Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ముక్కల హత్య కథ చదువుతుంటే… ఓ పాత హత్య కేసు గుర్తొచ్చింది…

January 24, 2025 by M S R

.
Bhandaru Srinivas Rao  …… ఈనాటి వార్త గుర్తు చేసిన 65 ఏళ్ళ కిందటి క్రైమ్ స్టోరీ

ఇది జరిగిన కధే. అంచేత ఓ కధలా ముచ్చటిద్దాం. పేర్లూ, ఊర్లూ తర్వాత చెప్పుకుందాం.

అతడో పెద్ద అధికారి. భార్యా, ముగ్గురు పిల్లలు. ఉద్యోగ బాధ్యతల కారణంగా అతడు నెలలో చాలా రోజులు వేరే ఊళ్లలో ఉంటుంటాడు. ఈ క్రమంలో అతడి భార్యకు భర్త స్నేహితుడితో సంబంధం ఏర్పడుతుంది. విడాకులు తీసుకుని అతడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ ప్రియుడి ఉద్దేశ్యం వేరు. ఆడవాళ్ళను వాడుకుని వదిలేసే రకం.

Ads

ఈ విషయం భర్తకు తెలుస్తుంది. అధికార రీత్యా ప్రభుత్వం అతడికి సమకూర్చిన రివాల్వర్ తీసుకుని భార్యను లోబరుచుకున్న వ్యక్తి ఇంటికి వెడతాడు. నా భార్యను పెళ్లి చేసుకుని, నా పిల్లల్ని నీ పిల్లలుగా చూసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అని నేరుగా అడిగేస్తాడు.

‘నాతొ కాలక్షేపం చేసిన ప్రతి అమ్మాయిని పెళ్ళాడాలంటే నేను వెయ్యి పెళ్ళిళ్ళు చేసుకోవాలని అతడు ఎకసెక్కంగా మాట్లాడుతాడు. భర్తకు పట్టలేని ఆగ్రహం కలిగి పిస్టల్ తో కాలుస్తాడు. భార్య ప్రియుడు అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తాడు.

అతడు నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి నేరం ఒప్పుకుని లొంగిపోతాడు. కేసు విచారణ సుదీర్ఘంగా సాగుతుంది. జ్యూరీ అతడ్ని నిర్దోషిగా పరిగణిస్తుంది. కానీ సెషన్స్ జడ్జి జ్యూరీ నిర్ణయాన్ని కాదని కేసును హై కోర్టుకు పంపుతాడు. అక్కడ అతడికి జీవిత ఖైదు విధిస్తారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు ధ్రువ పరుస్తుంది.
ఇక్కడ కధ మరో మలుపు తిరుగుతుంది.

ఇప్పుడు పేర్లూ వివరాలు చెప్పుకుందాం. అతడి పేరు నానావతి. నేవీ కమాండర్. స్నేహితుడి పేరు ప్రేమ్ ఆహూజా. బాగా డబ్బున్నవాడు. విలాసపురుషుడు.

కధలో మలుపుకి కారణం ఓ పత్రిక. ఒకానొక రోజుల్లో విపరీతమైన పాఠకాదరణ కలిగిన ఇంగ్లీష్ వారపత్రిక బ్లిట్జ్. ఆ పత్రిక ఎడిటర్ ఆర్కే కరంజియా.

ఆ పత్రిక ముద్దాయిని భుజాలకు ఎత్తుకుంటుంది. ధారావాహిక కధనాలు అతడికి మద్దతుగా ప్రచురిస్తుంది. దానితో ప్రజలందరూ ఆ కేసు గురించే మాట్టాడుకోవడం మొదలవుతుంది. పాతిక పైసల పత్రికను రెండు రూపాయలు పెట్టి కొనుక్కుని చదివేవారు.

నానావతి పేరుతో పిల్లలు ఆడుకునే బొమ్మ పిస్తోళ్లు, ఆహూజా పేరుతొ టీ షర్టులు అమ్మడం మొదలైంది. నానావతికి నైతిక మద్దతు తెలుపుతూ ర్యాలీలు, ఊరేగింపులు జరుగుతాయి. దేశవ్యాప్తంగా నానావతి కేసు ఓ సంచలనంగా మారుతుంది.

చివరికి అప్పటి మహారాష్ట్ర గవర్నర్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ క్షమాభిక్ష పెట్టి అతడి యావజ్జీవ శిక్షను రద్దు చేయడంతో కధ సుఖాంతమవుతుంది.

కేసు నుంచి బయట పడిన నానావతి తన కుటుంబాన్ని తీసుకుని కెనడా వెళ్లి అక్కడే సెటిల్ అయి అక్కడే చనిపోవడంతో అతడి కధ ముగుస్తుంది.

ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. బ్లిట్జ్ పత్రిక యజమాని, సంపాదకుడు ఆర్కే కరంజియా పార్సీ. ముద్దాయి నానావతి కూడా పార్సీ.

1959లో కాబోలు ఇది జరిగింది. అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నాను. ఆంధ్ర పత్రిక వాళ్ళు దీన్ని ఓ సీరియల్ గా ప్రచురించేవారు. బ్లిట్జ్ పత్రిక ఏమి రాసిందో తెలియదు కానీ అంధ్రపత్రిక మాత్రం ఆసక్తికరమైన వార్తా కధనాలను వండి వార్చేది.

కోర్టులో వాదోపవాదాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవడం మీద ఆ రోజుల్లో జనాలకు చాలా ఆసక్తి వుండేది. ప్రాసిక్యూషన్ తరపున రాం జెట్మలానీ వాదిస్తే, ముద్దాయి నానావతి తరపున ఖండాలావాలా ఈ కేసు వాదించారు. ఇరవై నాలుగు గంటల టీవీ చానళ్ళ కాలంలో జరిగివుంటే పండగే పండగ…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions