‘‘1990 వేసవి… నేనూ, నా స్నేహితురాలు ఇండియన్ రైల్వే (ట్రాఫిక్) సర్వీస్ ప్రొబేషనర్లం… లక్నో నుంచి ఢిల్లీకి ప్రయాణించాం రైలులో… మేం ఉన్న బోగీలోనే ఇద్దరు ఎంపీలు ఉన్నారు… వాళ్లతోపాటు ఉన్న దాదాపు డజను మంది కార్యకర్తలు, అనుచరుల ప్రవర్తన నీచస్థాయిలో ఉంది… వాళ్లెవరికీ రిజర్వేషన్లు లేవు… మా రిజర్వ్‌డ్ సీట్ల నుంచి మమ్మల్ని దింపి, మా లగేజీ మీద కూర్చోబెట్టారు… వాళ్ల చూపులు, మాటల తీరు ఏవగింపు కలిగించేలా ఉంది… బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం…
ఇతర ప్రయాణికులు, చివరకు టికెట్ ఎగ్జామినర్ కూడా సైలెంట్… థాంక్ గాడ్, ఢిల్లీ చేరాం, ఆ ప్రయాణం ప్రభావంతో మా స్నేహితురాలు అహ్మదాబాద్‌లో జరగాల్సిన శిక్షణను ఎగ్గొట్టేసింది… అటు వైపు రైలు ప్రయాణం ఇంకెంత చేదుగా ఉంటుందో అనే భయం… కానీ నాతో మరో స్నేహితురాలు జాయినైంది… (రైల్వే బోర్డు సభ్యురాలు ఇప్పుడు)… రిజర్వేషన్ లేదు, వెయిటింగ్ లిస్టు… రాత్రి ప్రయాణం, అహ్మదాబాద్ వెళ్లే రైలెక్కాం…
టికెట్ ఎగ్జామినర్‌ను కలిసి, మా పరిచయం చేసుకున్నాం, బెర్త్ దొరకడం కష్టమే… సరే, మీరు ఈ బోగీలో అడ్జస్ట్ చేసుకొండి అంటూ ఓ బోగీ చూపించాడు… తీరా అందులో ఇద్దరు రాజకీయ నాయకులు కనిపించారు… నాలో మళ్లీ దడ… టీటీఈ నా భయాన్ని చూసి, నవ్వుతూ, వాళ్లు నాకు తెలుసు, నిర్భయంగా జర్నీ చేయండి అన్నాడు… ఆ ఇద్దరూ మూలకు జరిగి మా ఇద్దరికీ సీట్లు చూపించారు… ఒకాయన నలభై, మరొకాయన ముప్ఫై వరకూ ఉంటారు…
Ads
మేమిద్దరం గుజరాతీ బీజేపీ నాయకులం అని వాళ్లు పరిచయం చేసుకున్నారు, ఏవో పేర్లు చెప్పారు కానీ నా బుర్రలో రిజిష్టర్ కాలేదు… మాది అస్సాం, ఇద్దరమూ రైల్వే ప్రొబేషనరీ ఆఫీసర్లం అని చెప్పాం… నా స్నేహితురాలు ఢిల్లీ యూనివర్శిటీలో హిస్టరీలో పీజీ చేసింది, ఆ ఇద్దరు నాయకులతో రాజకీయాలు, చరిత్ర చర్చల్లోకి దిగిపోయింది… ఇద్దరికీ హిందూమహాసభ, ముస్లింలీగ్ గురించి బాగా అవగాహన ఉన్నట్టుగా ఉంది… నాకు అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చి ‘‘శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీ అంటుంటారేమిటి..?’’ అన్నాను…
