.
[[ శంకర్‌రావు శెంకేసి – 79898 76088 ]] …… బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) ఏప్రిల్ 27న 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ ఏట అడుగుపెడుతోంది. అనేకానేక మలుపులు దాటుకుంటూ సాగిన ఈ ప్రయాణానికి కర్త, కర్మ, క్రియ కేసీఆరే. ఇందులో ఎవరికీ ఏ పేచీ లేదు, ఏ పేజీ లేదు.
ఒక రకంగా ఇది తెలంగాణ మలిదశ పోరుకు రజతోత్సవ వత్సరం కూడా. 2001కి ముందు అనేకమంది నేతలు తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. కానీ కాడి మధ్యలోనే వదిలేసి చేతులెత్తేశారు. 2001 తర్వాత కేసీఆర్‌కు సమాంతరంగా కూడా కొందరు నేతలు తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసేందుకు ప్రయత్నించారు.
Ads
నడపలేక, నడవలేక వారూ మధ్యలోనే తప్పుకున్నారు. ఒక్క కేసీఆర్ మాత్రమే తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఉద్యమాన్ని నిలబెట్టగలిగారు. ‘రౌతుకొద్దీ గుర్రం’ సామెత తెలుసు కదా- కేసీఆర్ తనదైన ఒడుపుతో ఉద్యమాశ్వాన్ని మునుముందుకు ఉరికించగలిగారు. అయితే ఈ నిలబెట్టడంలో, ఉరికించడంలో కేసీఆర్ అనుసరించిన పద్ధతులు అనేకసార్లు వివాదాస్పదమయ్యాయి. విమర్శలకు తావిచ్చాయి.
24 ఏళ్ల క్రితం కేసీఆర్‌లోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఆయన భాష,యాస. తెలంగాణ జీవ భాషలో, పల్లె మాండలికంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు ఆనాడు ప్రజలను, నాయకత్వ శ్రేణులను ఆయన వైపు తిప్పుకున్నాయి.
‘అరే.. ఈయన మన లెక్కనే ఉన్నడు.. మనోళ్ల లెక్కనే మాట్లాడుతున్నడు…’ అని అందరూ ముచ్చట పడ్డారు. కేసీఆర్‌ది ఆకర్షణీయ రూపం కాదు. ఒడ్డూపొడవులోనూ అంతంతమాత్రమే. ‘ఈ బక్కోడు ఏం చేస్తాడులే..’ అని తెలంగాణ ఉద్యమంపట్ల నమ్మకం లేని వారు అపహాస్యం చేశారు.
కానీ నిరంతర అధ్యయనం, లోతైన అవగాహన, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో పట్టు సాధించి వాటన్నిటినీ అధిగమించారు. తొలిరోజుల్లో ఆయన తెలంగాణ పల్లెల్లో చేసిన పాదయాత్ర.. తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యక్యతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగింది. అన్ని పార్టీల నుంచి అనేక మంది నాయకులను టీఆర్‌ఎస్‌తో కలిసి నడిచేలా చేసింది.
ఆ ఒరవడిలో ఎవరికీ నమ్మకం లేకుండా నినాదప్రాయంగా వున్న ఓ కలను ఆయన సాకారం దిశగా నడిపించారు. సిద్ధాంతకర్తగా పేరుపొందిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ లాంటి వాళ్లు అనేకసార్లు కేసీఆర్‌లోని విషయ పరిజ్ఞాన జిజ్ఞాసను, నాయకత్వ ప్రతిభను, దక్షతను కొనియాడారు.
ప్రజా ఉద్యమం ఒకవైపు, రాజకీయ ప్రక్రియ మరోవైపు.. ఒకేసారి ఈ రెండింటినీ ఆచరణలో పెట్టి కేసీఆర్ తెలంగాణ సాధనను సుసాధ్యం చేయగలిగారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే.
సుదీర్ఘ ప్రయాణంలో తన వెంట నడుస్తూ వచ్చిన వారి పట్ల అయన మొదటి నుంచీ వ్యవహరించిన తీరు ఎన్నోసార్లు ఆక్షేపణలకు గురైంది. మరీ ముఖ్యంగా అధికారంలోకి రాగానే సహచర ఉద్యమ నేతల పట్ల ఆయన వ్యవహరించిన తీరు కేసీఆర్ ప్రభను మసకబారేలా చేశాయి.
