Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ABN… ఓటమిలోనూ ఓ సాంత్వన… ఓ ఓదార్పు… భావిపై ఓ భరోసా…

May 21, 2023 by M S R

Murali Buddha………  ఆ మీడియాను నమ్మండి -బిపిని దూరం పెట్టండి…… ఆరోగ్యం కోసం ఆ మీడియానే చూడండి .. చదవండి……. ఓ జ్ఞాపకం

హా … హా … ఇప్పుడేమంటావ్ ?

2018 డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయమే టివిలో చూస్తుంటే ఫోన్ లో హా … హా … ఇప్పుడేమంటావ్ ? అనే ప్రశ్న ఆమె స్వరంలో అంత సంతోషం చాలా కాలం తరువాత విన్నాను .

Ads

ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై ఆమె అంతకు ముందే నాతో పందెం వేసింది . ఏబీఎన్ ఛానల్ లో మహాకూటమి దూసుకెళ్తుంది . మహాకూటమికి 30 కి పైగా స్థానాలు ఇచ్చి తెరాసకు అందులో పావు సగం స్థానాలు కూడా ఇవ్వలేదు ..

ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిల హయాంలో తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన మహిళా నాయకురాలు అట్లూరి రమాదేవి . కృష్ణా జిల్లా మూలాలు ఉన్న నిజామాబాద్ నాయకురాలు . ఎన్టీఆర్ హయంలో రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు , నామినేటెడ్ పదవులు చేపట్టిన ప్రముఖ నాయకురాలు. ఆమె ఫోన్ చేసి ఇప్పుడేమంటావు …నీ మీద విజయం సాధించాను చూడు అన్నట్టు మన పందెం ఇంకాస్త పెంచుదామా ? ధైర్యం ఉందా ? అని ఆమె ప్రశ్నించింది . ఎంతో కాలం తరువాత ఆమెలో ఉత్సాహం , ఆ స్వరంలో ఆనందం చూసి .. వాటిని ఎందుకు దూరం చేయాలి అనుకొని … మీ ఇంట్లో మీరు ఏబీఎన్ ఛానల్ చూస్తున్నారు కదా ? అని అడిగాను .

ఔను అని సమాధానం వచ్చింది . మనం డబ్బు కోసం పందెం కాయలేదు కదా ? మన అంచనా ఎవరిది కరెక్ట్ అవుతుంది అని తెలుసుకోవడానికి అంతే …

అంతకు ముందు 2004 నుంచి ప్రతి ఎన్నిక , 2014 లో తెలంగాణ ఏర్పాటు , తరువాత ఎన్నికలు అన్ని పందాల్లో ఆమె అంచనాలు తప్పడం ఇప్పుడు టివిలో మహాకూటమి దూసుకెళ్తుండడంతో ఆమె చాలా సంతోషంగా ఉంది . మళ్ళీ పందెం పెంచడం ఎందుకు కానీ , ఓట్ల లెక్కింపు ఇప్పుడే మొదలైంది కదా ? కొంత సమయం తరువాత మాట్లాడుకుందాం అని ఆమె సంతోషానికి భంగం కలుగనివ్వలేదు .

*****

2018 ఎన్నికల్లో మహాకూటమి ఏ దశలోనూ తెరాసకు దరిదాపుల్లోకి రాలేదు . 30 సీట్లకు ఓట్ల లెక్కింపు ప్రారంభంలో రాలేదు . ఓట్ల లెక్కింపు ముగింపులోనూ రాలేదు . ఐతే మహా కూటమి ఏర్పాటు సన్నాహాల నుంచి కూడా ఆంధ్ర జ్యోతి , abn అండగా నిలిచాయి . నిజమైన స్నేహితుడు ఓటమిలో కూడా భుజం తట్టి అండగా నిలుస్తాడు అని నిరూపిస్తూ … ఓట్ల లెక్కింపు ప్రారంభం ఐన తరువాత కూడా ఈ మీడియా తన మద్దతు కొనసాగించింది .. ఉదారంగా ప్రారంభంలోనే 30 స్థానాలు ఇచ్చి , అందులో పావు సగం కూడా తెరాసకు ఇవ్వకుండా తమ ఛానల్ లో తెరాసను చిత్తుగా ఓడించారు .

ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో మీడియా ఉంది కానీ , ఎలక్షన్ కమిషన్ లేదు . ఐనా ఈ మీడియా మహాకూటమిని విజయ పథంలో తీసుకెళ్తే ఎన్నికల కమిషన్ మాత్రం అస్సలు పట్టించుకోకుండా తెరాస దూసుకెళ్తున్నట్టు లెక్కలు చెప్పింది . తాను ఒంటి చేత్తో మహాకూటమికి విజయం చేకూరుస్తున్నా … మిగిలిన ఛానల్స్ అన్నీ ఎన్నికల కమిషన్ ఫలితాలే చెబుతుండడంతో దమ్మున్న ఛానల్ కూడా ఎన్నికల కమిషన్ చెప్పిన ఫలితాలనే చివరికి చూపక తప్పలేదు …మహాకూటమి తరుపున చంద్రబాబు విస్తృత ప్రచారంతో హడలెత్తించారు . ప్రముఖ పత్రికలను , ఛానల్స్ ను చూస్తే ఎంతటి వారికైనా మహా కూటమి విజయం ఖాయం అనిపించి తీరుతుంది . అలానే అనుకున్నారు .

