డబ్బు, డబ్బు, డబ్బు… కొందరు వ్యాపారులు కూడా డబ్బు సంపాదిస్తారు… కానీ అదేలోకంలో బతకరు… వర్తమాన ప్రాపంచిక విషయాలకు స్పందిస్తుంటారు… తమ భిన్నత్వాన్ని చాటుకుంటూ ఉంటారు… అలాంటి వాళ్లలో ఆనంద్ మహీంద్ర కూడా ఉంటాడు… సోషల్ మీడియాలో కనిపించే ఆసక్తికరమైన అంశాలకు రియాక్ట్ అవుతాడు… సరైన రీతిలో, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాడు… ఈ విషయంలోనూ అంతే… తమిళనాడు, కోయంబత్తూరు, వడివేలంపలయంలో ఓ ఎనభై అయిదేళ్ల ముసలామె కథను 2019 సెప్టెంబరులో చూశాడు తను… అప్పట్లో ఆ ముసలామె ఇడ్లీలు చేస్తున్న వీడియో ఒకటి విపరీతంగా వైరలైంది గుర్తుంది కదా… కేవలం ఒక్క రూపాయికి ఒక ఇడ్లి చొప్పున అమ్ముతుంది ఆమె… అసలు ఆ రేటు కాదు ఇక్కడ చెప్పుకోదగింది… 1) ఆ వయస్సులోనూ ఆమె రోజుకు వెయ్యి దాకా ఇడ్లీలు పోస్తూనే ఉంది… 2) చిన్న గుడిసెలో హోటల్… ఆమె ఒక్కతే సప్లయర్, క్లీనర్, చెఫ్, ఓనర్ ఎట్సెట్రా… 3) ఎన్నేళ్లవుతున్నా, ఇడ్లీ తయారీకి కావల్సిన సంభారాల ధరలు కూడా మండిపోతున్నా ఆమె ఆ రూపాయి మాత్రమే తీసుకుంటోంది… 4) నా దగ్గరకు వచ్చేవాళ్లంతా రోజువారీగా పొట్టపోసుకునే కార్మికులు, పోనీలే, వాళ్ల ఆకలి కడుపులు నిండితే చాలు అన్నదామె… 5) అసలు అయిదు రూపాయిలు తీసుకుని అయిదు ఇడ్లీలు ఇవ్వడం అనేది ఈరోజుల్లో ఓ అద్భుతమే కదా… 6) కృష్ణారామా అనుకుంటూ గడిపేయడం లేదామె… ఈ వయస్సులోనూ సొసైటీ కన్సర్న్‌గా రెక్కలు ముక్కలు చేసుకుంటోంది… ఆమె పోసే మెత్తని, తెల్లటి ఇడ్లీల్లాంటి ఆ స్పిరిట్ ప్రశంసనీయం…
ఆమెను అక్కడి వాళ్లు ఇడ్లీ అమ్మ అనే పిలుస్తారు… అసలు పేరు కమలథాల్… అప్పట్లో ఎవరో ఆమె గురించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు… నానా చెత్తా వ్యవహారంగా మారిన సోషల్ మీడియాకు మరో పార్శ్వం ఇదుగో ఇలాంటి సంగతులే… క్షుద్రత్వం తప్ప ప్రస్తుతం ఏమీ మిగలని మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అసలైన ప్రత్యామ్నాయం సోషల్ మీడియా కాకపోవచ్చు… కానీ అనేక విషయాల్ని వెలుగులోకి తీసుకొస్తున్నది ప్రస్తుతం సోషల్ మీడియాయే… ఈ వీడియోను ఆనంద్ మహీంద్ర కూడా చూశాడు… బహుశా అందరిలాగే కాసేపు షాక్‌లో ఉండిపోయాడేమో… ‘‘ఆమె వ్యాపారంలో పార్టనర్ అవుతాను, ఇన్వెస్ట్ చేస్తాను’’ అని ట్వీటాడు… అంటే, ఆమెకు సాయపడి, తనూ కొంత పుణ్యం సంపాదించాలని… కానీ ఇన్నిరోజులైంది, మరిచిపోయి ఉంటాడులే, తనూ ఓ వ్యాపారే కదా అనుకున్నవాళ్లు బోలెడు మంది…
Ads
https://twitter.com/anandmahindra/status/1171419664901181441
ఈలోపు అక్కడి స్థానిక గ్యాస్ డీలర్ ఎవరో ఆమెకు ఒక గ్యాస్ స్టవ్వు, సిలిండర్ ఇచ్చాడు… ఈ వయస్సులో పొగ నడుమ ఆమె కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు పోయడం తప్పించడానికి, ఆమె స్పిరిట్‌కు జేజేలు పలకడానికి..! ఈలోపు కరోనా వచ్చింది, ఎవరో వస్తారని, తనకు ఏదో చేస్తారని అనుకునే తత్వం కాదు అమ్మది… వేలాది మంది వలస కార్మికుల కష్టాలు, ఆకలి ఆమెను మరింత కష్టపడేలా చేశాయి… అదే రూపాయి ఇడ్లీని అలాగే కొనసాగించింది… నిజానికి ఇప్పుడే కదా సొసైటీకి తనను అర్పించుకునే సమయం అనుకుంది… మరి ఈ ఆనంద మహేంద్రుడు ఏం చేశాడు..? ఆమెను మరిచిపోలేదు… ఇన్ఫ్రా వ్యవహారాలు చూసే ఒక విభాగం ఉంది తన కంపెనీకి… వెళ్లారు, కొన్ని స్థలాలు వెతికారు, అక్కడే ఉన్న ఆ స్థలాన్నే కొన్నారు… ఆమె పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది తాజాగా… ఇప్పుడక్కడ ఆమె అవసరాల మేరకు హోటల్ కమ్ రెసిడెన్స్ కట్టేయడానికి రెడీ అయిపోయారు… దాన్నే మళ్లీ ట్వీట్ చేసి, నేను మరిచిపోలేదండోయ్ అని నెటిజన్లకు గుర్తుచేశాడు… గుడ్, గుడ్… నీలాంటోళ్లు ఉండాలి భయ్యా… పుణ్యం, పురుషార్థం, బతుక్కి కొంత సార్థకత…! అంతా అయ్యాక ఓసారి చెప్పాలి సుమా… అయినా చెబుతావులే…!! @anandmahindra
చివరగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే…. తమిళనాడులో ఎన్నికలొస్తే ప్రతి పార్టీ అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇదుగో ఇలా ఉద్దరిస్తాం, మేమే వండి నోట్లో పెడతాం, జస్ట్, తిని పెట్టండి చాలు అన్నట్టుగా హామీలు ఇస్తుంటయ్… ఏటా వేలకువేల కోట్లు ఫ్రీ పథకాలకే ఖర్చు చూపిస్తున్నయ్… దిక్కుమాలిన బోలెడు ఖర్చు… ప్రతి పార్టీకి కార్యకర్తలు, నాయకులు, వాళ్ల సంపాదనలు… ఉన్నతాధికారులు, పాలన బాధ్యులు, వాళ్ల ఖర్చులు, వాళ్ల అవినీతి…. ఆమె చుట్టూ అంత కాలుష్యం… ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఆ ఒక్కడు తప్ప… ఆమె కథ విని సాయం చేసిన ఒక్క చేయి లేదు… సపోర్టుగా నిలబడిన ఒక మనిషి లేడు… ఎవరూ తోడు లేకపోయినా సరే, ఈ వయస్సులోనూ తనకంటూ ఓ స్పూర్తితో బతుకుతున్న ఆమెకు స్థానిక సమాజం కూడా ఏమివ్వగలిగింది..? మన రాజకీయ, పాలన వ్యవస్థల్లోని అసలైన డొల్లతనానికి కూడా అమ్మ కథ గొప్ప ఉదాహరణ…!!!
Share this Article