Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమెని బర్రెలక్క అని పిలవడంలో నాకేమీ నామోషీ లేదు…

November 25, 2023 by M S R

బర్రెలక్క నిర్ణయం.. చాన్నాళ్లు చెప్పుకొనే సంగతి! ఇవాళ దేశమంతా చెప్పుకొంటున్న ఎమ్మెల్యే అభ్యర్థిని బర్రెలక్క (శిరీష) గారిది మా రాష్ట్రం. ఆమె మా ఉమ్మడి పాలమూరు జిల్లా మనిషి. ఈ మాట అనుకోవడానికి గర్వంగా ఉంది. పాతికేళ్లు దాటిన ఓ విద్యావంతురాలైన స్త్రీ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎన్నికల్లో నిలవడమనే విషయం తల్చుకుంటేనే చాలా చాలా బాగుంది.

ఆమెని ‘బర్రెలక్క’ అని పిలవడంలో నాకేమీ నామోషీ లేదు. ఆ పేరులో ఒక నిరసన ఉంది‌. బహుజన, శ్రామిక తత్వం ఉంది. దాన్ని సొంతం చేసుకున్న ఆమెను అలా పిలవడం అవసరం, ఆనందం. ‘Youth is Politics’ అనేది అత్యంత చర్చకు పాత్రమైన అంశం. ప్రధాన రాజకీయ పార్టీలకు ఎప్పుడూ యువత కావాలి. జెండాలు మోసి, బ్యానర్లు కట్టి, నినాదాలు చేస్తూ, వీలైతే ఎదుటి పక్షాల మీద కర్రలు విసిరి, కారాలు నూరేందుకు కావాలి.

ఎమ్మెల్యే కొడుకులను ‘అన్నా.. అన్నా’ అంటూ పిలిచి, ఆయన వెంట తిరుగుతూ, బర్త్‌డేలకు కేకులు కోసేందుకు కావాలి. యువతకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామనే పేరు రాజకీయ పార్టీలకు కావాలి. ఆ యువతను ముందు నిలబెట్టడం ద్వారా పడే ఓట్లు కావాలి. కాబట్టి “Youth should come into Politics” అంటారు. “వస్తే ఏం చేస్తారు సార్?” అని అడిగితే “అబ్బో బోలెడన్ని ఉన్నాయి. అవన్నీ మీకే! ప్రజాసేవకే” అంటారు. ఏమిటవి?

Ads

బహు చక్కటి పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు. మరీ తప్పదంటే వార్డు మెంబర్, కార్పొరేటర్.. ఇంకా కావాలంటే ఎమ్మెస్సీ లాంటివి. కానీ ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకమైన ఎమ్మెల్యే, ఎంపీ లాంటి పదవులకు మాత్రం ససేమిరా! అనుభవం చాలదు అంటారు. వాటికంటూ ప్రత్యేక రక్తంతో పుట్టినవారు ఉన్నారు. వాళ్ల దృష్టిలో ఆ వ్యక్తులే యూత్. ఆ రాజకీయవారసులకే పదవులు సొంతం! “ఇప్పుడే విమానం దిగిన ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు టికెట్లు ఇచ్చారు కదా? వాళ్లకేం అనుభవం ఉంది?” అని అడిగితే సమాధానం లేదు. లేదని కాదు, చెప్పరు. ఆ సమాధానం పేరు “డబ్బు, పరపతి, బంధుప్రీతి, ఒత్తిడి, అవసరం, కేసుల భయం”…

బర్రెలక్కలో రెండు విషయాలు నాకు బాగా నచ్చాయి. మొదటిది తన నిరసనను ప్రాక్టికల్‌గా చూపడం. ఆమె ఇంకా వీడియోలు చేస్తూనో, టీవీ డిబేట్లలో ఇంటర్వ్యూలు ఇస్తూనో, సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టొచ్చు. కొంతకాలానికి అవి అందరికీ బోర్! అవే అని ఏముంది? నిజాలేవైనా ఎక్కువసార్లు చెప్తే జనాలకి బోరే! వీడియోలకు లైకులు రావు. టీవీ చానెళ్లు పిలవడం మానేస్తాయి.

‘సారంగదరియా’ పాట అసలు గాయనిని, ‘కచ్చా బాదాం’ పాట పాడి పాపులర్ అయిన బాదం వ్యాపారిని మనం గుర్తు పెట్టుకున్నామా ఏంటి? రెండు రోజులు చూసి ‘తమరిక అవతలికి నడవండి. మేం వేరే ప్రోగ్రాములు చూస్తాం’ అని నిష్కర్షగా వదిలేశాం! మనకది అలవాటైన పద్ధతి. బర్రెలక్క కూడా ఆ జాబితాలో ఒకరిగా చేరి కాసేపు ఉత్తుత్తి హడావిడి చేయక ప్రాక్టికల్‌గా, రాజ్యాంగబద్ధంగా తన నిరసనను తెలపడం నాకు నచ్చింది.