****

కొన్ని గంటల తరువాత నీరసమైన స్వరంతో అట్లూరి రమాదేవి ఫోన్ చేసి …. ఏంటి ఇలా జరుగుతోంది అని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు . 2004 , 2009 , 2014 ఎన్నికల ఫలితాలు , 2014 లో తెలంగాణ వస్తుంది అని , 2014 , 2018 ఎన్నికలు… ఏంటీ, అన్నీ నీ అంచనాలే కరెక్ట్ అయ్యాయి …. ఈ అన్ని విషయాల్లో ఇద్దరం పందెం వేసుకున్నాం . పందెం వేసుకోవడమే తప్ప గెలిచినా తీసుకున్నది లేదు . తెలంగాణ వస్తుంది అనే పందెంపై మాత్రం వదిలేది లేదు ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాను . ఎన్నికల జోస్యం వేరు తెలంగాణ ఆవిర్భావ పందెం వేరు అన్నాను .

*****

సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు ? అని ప్రశ్నిస్తే … నేను మా ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో మీరు ఏ ఛానల్ చూస్తున్నారో చెప్పగలిగాను అంటే అంతో ఇంతో అంచనా వేయగలను అని తెలియడం లేదా అన్నాను . తెలంగాణలోనే కాదు ఆంధ్రలో కూడా ఇలానే ఉంటుంది అన్నాను . నన్నేం చేయమంటావు అని మళ్ళీ అడిగితే మీ ఇంట్లో అన్ని గదుల్లో ఆంధ్రజ్యోతి వేయించుకోండి abn ఛానల్ చూడండి అన్నాను … నేను బాధలో ఉంటే నీకు జోకులా అని సీరియస్ అయ్యారు . మీకు జోక్ అనిపించ వచ్చు కానీ నేను సీరియస్ గా చెబుతున్నాను . ఆ మీడియా మాత్రమే మిమ్ములను రక్షిస్తుంది . తెలంగాణ ఏర్పాటు , ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా పోవడం , 2019 లో ఆంధ్రాలో వచ్చే ఫలితాలు, చిన్న దెబ్బలు కాదు . వాటిని తట్టుకొని మానసికంగా నిలబడడం అనేది చిన్న విషయం కాదు .

ప్రత్యర్థి ఘన విజయం సాధించినా మరుసటి రోజు నుంచే టీడీపీని ఆకాశానికి ఎత్తడం మాములు విషయం కాదు . ఆ వార్తలు పత్రికల్లో ఛానల్ లో చూస్తే పరవాలేదు మళ్ళీ మనం వస్తాం , నిన్న అలా రిజల్ట్స్ వచ్చాయి కానీ ఈరోజు ఎన్నికలు జరిగినా మనం వస్తాం అనే ధైర్యం వస్తుంది . జోక్ అనుకుంటే మీ ఇష్టం కానీ పాత పరిచయంతో చెబుతున్నా మీరు మానసికంగా క్రుంగి పోకుండా ఆత్మ విశ్వాసంతో ఉండాలి అంటే ఆ మీడియానే చదవండి , వినండి మరో మీడియా వైపు వెళ్ళకండి అని నిజాయితిగా సలహా ఇచ్చాను .

ఐతే నేను సలహా ఇవ్వక పోయినా వాళ్ళు చేసే పని అదే అని నాకు తెలుసు . రాజకీయాల సంగతి ఎలా ఉన్నా … 175 లో 23 స్థానాలకే పరిమితం అయి దిక్కు తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్న పార్టీకి భుజం తట్టి, లేవండి, రేపటి రాజ్యం మీదే అని ఆత్మవిశ్వసాన్ని కలిగించడం మాములు విషయం కాదు .. వారిది మాములు సేవ కాదు . మోటివేషనల్ స్పీకర్లు , సైకాలజిస్ట్ లు తమ వద్దకు వచ్చిన వారికి మహా అయితే ఓ గంట సేపు కౌన్సిలింగ్ చేస్తారు . కానీ మీడియా మాత్రం ప్రతి రోజు , ప్రతి క్షణం, రోజుల తరబడి , ఏళ్ల తరబడి ఒక సమూహం మొత్తానికి కౌన్సిలింగ్ చేయడం మాములు విషయం కాదు . దానికి చాలా దమ్ముండాలి . .. నన్ను అపార్ధం చేసుకుంటారు కానీ ఎంతో మందికి నేను ఇలా సలహా ఇచ్చాను . మీ ఆరోగ్యం కోసం ఆ మీడియానే చూడండి మరో మీడియా చూడకండి అని ….

****

కుమార్ అని హిందీ మిలాప్ లో జర్నలిస్ట్ మిత్రుడు ఉండేవాడు . జీతం విషయంలో అసంతృప్తి … చాలా ఏళ్ల క్రితం ఓ రోజు సచివాలయంలో ఆంధ్రజ్యోతి ఢిల్లీకి వెళుతున్నా అని చెప్పాడు . నీ మెంటాలిటీకి అస్సలు సూట్ కాదు వద్దు అన్నాను . ఓ ఆరేడు నెలల తరువాత తిరిగి వచ్చాడు . అదే సచివాలయంలో ‘‘అన్నా అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు రాయమనేది ఒకటి, నా వల్ల కాదు అని వచ్చేశాను’’ అన్నాడు .

పది రూపాయలు పెట్టి షాప్ లో ఆ పేపర్ కొంటే … మూడు రూపాయలు ఎక్కువ ఇచ్చావు అని షాప్ వాడు సంతోషపడేవాడు . నీకు ఢిల్లీ వరకు వెళ్లాల్సిన శ్రమ తప్పి విషయం తెలిసేది కదా అన్నాను . ఏదైనా అనుభవం ఐతే కానీ తత్త్వం బోధపడదు … ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది … ఒకే పార్టీకి మీడియా ఉన్న ఆ రోజులే వేరు … నోట్ – ఆరోగ్యం కోసం ఆ మీడియాను చూడండి… అంతే కానీ, చూసింది నిజమే అనుకొని పందాలు కాసి దెబ్బ తినకండి ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions