.
Subramanyam Dogiparthi …… అత్తాఅల్లుళ్ళ సవాళ్ళ మీద , మామాఅల్లుళ్ళ సవాళ్ళ మీద మనకు చాలా సినిమాలు ఉన్నాయి . మా తరం వారికి మొదట గుర్తొచ్చేది 1971 లో వచ్చిన బొమ్మా బొరుసా సినిమాయే . యస్ వరలక్ష్మి , చలం , చంద్రమోహన్ , వెన్నిరాడై నిర్మల , రామకృష్ణలు నటించారు . వరలక్ష్మి అరుపులతో థియేటర్లు వణికిపోయేవి .
ఆ సినిమా వచ్చిన చాలా కాలం తర్వాత 1986 జూలైలో వచ్చిన ఈ ముళ్ళపూడి అనసూయమ్మ గారి అల్లుడు బాలకృష్ణ , కోదండరామిరెడ్డిల కాంబినేషన్లో కనక వర్షం కురిసింది . 28 సెంటర్లలో షిఫ్టింగులతో వంద రోజులు ఆడింది .
Ads
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇది . తర్వాత 13 సినిమాలు వచ్చాయి . వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్ గానే నిలిచింది . అలాగే బాలకృష్ణ , భానుప్రియ కాంబినేషన్ కూడా .
ఈ సినిమాలో కొమ్మినేని వారి కోడలయినా అనసూయమ్మ గారు పదేపదే పుట్టిల్లు పేరయిన ముళ్ళపూడి వారి పేరే చెప్పుకుంటూ ఉంటుంది . విషాద పాత్రలకు , ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ పుణ్యాన ఏక్షన్ పాత్రలకు చిరునామా అయిన ఊర్వశి శారద ఆడంబరాలకు , పటాటోపాలకు , డాంబికాలకు ప్రతీక అయిన పాత్ర నటించటం ఇదే మొదటిదేమో !
అప్పట్లో ఇలాంటి పాత్రలకు యస్ వరలక్ష్మి కేరాఫ్ అడ్రస్ . కొత్త నీరు వస్తుంటుంది కదా ! బాలకృష్ణ చేతిలో అత్తా అనసూయమ్మా అంటూ గట్టిగానే టీజ్ చేయబడుతుంది . ఈ సినిమాలో జగ్గయ్యే పాపం . ఇలాంటి కామెడీ పాత్రల్ని ఎప్పుడో 60s , early 70s లో వేసి ఉంటారు . కంచు కంఠం కాస్త భార్యాభయంలో నీరస కంఠం అయిపోయింది ఈ సినిమాలో .
ఇతర ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు , నూతన్ ప్రసాద్ , రాంజీ , రమాప్రభ , అన్నపూర్ణ , హేమసుందర్ , జయవిజయ , ప్రభృతులు నటించారు . రావు గోపాలరావుది చాలా స్ట్రాంగ్ పాత్ర . బాగా మలిచారు పరుచూరి బ్రదర్స్ . ఈ సినిమాలో అనసూయమ్మ గారి ఇంటి ఎదురుగా రోడ్ పక్కన కూర్చుని ఒక సాధువు జీవిత సత్యాలను పాడుకుంటూ ఉంటాడు . గొప్ప పాత్ర . నటుడు పేరు నాకు ఐడియా లేదు .
పాటలనన్నీ వేటూరి వారే వ్రాసారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు హుషారుగా ఉంటాయి . బాలకృష్ణ వీరాభిమానులకు బాగా నచ్చుతాయి . తళుకు తాంబూలమిస్తా , తొలిరేయి జాంపండు , ఇంకా ఎప్పుడు , భామా భామా డ్యూయెట్లు కోదండరామిరెడ్డి మార్కులోనే ఉంటాయి . సినిమాకు హైలైట్ , ఐకానిక్ సాంగ్ అత్తా అనసూయమ్మానే .
సలీం నృత్య దర్శకత్వంలో భానుప్రియ నృత్యాలు అందంగానే ఉంటాయి . క్లైమాక్స్ ఫైటింగ్ సీన్లు ఈగల్ ఫ్లాస్క్ కంపెనీలో షూట్ చేయబడ్డాయి . అయితే ఆ కంపెనీ బిన్నీ కంపెనీ లాగా పాడుబడ్డ కంపెనీ కాదు . అయినా షూటింగుకి అనుమతి ఇవ్వటం గొప్పే .
రామకృష్ణ సినీ స్టూడియోస్ బేనరుపై హరికృష్ణ నిర్మాతగా తీయబడిన ఈ సినిమాకు కధ , డైలాగులు పరుచూరి బ్రదర్సువే . అత్తాఅల్లుళ్ల అల్లరి సినిమా కాబట్టి అక్కడక్కడా కాస్త డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి.
తెలుగులో కమర్షియల్గా సక్సెస్ అయిన ఈ సినిమాను తమిళంలో వైరాగ్యం టైటిలుతో రీమేక్ చేసారు . ప్రభు , రాధ , షావుకారు జానకిలు నటించారు . పాపం జానకి ! మన తెలుగు సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడని బాలకృష్ణ అభిమానులు చూడవచ్చు . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్
Share this Article