘ఆడవాళ్లకు నిజమైన సమానత్వం ఇవ్వడానికి ఇప్పటికీ ఆఫ్రికన్ సమాజాలు సంసిద్ధంగా లేవు… కేవలం బహుభర్తృత్వాన్ని చట్టబద్ధం చేయడం ద్వారా మాతృస్వామ్యాన్ని ఏమీ తీసుకురాలేం’’ అంటున్నారు కాస్త నిరాశగానే..! మన దేశాల్లో ప్రభుత్వాలు వివిధ అంశాల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటయ్ కదా… ఆ దేశంలో భిన్నమైన అంశాలపై ప్రజల్లో చర్చకు, ఫీడ్ బ్యాక్ కోసం హరితపత్రాలను రిలీజ్ చేస్తుంటుంది… ఇప్పుడు బహుభర్తృత్వంపై చేసిన పనీ అదే..!! కనీసం ఓ డిబేట్ కోసమైనా సరే ఇలా మన దేశంలో ‘గ్రీన్ పేపర్’ రిలీజ్ చేయడం సాధ్యమేనా..? జస్ట్, ఆస్కింగ్…!!
Share this Article