అప్పట్లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడు వంశీ తీసిన ఓ సినిమా… అప్పటికి మంచి సినిమాలు తీస్తున్న రామోజీరావు క్యాంపు నుంచి వచ్చిన ‘ప్రేమించు-పెళ్లాడు’ సినిమా… ది గ్రేట్ మాస్ట్రో ఇళయరాజా స్వరకల్పన… జగమెరిగిన పాటగాడు, రాతగాడు వేటూరి రాసిన పాట… లెజెండరీ గాయకులు బాలు, జానకి పాడిన పాట… గోపెమ్మ చేతిలో గోరుముద్ద… రాధమ్మ చేతిలో వెన్నముద్ద…. ఈ పాటలో మల్లెబువ్వలు, వంటి పదాల్ని పొదిగాడు రచయిత… అదే రామోజీరావుకు చెందిన ఈటీవీలో ‘డైరెక్టర్స్ స్పెషల్’ స్వరాభిషేకం అంటూ నిన్న ప్రసారమైన స్వరాభిషేకం అనే ప్రోగ్రాంలో…. అదే ఎస్పీ బాలు కొడుకు చరణ్ ఏమని పాడాడో తెలుసా..? గోపెమ్మ చేతిలో వెన్నె ముద్ద… పక్కన ఉన్న గాయని హరిప్రియ కూడా సేమ్… వెన్నముద్దకూ, వెన్నెముద్దకూ తేడా తెలియకుండా… ఒకేపాటలో మూడునాలుగుసార్లు అలాగే..! ఫాఫం, ఎస్పీ బాలు అనుకుని, ఓసారి పైకి చూసి జాలిపడటం తప్ప ఇంకేమీ చేయలేం…
అసలు ఇదొక్కటే కాదు… మొత్తం స్వరాభిషేకం ప్రోగ్రాం ఇప్పుడు ఒక అపస్వరాభిషేకం..! నిజానికి ఈ సింపుల్, స్ట్రెయిట్ కామెంట్ చేయాలంటే కాస్త సాహసం అవసరం… ఎందుకంటే..? కొన్నేళ్లుగా తెలుగునాట సినీ సంగీతాభిమానులందరినీ అలరించిన ప్రోగ్రాం ఇది… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికే కాదు, ఈటీవీ రామోజీరావుకు కూడా పేరు తెచ్చిన ప్రోగ్రాం… కానీ ఆ పాటల్ని విని మురిసిన ఎందరో ఇప్పుడు ఆ ప్రోగ్రాం చూస్తూ పెదవి విరుస్తున్నారు… మొహాలు చిట్లిస్తున్నారు… ఎందుకిలా ఈ ప్రోగ్రాం భ్రష్టుపట్టింది అని జాలిపడుతున్నారు… నిజం… పైన ఓ ఉదాహరణ చెప్పుకున్నాం కదా… ఒకవైపు హిందీలో సోనీ వాడి ఇండియన్ ఐడల్ టాప్ ప్రోగ్రాం త్రీ రేటింగుల్లోకి వచ్చి దేశవ్యాప్తంగా సంగీతాభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది… మన స్వరాభిషేకం ఏ స్థాయికి దిగజారిపోయిందో తెలుసా..? రెండు, రెండున్నర రేటింగుల దగ్గర కొట్టుకుంటోంది… మరీ దయనీయం…
Ads
అన్నింటికన్నా ముఖ్యంగా యాంకర్ సుమ ఈ ప్రోగ్రాం నుంచి వైదొలగింది… ఎస్పీ బాలు కుటుంబసభ్యురాలిగా భావించబడే సుమకు కూడా ఈ ప్రోగ్రాం మీద అంత విరక్తి కలిగిందంటే ఇప్పుడు ఆ ప్రోగ్రాం ఏ దిశలో పయనిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు… ఆర్కెస్ట్రా మారింది… ఎస్పీ చరణ్ చేతుల్లోకి వచ్చింది ప్రోగ్రాం… బాలు మీద ఉన్న సదభిమానంతోనే చరణ్‌కు ఈ ప్రోగ్రాం కొనసాగించాల్సిందిగా ఆఫర్ ఇచ్చి ఉంటాడు రామోజీరావు… కానీ ఎక్కడి బాలు..? ఎక్కడి చరణ్..? బాలు చెప్పుల్ని తొడుక్కుని అడుగులు వేయడం చరణ్‌కు కష్టం… ఆ సోయి లోపించినట్టుంది… ఎక్కువ పాటలు తనే పాడుతున్నాడు… పాపులర్ గాయకులే సుమంగళి, ధనుంజయ్, కౌసల్య, కారుణ్య, శ్రీరాం, కల్పన, కానీ ఒకప్పటి శ్రావ్యత, మాధుర్యం ఏమైంది..? వస్తున్నారు, పాడుతున్నారు, పోతున్నారు… శృతులు, తాళాలు, ఆలాపన లోపాలు ఓ మామూలు శ్రోతకు, టీవీ ప్రేక్షకుడికి అర్థం కాకపోవచ్చు… కానీ వెన్నముద్ద, వెన్నెముద్ద వంటి ఉచ్చరణలోపాలు కూడా పట్టించుకునేవాళ్లు లేరు… అక్కడికి కొందరి పాటల్ని రీషూట్ చేస్తున్నట్టున్నారు… కానీ మొత్తం ప్రోగ్రామే దారితప్పింది… అయ్యా, రామోజీరావు గారూ… చెవుల్లో కాలకూటంలా జారుతున్న ఈ వెన్నెముద్దల తాకిడి నుంచి మమ్మల్ని మీరే రక్షించాలి…!!
Share this Article