ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్ కమిటీ నాగభరణ గారూ… మీరు మీడియా ముఖంగా ఇచ్చిన ఓ వివరణ అసంపూర్ణంగా, అసంతృప్తికరంగా ఉంది… ఒకింత అసమంజసంగానూ ఉంది… ఎస్, మీకు మంచి పేరే ఉంది… మీరేదో పక్షపాతంతో గానీ, నిర్లక్ష్యంతో గానీ ఆస్కార్ ఎంట్రీని ఎంపిక చేశారని ఎవరూ ఆరోపించడం లేదు… ఆర్ఆర్ఆర్, కశ్మీరీ ఫైల్స్ సినిమాల్లో ఏదో ఒక దానిని ఎందుకు ఎంపిక చేయలేదు అని కూడా అడగడం లేదు…
నిజమే, మీరన్నట్టు ఆర్ఆర్ఆర్ సినిమా జస్ట్, ఓ పాపులర్, కమర్షయల్ ఎంటర్‌టెయినర్… దాని కథకు హిస్టరీపరంగా, సినిమా టేకింగ్‌కు కొత్త ప్రయోగాలపరంగా ఏ విలువా లేదు… డబ్బుల కోసం తీయబడిన ఓ నాసిరకం గ్రాఫిక్ సినిమా అది… ఏదో ప్రాంతీయాభిమానం కొద్దీ కొందరు ట్రిపుల్ ఆర్ ఎంపిక కాకపోవడం పట్ల అభిమానంతో కూడిన ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తీకరించవచ్చుగాక… RRR ను కొందరు దర్శకులు ఎందుకు మోస్తున్నారో తెలియదు… కానీ ఈ విషయంలో మీ నిర్ణయం కరెక్టే…
మీరు చెబుతున్న కారణాలూ కరెక్టే… ఆస్కార్ ఎంట్రీ కోసం ఎక్కువ కలెక్షన్లు, ఎక్కువ రీచ్, ఎక్కువ పాపులారిటీ అనేవి ప్రామాణికం కావు… కశ్మీరీ ఫైల్స్ సినిమాను కూడా మరోకోణంలో పెద్దగా ఈ ఎంట్రీ కోసం పరిశీలించలేరు మీరు… రియాలిటీ, హిస్టరీ అంటూ ఎక్కువ హింస చిత్రీకరణకే ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శ ఒకటి ఉంది…
Ads
ఎస్, మీరు చెబుతున్నది కూడా నిజమే… మీ పరిశీలనకు వచ్చిన 13 చిత్రాలూ మంచివేననీ, దేనికవే మెరిట్ ఉన్న చిత్రాలనీ పొగుడుతున్నారు… డిప్లొమాటిక్ ధోరణి కోణంలో మీ వైఖరి మంచిదే… కానీ అన్నీ మంచి సినిమాలే అని ఎలా సూత్రీకరిస్తారు..? మీ ఎంపికను సమర్థించుకొండి, సమర్థనకు ప్రయత్నించండి, అంతేతప్ప ప్రతి చెత్త సరుకుకు కూడా సర్టిఫికెట్ ఇవ్వకండి… ‘‘ఏదో ఒకటే ఎంపిక చేయగలం, ఎలాగూ మిగతావాళ్లు నిరాశపడతారు, తప్పదు కదా…’’ అంటున్నారు కదా… అదెప్పుడూ ఉండేదే… ఈ శుష్కప్రియాలు దేనికి..?
ఇక్కడ చెప్పాలనుకున్నది ఏమిటంటే..? మీరు ఏదో జస్టిఫై చేసుకున్నారు మీ నిర్ణయాన్ని… ఓ గుజరాతీ సినిమా చెల్లోషోను ఎంపిక చేశారు… ‘‘ఆ కథలో, కథనంలో అందరికీ నచ్చే మానవీయ కోణం ఉంది.., పిల్లల అమాయకత్వం, కలల ప్రపంచం గురించి జనాన్ని కనెక్ట్ చేసే ప్రజెంటేషన్ ఉంది.., ఒక కలగంటే దాన్ని నిజం చేసుకోవడం కోసం జరిపే పోరాటం ఆశల్ని చిగురింపజేస్తుంది… ప్రపంచంలో ఎవరికైనా కనెక్టయ్యే థీమ్ ఇది… అందుకే మా జ్యూరీలో అందరమూ ఏకీగ్రీవంగా చెల్లోషోను ఎంపిక చేశాం’’… ఇదే కదా మీరు చెప్పింది…
‘‘దేశం తరఫున పంపించే సినిమా వేరు, కమర్షియల్ రొటీన్ చిత్రాలు వేరు, మన ఎంపిక మన దేశాన్ని గొప్పగా రిప్రజెంట్ చేయాలి’’ అంటున్నారు కదా… ఈ సినిమా గతంలో, అంటే 1988లో ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో అవార్డు పొందిన #cinemaparadiso కు ఓ నాసిరకం అనుకరణ కాదా..? ఆ సినిమా గురించి మీ జ్యూరీ సభ్యులకు అసలు అవగాహన ఉందా..? అదే కథ, అదే ప్రజెంటేషన్ ఉన్న సినిమాను మళ్లీ అదే కేటగిరీలో అవార్డు కోసం పంపించడం దేశం పరువు నిలిపేదా..? దిగజార్చేదా..?
ఈ సహేతుక విమర్శకు మాత్రం మీ నుంచి జవాబు లేదు… అది కదా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అసలు ప్రశ్న… రాజకీయ నాయకుల్లాగా అక్కర లేని నీతిబోధలన్నీ చేసి, అసలు ప్రశ్నను దాటేయడం ఏమిటి..? Not RRR, Not Kashmir Files… Ok, Buy Why ChelloShow…?!
Share this Article