ఆ ఇద్దరిలో తక్కువ వయస్సున్న అతను వెంటనే చురుకుగా నావైపు చూసి, ఆయన గురించి మీకెలా తెలుసు అనడిగాడు… ఆయన కలకత్తా యూనివర్శిటీ వీసీగా ఉన్నప్పుడు మా ఫాదర్ అక్కడ పీజీ స్టూడెంట్, ఆయనే ఓ స్కాలర్‌షిప్ ఇప్పించాడు, మా నాన్న ఎప్పుడూ ఆయన్ని గుర్తుచేసుకునేవాడు అని వివరించి చెప్పాను… ఓహ్, ఇది వినడం ఆనందంగా ఉందీ అన్నాడతను… నాలుగు గుజరాతీ థాలీలు వచ్చినయ్, వాళ్లే డబ్బులిచ్చారు… మేమివ్వబోతే తీసుకోలేదు… టీటీఈ వచ్చి బెర్తులు దొరకడం లేదన్నాడు… ఆ ఇద్దరు నాయకులు వెంటనే ‘‘పర్లేదు, అడ్జస్ట్ చేసుకుందాం’’ అంటూ ఓ వస్త్రాన్ని ఫ్లోర్ మీద పరిచేసి పడుకున్నారు, వాళ్ల బెర్తులు మాకిచ్చేశారు…
ఆ లక్నో జర్నీకి, ఈ అహ్మదాబాద్ జర్నీకి నడుమ ఎంత తేడా..? పూర్తి కంట్రాస్టు… వాళ్లూ ఇద్దరు ఎంపీలు, వీళ్లూ ఇద్దరు రాజకీయ నాయకులు… ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాను… ఉదయం అహ్మదాబాద్ చేరింది రైలు… మీ వసతి మాటేమిటని అడిగాడు పెద్దాయన… ప్రాబ్లం ఉంటే తన ఇంటికి వచ్చేయండని అడ్రస్ చెప్పాడు… చిన్నాయనేమో… ‘‘నేను ఓ నిత్యసంచారిని, నాకే సరైన ఇల్లు లేదు, అందుకని నేను మిమ్మల్ని రమ్మనడం లేదు’’ అన్నాడు నవ్వుతూ… డైరీలో వాళ్లిద్దరి పేర్లూ రాసుకున్నాను అక్కడే… ఆ పెద్దాయన పేరు శంకర్ సింఘ్ వాఘేలా… చిన్నాయన పేరు నరేంద్ర మోడీ…
1995లో ఓ అస్సామీ పత్రికలో నా అనుభవాన్ని, భయాన్ని ఓ ఆర్టికల్‌గా రాశాను… వాళ్లిద్దరూ ప్రముఖ స్థానాల్లోకి ఎదుగుతారని నేనస్సలు అంచనా వేయలేదు… 1996లో వాఘేలా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు… 2001లో మోడీ ముఖ్యమంత్రి అయ్యాడు… తరువాత కొన్నాళ్లకు మరో అస్సామీ పత్రిక నా ఆర్టికల్‌ను యథాతథంగా పబ్లిష్ చేసింది… ఇప్పుడు ఈ వ్యాసం రాసే సమయానికి ఆయన ప్రధాని అయిపోయాడు…”
……….. లీనా శర్మ అనే ఐఆర్ఎస్ అధికారిణి తన పాత రైలు జర్నీని గుర్తుచేసుకుంటూ, 2014లో హిందూలో రాసిన ఆర్టికల్ ఇది… ఇదంతా చదివాక అనిపించింది ఏమిటంటే… ‘‘ఓ ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా, బీజేపీ ఫుల్ టైం వర్కర్‌గా నిరాడంబరంగా, సొంత జీవితాన్ని, సొంత కుటుంబాన్ని కూడా వదిలేసి, అంత సత్‌ప్రవర్తనను కనబరిచిన మోడీ… నిజంగా సొసైటీకి మేలు చేయగల పదవిలో ఉండి… కార్పొరేట్ అనుకూలుడిగా మారి, జనసామాన్యంతో కనెక్ట్ కాకుండా ఎలా పాలిస్తున్నాడు..?’’ సరే, ఆ చర్చలోకి వెళ్లలేం ఇప్పుడు, ఇక్కడ… కానీ ఒక విషయాన్ని చెప్పుకోవాలి…