సీఎం కుర్చీలో కూర్చోగానే.. ‘టీఆర్‌ఎస్ ఇక ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయపార్టీ.. ప్రభుత్వ, పార్టీ అవసరాల మేరకు ఏ నిర్ణయాలైనా తీసుకుంటాం..’ అని కేసీఆర్ ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
అప్పటినుంచి అసలైన ఉద్యమ నేతలకు ప్రాధాన్యం తగ్గుతూ, విపక్షాల్లో ఉంటూ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన అనేకమంది నేతలకు బ్రహ్మరథం పట్టడం మొదలైంది. ఆ క్రమంలోనే అవసరం లేకున్నా రారమ్మని ఆహ్వానించి, రెడ్‌కార్పెట్ వేసి మరీ పార్టీలో చేర్చుకొని, పదవులు కట్టబెట్టారు.
వాస్తవానికి టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే, ఉద్యమం కోసం జీవితాలను త్యాగం చేసిన అనేకమందికి రాజకీయ అవకాశాలు రావడంతోపాటు, అధికారంలో భాగస్వామ్యం దక్కుతుందని ఆశించారు. కానీ, సీన్ రివర్స్ అయింది.
అంతుబట్టని సమీకరణాలు, లెక్కలతో ఊహించని వారికి పదవులు దక్కాయి. ఇది టీఆర్‌ఎస్ శ్రేణులనే కాదు, ఉద్యమంలో పాలుపంచుకున్న అనేక వర్గాలను సైతం నిరాశకు, అసంతృప్తికి గురిచేసింది. ‘పంట పండించింది ఒకరైతే, దానిని హస్తగతం చేసుకుంటున్నది మరొకరు..’ అనే ఆక్రోశం వ్యక్తమైనా కేసీఆర్ డోంట్ కేర్ అన్నారు.
కేసీఆర్ అనుసరించిన ఈ వ్యవహార శైలి అసలైన నాయకత్వంలో, శ్రేణుల్లో ఒకరకమైన ఏవగింపును కలిగించింది. తెలంగాణ ద్రోహులుగా పేరుబడిన వారికి మంత్రిపదవులను కట్టబెట్టడాన్ని ప్రజలు సైతం జీర్ణించుకోలేకపోయారు. ఇవన్నీ తెలుసుకోవడంపై కేసీఆర్ ఉద్దేశపూర్వక అనాసక్తి ప్రదర్శించారు.
తెలంగాణలో సెంటిమెంట్ ఫూల్స్ ఎక్కువనే భ్రమలతో ఆయన ఒంటెత్తుపోకడలు పోయారు. 2004 ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి బండారి శారారాణి అనే స్థానికేతర మహిళ టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.
అప్పటివరకు ఆమె ఎవరో పరకాల ప్రజలకే కాదు, కనీసం పార్టీలో కూడా ఎవరికీ తెలియదు. కానీ కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తెలంగాణ గాలిలో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ‘పూచికపుల్లను పెట్టి కూడా ఎమ్మెల్యేగా గెలిపించగలను..’ అనే ధీమా అప్పుడే కేసీఆర్‌లో వ్యక్తమైంది.
అది ఆ తర్వాత మరింత శ్రుతిమించింది. టీఆర్‌ఎస్ పార్టీకి అప్పుడవి తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఉద్యమ సమయంలోనే అలా వ్యవహరించగలిగిన కేసీఆర్.. 2014లో అధికారం చేపట్టిన తర్వాత చెలరేగిపోయారు. టీడీఎల్‌పీనీ విలీనం చేసుకోగా, కాంగ్రెస్ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేశారు.
ఆ ప్రక్రియలో విపక్షాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు, వారి వంధిమాగదులకు ‘విలువ’ పెరిగిపోగా, ఉద్యమంలో పార్టీతో కలిసి నడిచిన వారు కరివేపాకులా మిగిలిపోయారు. 2018, 2023 ఎన్నికల్లోనైతే ఎవరికి ఎందుకు టికెట్ ఇచ్చారో.. ఎందుకు నిరాకరించారో.. ఎవరికీ తెలియని సస్పెన్స్ థ్రిల్లర్‌ను క్రియేట్ చేశారు. దటీజ్ కేసీఆర్.
సెంటిమెంట్ ఆలంబనగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు.. వ్యక్తిగతంగా సెంటిమెంట్ తక్కువ కాబోలు. అందుకే ఉద్యమ తొలిరోజుల్లో తనతో సమాంతరంగా పయనం సాగించిన గాదె ఇన్నయ్య, ఆలె నరేంద్ర, రేగులపాటి పాపారావు, విజయశాంతి, మందాడి సత్యనారాయణరెడ్డి, రఘునందన్‌రావు, రవీంద్రనాయక్, విజయరామారావు వంటి నేతలను అలవోకగా దూరం చేసుకోగలిగారు.
