ఆ బీరువాను మా అమ్మమ్మ అమ్మకు పెళ్లి సమయంలో ఇచ్చిందట… చాలా ఏళ్లపాటు ఆ బీరువా అంటే అమ్మకు అదోరకమైన అనుబంధం… ప్చ్, మాకన్నా ఆమె దాన్నే ఎక్కువ భద్రంగా చూసుకునేదంటే పెద్దగా ఆశ్చర్యం లేదు… కొత్తగా కట్టిన ఇంట్లో మంచి ఆధునికమైన వార్డ్ రోబ్స్, పెస్ట్ రెసిస్టెంగ్ ఫినిషింగ్, ఐరన్ సేఫ్ ఉన్నా సరే… ఆమె తన బీరువాను మాత్రం వదల్లేదు…
మోడరన్ లుక్కులో అదొక్కటీ ఆడ్‌గా కనిపిస్తున్నదీ అంటున్నా వినేది కాదు… వస్తువుల మీద ప్రేమ పెంచుకోవద్దమ్మా, వాడుకోవాలి, అవసరం తీరగానే, పాతబడగానే, కొత్తవి దొరకగానే వదిలించుకోవాలి అని మా పెద్దన్నయ్య అంటే కొట్టినంత పనిచేసింది… మరి నేనూ పాతబడిపోయాను, బజారులోకి విసిరేస్తారా అనడిగింది మండిపడుతూ…! కొత్త అమ్మ అంటూ దొరకదు కదమ్మా, లేకపోతే అంత పనీ చేసేవాణ్ని తెలుసా అని అన్నయ్య కొంటెగా బదులిచ్చేవాడు…
ఆ బీరువాకు సంబంధించిన జ్ఞాపకాలు నాకు చాాలా గుర్తున్నయ్… అమ్మ బీరువా తలుపులు తెరిస్తే చాలు, ఇంట్లోని పిల్లాపీచూ అందరమూ అక్కడ గుమిగూడేవాళ్లం… నాకయితే అది ఓ ట్రెజరీలాగా కనిపించేది… తలుపులు తెరవగానే అమ్మ చేతుల కింద నుంచి నేను అందులో చేయి పెట్టేవాడిని… ఒరేయ్, భడవా, విలువైన పేపర్లు అటూఇటూ పడిపోతాయిరా అని అరిచేది నాపైకి… నిజమే, అందులో ఉన్న బట్టలకన్నా విలువైన జ్ఞాపకాలే ఎక్కువ…
Ads
అమ్మమ్మ చేతిలో చేసిన బొమ్మ, తను కప్పుకునే శాలువా, నాన్న కశ్మీర్ నుంచి తెచ్చిన పర్స్, మా ముగ్గురు బ్రదర్స్ మరియు సిస్టర్స్ మార్క్ షీట్లు… ఫస్ట్ తరగతి నుంచీ ఉన్నయ్… నా స్కూల్ గ్రూపు ఫోటోగ్రాఫ్ కూడా ఉంది… వందసార్లు చూసినా సరే, ప్రతిసారీ కొత్తగా చూసినట్టుండేది నాకు… నాతోనే అమ్మకు పరేషాన్… నేను పరిసరాల్లో లేకుండా చూసి తలుపులు తెరిచేది… ఎక్కడి నుంచో హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడిని… క్రమేపీ అమ్మకన్నా నాకే ఆ బీరువాతో ఎక్కువ అనుబంధం పెరిగింది…
బీరువా తలుపుల లోపలి వైపు చిన్న గుడ్డ సంచీలాగా ఉంటుంది… అందులో మా బర్త్ సర్టిఫికెట్లు…, మా చేతులు, కాళ్ల ముద్రల కాగితాలు ఉండేవి… వాటిని చూడటం భలే సరదాగా ఉండేది… వాటితో ఇప్పటి చేతులు, కాళ్లను పోల్చుకుంటూ… అప్పట్లో ఎంత చిన్నగా ఉన్నామో అనే భావనలోకి జారుకునేవాళ్లం… వెడ్డింగ్ కార్డుల మీద రాసున్న పేర్లను చదువుతూ ఉంటే అమ్మ వచ్చి వీపు మీద ఒక్కటి బలంగా ఇచ్చేది… ఒరే, మీరు అన్నీ చింపేస్తున్నారురా అని విసుక్కునేది…
నా పెళ్లికి ముందు మొత్తం ఇంట్లో ఇంటీరియర్ మోడరన్ చేసేశాం… అమ్మ బీరువా మాత్రం ఆమె బెడ్రూంలో అలాగే ఉంది… అది ఇక్కడ ఫిట్ కాదు, స్టోర్ రూంలో పెడదాం అని నాన్న చెప్పినా వినేది కాదు…… ఇప్పుడు అమ్మలేదు… ఆ బీరువా మరీ వెనుకగా ఉండే స్టోర్ రూంలోకి చేరిపోయింది… మేమూ కడుపు చేత్తో పట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్లిపోయాం… ఇప్పటికీ మేం ఎప్పుడైనా ఇంటికి వెళ్తే నేను ఆ బీరువా తలుపులు తెరిచేవాడిని… కానీ..?
అప్పట్లో అమ్మ ఉన్నప్పుడు ఓ పరిమళం ఉండేది… అదిప్పుడు లేదు… ఆ పాత జ్ఞాపకాలన్నీ ఉన్నాయి… తీసి చదువుతున్నా, చేతులతో పట్టుకున్నా పాతకాలం నాటి ఆ ఎక్సయిట్‌మెంట్ కలగడం లేదు… ఎందుకు..? నా చేతుల్ని వెనక్కి లాగి, వీపుపై బలంగా ఒక్కటి చరిచే చేతులు లేక కావచ్చు..? అమ్మ లేదు కదా… అది తలుచుకోగానే కళ్లల్లోకి నీళ్లొస్తాయి… అమ్మ యాదికొస్తుంది… అమ్మ చీరె ఒకటి తీసుకుని ఆ మడతల్లో మొహం దాచుకుంటాను… అమ్మ ఒడిలోనే తల పెట్టినట్టు ఉంటుంది…
వెనుక నా భార్య నిలబడి నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుంది… ఆమెకు నా ఫీలింగ్స్ అర్థమవుతాయి… ఇప్పటికీ మా కరీనా అంచులు కుట్టిన దస్తీ ఆ బీరువాలో అలాగే ఉంది… మా బామ్మ కొన్న బొమ్మ, శాలువా, మా మార్క్ షీట్లు అలాగే ఉన్నయ్… తలుపులు తెరిచి అలాగే కాసేపు ఉంచుతాను… అమ్మ వెనుక నుంచి నా వీపు మీద ఒక్కటిస్తే ఎంత బాగుణ్ను…!! (ఓ ఇంగ్లిష్ ఫేస్‌బుక్ పోస్టుకు నా తెలుగు అనువాదం ఇది…)
Share this Article