ఈమె రాసిన ఆర్టికల్ వాఘేలా వద్దకు చేరింది… ఆనందపడ్డాడు… తను ఒక హిందూ జర్నలిస్టుతో ఏమన్నాడంటే..? అప్పట్లో నేను ఎంపీని, నాతోపాటు మరో వ్యక్తిని కూడా రైలులో తీసుకుపోవచ్చు, అందుకే మోడీని వెంటేసుకుని తిరిగేవాడిని, ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉండేది నాకు, మోడీని వెనుక కూర్చోబెట్టుకుని గుజరాత్‌లో బోలెడు ప్రాంతాలకు వెళ్లేవాళ్లం… పార్టీ సానుభూతిపరులు, రచయితల ఇళ్లల్లో వసతి, భోజనం… అయిదారేళ్లు తిరగడమే పని మాకు…
మోడీ లక్షణాలు కాస్త డిఫరెంటు… ఫస్ట్ నుంచీ అంతే… విడిగా, ప్రత్యేక గుర్తింపు కావాలనే కోరిక అధికం… ఆర్ఎస్ఎస్‌లో అందరూ ఖాకీ షర్ట్స్ వేసుకుని వస్తే, తను తెల్లచొక్కా వేసుకునేవాడు… చేతికి అందరూ ఎర్రటి దారాన్ని కట్టుకుంటే తనేమో నల్లటి దారాన్ని కట్టేవాడు… తన చెప్పులు కూడా డిఫరెంటే… తన లుక్కు మీద బాగా ధ్యాస ఎక్కువ… ఫోటోలంటే కాస్త పిచ్చి’’ అని చెప్పుకొచ్చాడు… ఇది 2016 నాటి మాట… అవునవును, మనమూ మోడీ దుస్తులు, డిఫరెంటు లుక్కు, ఫోటోల మీద ప్రేమ ఈరోజుకూ గమనిస్తూనే ఉన్నాం కదా… ఆయన అప్పుడే చెప్పాడు…
ఇదంతా సరే గానీ, ఇద్దరు ఆడపిల్లల బెర్తుల కోసం, మీరు ఆ బోగీ ఫ్లోర్ మీద ఓ షీట్ పరిచి పడుకున్నారు కదా, అప్పటికే మీరు ఎంపీ… అభినందనీయం సార్ అన్నాడు ఆ జర్నలిస్టు… ‘‘పిల్లలు, వృద్ధులు, మహిళల గురించి ఆలోచించకపోతే ఇక ఆ పదవి దేనికి..? ఐనా మాకు అలవాటే ఇవన్నీ… ఎక్కడ కాస్త చోటు దొరికితే అక్కడ పడుకోవడం, ఎవరు ఏది పెడితే అది తినడం..’’ అని బదులిచ్చాడు ఆయన…
అలాంటి వాఘేలా తరువాత తరువాత మరీ దిగజారిపోయినట్టు అనిపిస్తుంది… మొదట బీజేపీ నుంచి విడిపోయి, రాష్ట్రీయ జనతా పార్టీ పెట్టాడు… కాంగ్రెస్ సపోర్టుతో సీఎం, తరువాత కాంగ్రెస్‌లో విలీనం… మళ్లీ కాంగ్రెస్‌కు బైబై చెప్పేసి, బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో సపోర్ట్ చేశాడు… జనవికల్ప్ మోర్చా అని మరో పార్టీ పెట్టాడు… ఎన్నికల సంఘం అనుమతి నిరాకరణతో జైపూర్ కేంద్రంగా ఉండే All India Hindustan Congress Party జెండా కింద, వాళ్ల గుర్తుతోనే పోటీచేశాడు… 95 మంది అభ్యర్థులను నిలబెడితే 0.3 శాతం వోట్లు వచ్చాయి… తరువాత ఎన్సీపీలో చేరాడు… ఇప్పుడు అందులో కూడా లేడు… సో, వ్యక్తిగతాలు వేరు… రాజకీయ ప్రవర్తన వేరు…!!
Share this Article