వారిపట్ల అమానవీయంగా వ్యహరించగలిగారు. ఆ తర్వాత కోదండరామ్, జితేందర్‌రెడ్డి, రాములు నాయక్, ఈటల రాజేందర్, రాజయ్యయాదవ్, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డిలాంటి వారు అనేకమంది తప్పుకోక తప్పలేదు.
ఈటల రాజేందర్‌ది అయితే మరో ఘోరం. ఉద్యమంలో, ప్రభుత్వంలో నెంబర్ టూగా పేరుపొందిన ఈటలను దాదాపు మెడపట్టి బయటకు గెంటినంత పనిచేశారు. వరంగల్ లాంటి కీలక జిల్లాలో టీఆర్‌ఎస్ స్థాపన తొలిరోజుల్లో డాక్టర్ వి.ఎస్.రెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి, కోల జనార్ధన్, గైనేని రాజన్, గుడిమళ్ల రవికుమార్ లాంటి నేతలు ఎంతో కీలకంగా పనిచేశారు.
అనేక ఏళ్ల క్రితమే వారు పార్టీకి దూరమయ్యారు. ఇట్లా సమర్థత, దక్షత వున్న అనేకమంది నేతలు తెరమరుగయ్యారు. పూర్వ పది జిల్లాల్లో ఇలాంటి కేస్ స్టడీస్ బొచ్చెడు కనిపిస్తాయి. అందుకే ‘గుండ్లు మునిగినయి.. బెండ్లు తేలినయి..’ అని అసలైన కార్యకర్తలు అనేకమార్లు వాపోయారు.
అది నాటి టీఆర్‌ఎస్‌కు, నేటి బీఆర్‌ఎస్‌కు పెద్ద మచ్చ. చివరకు పార్టీ పేరులోని తెలంగాణ పదాన్ని కూడా కత్తిరించేశారు… ప్రధాని పదవి వైపు ఆశగా చూస్తూ!
అధికారంలో ఉన్నన్నా ళ్లూ కేసీఆర్ ఏనాడూ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోలేదు. నేనే పార్టీ, పార్టీయే నేను.. అన్న రీతిలో వ్యహరించారు. అందుకే గత పదేళ్లలో వ్యక్తుల కేంద్రంగానే పార్టీ తిరిగింది గానీ, పార్టీయే కేంద్రం కాలేకపోయింది.
సభ్యత్వాలు, ఓటు బ్యాంకు ఇంటిగ్రేట్ కాలేకపోయాయి. శ్రేణులు అధినాయకత్వాన్ని కలిసే వాతావరణం, చర్చించే వాతావరణం ఏనాడో పోయింది. అందుకే బీఆర్ ఎస్ (టీఆర్ ఎస్) ప్రజాస్వామికతను కోల్పోయి శ్రేణులకు దూరమైంది. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా రూపం మార్చుకున్న తర్వాత దూరమేదో మరింత పెరిగింది.
పార్టీ శ్రేణులు, నాయకత్వం పట్ల వ్యవహరించిన తీరు ఒకవైపు, తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేసిన తప్పిదాలు మరోవైపు కేసీఆర్‌కు 2023లో అధికారాన్ని దూరం చేశాయి. అప్పటి నుంచి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో ఒకరకమైన అజ్ఞాతవాసంలో ఉంటున్నారు.
పూర్వ వరంగల్, కరీంనగర్ జిల్లాల సహరిహద్దుల్లో ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) రజతోత్సవ సభను ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన దాదాపు 17 నెలలకు కేసీఆర్ రెండోసారి ప్రజల్లోకి వస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు టార్గెట్‌గా ఆయన చేసే ప్రసంగాన్ని నేటి ఏఐ జమానాలో ఊహించడం పెద్ద సమస్యేమీ కాదు. ఆయన విమర్శలను, ఆరోపణలను నమ్మే వ్యాక్యూమ్ తెలంగాణాలో ఇంకా ఏర్పడలేదు. గత తొమ్మిన్నరేళ్లలో జరిగిన విధ్వంసాన్ని మించిన విధ్వంసం ఇప్పుడు తెలంగాణలో ఏమీ కనిపించడం లేదు. అందుకే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ అప్రస్తుత ఘట్టం లాగానే కనిపిస్తోంది గానీ, చారిత్రక సందర్భంగా కనిపించడం లేదు.
తెలంగాణ… నయవంచనను భరిస్తుందేమోగానీ, నిరంకుశత్వాన్ని సహించదు. అది దాని తత్వం.. నైజం. అది తెలుసుకుంటే కేసీఆర్‌కు, ఆయన పార్టీకి మంచిది. కానీ దురదృష్టవశాత్తూ ఆయన ఇంకా తన లోకంలోనే ఉన్నాడు!
Share this Article