రెండోది.. తను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం. బీఆర్‌ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్, భాజపా లాంటి పార్టీలు ఎలాగూ బర్రెలక్క లాంటి వారికి టికెట్ ఇవ్వవు. మిగిలిన పార్టీలు ఇచ్చే అవకాశం ఉన్నా వారికి ముందే ఫిక్స్ అయిన అభ్యర్థులు ఉంటారు కాబట్టి నో ఛాన్స్! కానీ ఆమె వెళ్లి అడిగి ఉంటే ఏదో ఒక చిన్నా చితకా పార్టీ తప్పకుండా టికెట్ ఇచ్చి ఉండేది. కానీ అప్పుడది రెండు పార్టీల మధ్య యుద్ధంలా ఉండేది తప్పించి ఒక నిరుద్యోగి నిరసనలా కనిపించేది కాదు. మనమూ ఆమెకంత గుర్తింపు ఇచ్చేవాళ్ళం కాదు. ఎప్పుడైతే ఆమె స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ వేసిందో అప్పుడే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆమెను తమ Representativeగా పరిగణించారు. ఆమెకు మద్దతు పలికారు. ఇది నిజంగా శుభ పరిణామం.

నేనిప్పుడు ఉద్యోగిని కాబట్టి ఈ మాట చెప్పే అధికారం నాకు ఉందో, లేదో తెలియదు. కానీ శిరీష గారి స్థానంలో నేనే ఉంటే మాత్రం ఆమె తెలిపినంత గట్టి నిరసన నేనైతే తెలిపేవాణ్ని కాదు. నేనే కాదు, నాకు తెలిసి చాలామంది ఆ సాహసం చేసేవారు కాదు. మనం చెయ్యం! చేసేంత దమ్ము, ధైర్యం మనకు లేదని ఒప్పేసుకుందాం. తమకు ఉద్యోగాలు రావట్లేదని ఎమ్మెల్యేని తమలో తాము తిట్టుకున్న యువకులే, చివరకు సొంతంగా ఒక దుకాణం పెట్టి దాని ఓపెనింగ్‌‌కి ఎమ్మెల్యేని పిలిచి, ఆయన కోసం భారీ ఫ్లెక్సీలు పెట్టి, ఆయనతో ఫొటోలు దిగిన ఉదంతం నాకు తెలుసు!

తమ ఎంపీ భూకబ్జాదారుడని తూర్పాన బట్టిన యువకులే తమ గల్లీలో వినాయక మండపానికి ఆ ఎంపీని పిలిచి ఆయనకు శాలువా కప్పి, చేతిలో లడ్డూ పెట్టిన సంగతి నాకు తెలుసు! యువతలో అవకాశవాదం ఇంతలా వేళ్లూనుకున్న ఈ సమయంలో బర్రెలక్క తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. చెప్పుకోదగ్గది. ఏకకాలంలో అటు ప్రభుత్వంపైనా, ఇటు ఆ ప్రభుత్వంపై ధైర్యంగా నోరెత్తలేని యువతపైనా ఆమె నిరసన తెలపడం బాగుంది.

సరే! ఊరంతా పొగిడినా, ఎవరో ఒకరు తిడతారనే సామెత ఉండనే ఉంది. ఆమె మీద రకరకాల ట్రోల్స్, పుకార్లు, విమర్శలు షికారు చేస్తున్నాయి. ఆమె వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని, డబ్బు కోసం బ్లాక్‌మెయిలింగ్ రాజకీయం చేస్తోందని.. వగైరా.. వగైరా! అవునా? మరి ఏదీ సాక్ష్యం? ఏదీ ఆధారం? ఎన్నికల్లో నిలిచిన మిగిలిన అందరూ సత్యహరిశ్చంద్రుని పిల్లలు, ఆమె మాత్రం నేరస్తురాలా? కోట్లకు కోట్లు మేసిన నాయకులు మీద వందల విమర్శలున్నా, అవి నిజాలని తెలిసినా, వెళ్లి ఓటేసి వస్తారు. ఈమె మీద మాత్రం బురద జల్లుతారా? భలే ఉందే మీ న్యాయం!

ఆమె గెలిస్తే వెళ్లి బీఆర్‌ఎస్‌లోనే చేరుతుందని మరో ప్రచారం. ఆహా! ఇప్పుడు ఎమ్మెల్యేలంతా జీవితాంతం ఒకే పార్టీలో ఉన్నారా? ఉంటున్నారా? ఎన్నికల్లో గెలిచిన మహామహులు తాడాట ఆడినంత సులభంగా పార్టీలు మారిన చరిత్ర మనకు తెలిసిందేగా! బర్రెలక్క గెలుస్తుందో, లేదో తెలియదు. కానీ తనకు పడే ప్రతి ఓటు ప్రభుత్వం మీద జనాల నిరసనకు సాక్ష్యంగా నిలుస్తుంది. తథ్యం!!

నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య తీరడం కోసం 1996లో నల్గొండ లోకసభ నియోజకవర్గం నుండి 682 మందితో నామినేషన్లు దాఖలు చేయించారు దుశర్ల సత్యనారాయణ గారు. బ్యాలెట్ పేపరును సిద్ధం చేయడంకోసం ఎన్నికల సంఘం ఆ ఒక్క స్థానానికి ఎన్నికను నెలరోజులకు వాయిదా వేసింది. ఈ 2023లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 114 మంది నామినేషన్లు దాఖలు చేయగా, చివరకు బరిలో 44 మంది మిగిలారు. కొల్లాపూర్ నుంచి శిరీష గారు స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు.

అది నుంచి తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువే! కాస్తో కూస్తో ఇంకా ఆ చైతన్యం మిగిలే ఉంది అనిపిస్తోంది. PS: శిరీష గారికి ప్రజల మద్దతు పెరుగుతున్నా ఇతర రంగాల్లోని ప్రముఖులెవరూ (మాజీ నటుడు రాజాను మినహాయిస్తే) ఆమెకు మద్దతుగా ఒక్క మాట మాట్లాడకపోవడం విచిత్రం! అదే రాజ్యనీతి….. – విశీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions