.
జర్నలిజం చాలా గొప్ప వృత్తి.. కానీ Thankless Job కూడా.. ఎందుకంటే, జనాల మనసుల్లో ఉన్న వికృతమైన ప్రశ్నలన్నిటినీ తమ భుజాలకెత్తుకుని వాటికి జవాబులు బైటికి తీసుకొచ్చే ప్రయత్నంలో తమ ఇండివిడ్యువల్ ఇంటెగ్రిటీని, మానవతా వలువలను కూడా ఒక్కోసారి విడిచేయాల్సి రావడం.. చాలా దారుణమైన పరిస్థితి.. That’s why I respect them a lot..
మొన్న ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా అనన్య నాగళ్లను ఒక మహిళా విలేఖరి తెలుగు ఫిలిమిండస్ట్రీలో కమిట్‌మెంట్ గురించి అడిగిన ప్రశ్న, అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళలో జ్వలిస్తున్న ఒక వెలుగు, పెదాల మీద వంకర నవ్వు, స్టేజి మీద ఉన్న అయిదుగురు మగాళ్ల మధ్య, తన తోటి విలేఖరుల మధ్య, చూస్తున్న జనం మధ్య ఆయమ్మాయిని నిల్చోబెట్టి అడిగిన తీరు..
అది ఆమె పర్సనల్ అజెండా కాదు.. అక్కడున్న ప్రతివాడు, తరవాత వైరల్ అయిన ఆ వీడియో చూస్తున్న ప్రతివాడు, అసలు సినిమా ఇండస్ట్రీ అనగానే నడుం బిగించి బల్ల గుద్ది ఇది నిజం అని చెప్పడానికి తయారయే ప్రతివాడు అనన్యను నిలదీసి అడుగుదామనుకున్న ప్రశ్న అది..
అడిగిన ఆ విలేఖరి మీద ఇప్పుడు నిప్పులు కురిపిస్తున్న ప్రతివాడు మనసులో ఫాంటసైజ్ చేసుకుంటూ బుర్రను సొల్లుతో తడిపేసుకుంటూ తాను నిర్ధారించుకున్న నిజాన్ని అనన్యను, కుదిరితే ప్రతి సినిమా మహిళను నిలదీసి అడుగుదామనుకున్న ప్రశ్నే..
Ads
ఆ ప్రశ్న ఆమె అడిగింది.. హ్యాట్సాఫ్ టు హర్.. ఆ విషయం వరకు ఆవిడమీద నాకే కోపమూ లేదు.. కాకపోతే ఆమె ప్రశ్నలాగా వేయలేదు.. అది నిజమని నిర్ధారణ అయిపోయింది కాబట్టి “ఇప్పుడీ సినిమాలో నువ్వు హీరోయినుగా చేసినందుకు నీ కమిట్‌మెంట్ ఎవరితోనో ఆ పేర్లు చెప్పేస్తే మేము ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతాం..” అని వెయిట్ చేస్తున్నట్టుంది..
లేకపోతే కమిట్‌మెంటు గురించి అగ్రిమెంటులోనే ఉంటుందన్న మాట ఎలా అనగలదు.. కమిట్‌మెంట్ ఉంటే ఒక రేటు, ఇవ్వకపోతే ఒక రేటు.. ఇది కదూ ఆవిడ అన్న మాట.. అక్కడ బాధనిపించింది.. ఆమె ప్రశ్నలోనే మొదట అన్నది.. అసలే తెలుగమ్మాయిలు ఫిలిమిండస్ట్రీకి రావడానికి భయపడతారు అని.. ఆవిడ అడిగిన ఆ ప్రశ్నను విన్న ఒక సాధారణ తెలుగమ్మాయి ఏ ధైర్యం చేయగలదు ఇప్పుడు.. ఆవిడ అడిగిన ప్రశ్నను నమ్ముతుందా, దానికి అనన్య ఎంతో ధైర్యంగా, బ్యాలెన్సుడుగా ఇచ్చిన జవాబును నమ్ముతుందా..
మొన్న కొండా సురేఖ సమంతా, నాగార్జున ఫ్యామిలీ గురించి ఇచ్చిన స్టేట్‌మెంటు వల్ల కానీ నిన్న ఈవిడ అనన్యను అడిగిన ప్రశ్న వల్ల కానీ ఒకటి స్పష్టంగా అర్ధమవుతోంది.. మీ దృష్టిలో సినిమావాళ్ళంటే పింప్స్.. తార్పుడుగాళ్ళు.. దిగజారుడుగాళ్ళు.. ఒకమ్మాయిని మిగతా ప్రపంచంలా గౌరవప్రదంగా కాక ఒక నీచమైన పదార్ధంలా చూస్తారు.. అలాంటి పరిశ్రమలోకి ఆయమ్మాయి వొచ్చిందంటే ఆల్రెడీ క్యారక్టరు పోయినట్టే.. కరక్టే కదూ.. You are Wrong.. నా పర్సనల్ ఎక్స్పీరియెన్స్ చెబ్తాను..
నేను ఆరు సినిమాలు డైరెక్ట్ చేశాను.. మొదటి సినిమా సంగతి నాకు గుర్తులేదు.. గత అయిదు సినిమాలూ నేనే ప్రొడక్షన్ కూడా చూశాను.. ఈ అయిదు సినిమాల్లో సుప్రియ, ఉల్కా, మృదాంజలి, జారాషా, ఊర్వశి, గౌతమి, అనన్య.. ఏడుగురు హీరోయిన్లు.. ఇంకా పదిపదిహేనుమంది సెకండరీ క్యారక్టర్లు చేసిన అమ్మాయిలు..
అందులో ఏడెనిమిదిమంది బాంబే నుంచి ఇక్కడికొచ్చి రెండు మూడు నెలలు మాతో ఉండి, ఔట్ డోర్ షూటింగులకి మాతో ప్రయాణించి పని చేసుకుని వెళ్ళిపోయారు.. ఇప్పటికీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, కలుస్తూంటాం, కాఫీ తాగుతూ ఉంటాం.. జస్ట్ ఫర్ ది రికార్డ్, అందరితోనూ అగ్రిమెంట్లు రాసుకున్నాము.. ఎవరితోనూ కమిట్‌మెంటు గురించిన క్లాజు పెట్టలేదు.. మా అందరిదీ ఒకటే కమిట్‌మెంటు.. వర్క్.. ఒప్పుకున్న పనిని సవ్యంగా, అనుకున్న సమయంలో చేసి వెళ్ళిపోవడం.. అంతే..
నేను ప్రసాద్, RFC లాంటి దిగ్గజ సంస్థలకు పనిచేశాను, ఫర్మ్ 9, అద్వితీయ లాంటి చిన్న సంస్థలకు పనిచేశాను.. నేను కానీ నా యూనిట్ కానీ ప్రతి ఒక్క అమ్మాయినీ ఎంతో గౌరవంగా, స్నేహంగానే చూసుకున్నాము.. వాళ్ళ కంఫర్టుకి ఏ లోటూ రాకుండా.. నాకు తెలిసిన పది పన్నెండుమంది దర్శక నిర్మాతలదీ ఇదే పరిస్థితి..
వికారాలు కలగవా.. కోరిక పుట్టకుండా ఉంటుందా.. మేమేమన్నా ఋషులమా.. అడగాలని అనిపించదా.. అనిపిస్తుంది.. కానీ మా కోరికలను కంట్రోల్లో పెట్టుకుంటాము.. ప్రొఫెషనల్స్ గా ప్రాజెక్ట్ అయిపోయేంతవరకు ఎలాంటి తప్పటడుగులూ వేయకుండా నిగ్రహించుకుంటాము.. ఆ తరవాత ఎవరి దారి వారిది.. ఆ దారిలో రిలేషన్షిప్స్ తయారవుతే అవచ్చు.. అది వేరే సంగతి.. సరిగ్గా బైటి ప్రపంచంలో ఎలా జరుగుతుందో అలాగే..
క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా దారుణమైన సమస్య.. పూర్తిగా లేదని నేననను.. కానీ ఎక్కడుందో ఎవరికీ తెలీదు.. వందలో అయిదుగురుంటారిలా.. లేదా పదిమంది.. ఇలా కాదు దాన్ని డీల్ చేయాల్సింది.. దొరికిన ప్రతి అమ్మాయినీ బహిరంగంగా అడగడం కాదు.. పరిశ్రమ లోపలి నుంచి ఒక ఆర్తనాదం వినిపిస్తే దానికి మీరూ గొంతు కలపండి.. మేమూ చేతులు కలుపుతాం. ఫైట్ చేద్దాం.. అంతే కానీ ప్రతి అమ్మాయికీ ప్రతి మగాడినుంచీ ఇలాగే జరుగుతుందన్న అజంప్షన్స్ మానేయండి..
ఒకమ్మాయి ఎన్నో గీతలను దాటుకుని బిక్కుబిక్కుమంటూ వొస్తుందిక్కడికి.. కుదిరితే ఆమెకు ధైర్యాన్నివ్వండి.. లేకపోతే కనీసం నిశ్శబ్దాన్నివ్వండి.. ఆమె స్పేస్ ఆమెకివ్వండి.. భయపెట్టకండి..
ఒకటి చెబ్తా వినండి.. ప్రపంచం దృష్టిలో అతి జుగుప్సాకరమైన పరిశ్రమలో ఉన్న మేము వైరలయిన ఆ వీడియో కింద సొల్లు కార్చుకుంటూ కామెంట్లు పెట్టే ప్రబుద్ధులకన్నా ఖచ్చితంగా అమ్మాయిల పట్ల గౌరవప్రదంగానే ఆలోచిస్తాం… (ఇది డైరెక్టర్, రైటర్ కమ్ యాక్టర్ రాజ్ మాదిరాజు రాసిన పోస్టు)
Share this Article