కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం తరచూ కొద్దిరోజులపాటు మాయం అవుతాడు… జనంలో ఉండడు… సచివాలయానికి వెళ్లడు… ఎమ్మెల్యేలు, మంత్రులకే దొరకడు… అది జనం వెళ్లని ప్రగతిభవన్… కేసీయార్ మీద వ్యతిరేకతకు ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి… ఈ విమర్శలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ ఓ ముఖ్యమైన హామీని మేనిఫెస్టోలో ప్రవేశపెట్టింది… అది సీఎం గానీ, ఎమ్మెల్యేలు గానీ ప్రజాదర్భార్ నిర్వహించడం… సీఎం రోజూ జనానికి అందుబాటులో ఉండాలి… ఈ ఆచరణ సరిగ్గా ఉంటే అది ప్రజలకు ఉపయుక్తమే… పౌరసేవల హక్కుల కోసం ఓ చట్టం, దాని అమలు కోసం ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు… పర్లేదు, ఇదీ బాగానే ఉంది…
టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పాలనలో సాగిన పలు అవినీతి, అక్రమాలపై రిటైర్డ్ జడ్జితో ఎంక్వయిరీ వేస్తాం… కేసీయార్ కాలేశ్వరం ప్రాజెక్టును తన భారీ అవినీతికి మార్గంగా మార్చుకున్నాడనేది కదా ప్రధాన విమర్శ… సో, అదే టార్గెట్…కాలేశ్వరం మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారట… జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు, కొత్తగా ఏర్పాటు చేయబోయే మరో జిల్లాకు పీవీ నరసింహారావు పేరు పెడతామని మరో పాయింట్… ఇప్పుడు ఉన్నవే ఎక్కువ… మరీ డివిజన్ స్థాయికన్నా చిన్న జిల్లాలు కూడా ఏర్పాటు చేశాడు కేసీయార్… ఇంకా కొత్త జిల్లాలు అనే హామీ బాగోలేదు… అక్కర్లేదు… పాపన్న, పీవీల పేర్ల నిర్ణయం గుడ్…
ఇక మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతుభరోసా, రైతుబీమా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల పెంపు, మహిళలకు ఫ్రీ రవాణా సౌకర్యం వంటి గ్యారంటీల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి అవి వోకే… కేసీయార్ పూర్తిగా నిషేధించిన పదం కౌలు రైతు… కాంగ్రెస్ వారికీ రైతుభరోసాను హామీ ఇస్తోంది… పలు పంటలకు మద్దతు ధరను ఇస్తానంటోంది… సిలిండర్ ధర తగ్గింపు కూడా..! అమరుల కుటుంబాలకు నెలనెలా 25 వేల పెన్షన్, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మూసేసిన చక్కెర కర్మాగారాలను తిరిగి తెరవడం, పసుపు బోర్డు గట్రా ఆచరణలో వేచి చూడాల్సిన అంశాలే…
కేసీయార్ మీద మరో ప్రధాన విమర్శ ధరణి పోర్టల్… అదొక స్కాం అంటోంది కాంగ్రెస్… నిజంగానే అదొక ఫ్లాప్ ప్రోగ్రామ్… పైగా జనాన్ని అవస్థల పాలుచేసింది… దాన్ని రద్దు చేసి, కొత్తగా భూరికార్డుల కోసం భూమాత పేరిట వేరే పోర్టల్ తీసుకొస్తామంటోంది కాంగ్రెస్… ఆచరణలో ఏం చేస్తారో చూడాల్సిందే… అంత ఈజీ మాత్రం కాదు… కేసీయార్ మీద మరో రెండు ప్రధాన విమర్శలు టీఎస్పీఎస్సీ ఫెయిల్యూర్లు, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం… కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తానంటోంది కాంగ్రెస్… నిరుద్యోగభృతి ఆచరణలో ఏమిటో చూడాల్సిందే…
Ads
చదువుకున్న యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీలు మరో ప్రధాన హామీయే… దళితబంధు తరహాలో ఎస్సీ, ఎస్టీలకు 12 లక్షల వరకూ ఆర్థికసాయం హామీ కూడా ఎంతవరకు ఆచరణసాధ్యమో వేచి చూడాల్సిందే… కేసీయారే సంతృప్తస్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేశాడు… కేసీయార్ మీద ఉన్న మరో ప్రధాన విమర్శ డబుల్ బెడ్రూం పథకం ఎత్తేసి, చివరకు సొంత ఇళ్ల స్థలాలుంటే 3 లక్షలు ఇస్తామని పరిమితం చేశాడు… వాళ్లకు 6 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ హామీ…
ఇమామ్లు, పాస్టర్లు తదితర మైనారిటీ మతబోధకులకు నెలనెలా 10 నుంచి 12 వేలు పే చేస్తామంటోంది కాంగ్రెస్… ఆలయాల్లో అర్చకులకు కూడా… బీసీల్లో ఎక్కువగా ఉండే కులాలకు ప్రత్యేకంగా హామీలు పొందుపరిచారు… వ్యవసాయానికి 3 గంటలే ఇస్తారట అని కేసీయార్ విమర్శ చేస్తున్నాడు కదా… 24 గంటల ఉచిత కరెంటు అని మేనిఫెస్టోలో రాసింది కాంగ్రెస్… ప్రభుత్వ ఉద్యోగాలకు పాత పెన్షన్ విధానం అమలు కూడా ఆచరణలో చూడాల్సిందే…
ఆటో డ్రైవర్లకు ఏటా 12 వేలు అనేది జగన్ ప్రభుత్వం నుంచి కాపీ కొట్టిన హామీ… బెల్టు షాపుల రద్దు అనేది చెప్పడం వరకే, ఆ హామీ కూడా ఇచ్చారు… కల్యాణమస్తు కింద లక్ష నగదు, తులం బంగారం అనేది జనాకర్షక పథకం మాత్రమే… 57 సంవత్సరాలు పైబడిన ప్రతి వృద్దుడికీ 4 వేల పెన్షన్ అనేది కూడా ఆచరణను వేచి చూడాల్సిందే…
కేసీయార్ మీద మరో ప్రధాన విమర్శ… జర్నలిస్టుల కడుపు కొట్టాడు, హైదరాబాద్ ఇళ్లస్థలాలకు అడ్డుపడుతున్నాడు అనేది… కాంగ్రెస్ ఆ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది… గుడ్… రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్లు అనేది కూడా కొత్త హామీయే… కేసీయార్ కలలో కూడా ఆలోచించని వరమే…
నియామకాలు, హైదరాబాద్ అభివృద్ధి మీద కూడా బోలెడు హామీలు ఇచ్చింది కాంగ్రెస్… హైదరాబాద్, నగరాల్లో ప్రతి ఇంటికి 25 వేల లీటర్ల ఫ్రీ నీటి సప్లయ్ ఇంట్రస్టింగ్… ఇప్పుడున్న బడ్జెట్‌ను అకస్మాత్తుగా మూడు రెట్లు చేస్తే తప్ప ఇన్ని వరాలు, హామీలు తీర్చలేరనే విమర్శ ఉంది… సరే, ఆ ఆచరణను చూడాల్సిందే గానీ… కేసీయార్ మీద ఉన్న ప్రధాన విమర్శలన్నీ పరిగణనలోకి తీసుకుని, వాటికి రెమిడీ హామీలను పొందుపరిచిన తీరు ఆసక్తికరంగా అనిపించింది…
Share this Article