Bharadwaja Rangavajhala…. బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఆత్రేయ గురించి ప్రచారమైనన్ని చలోక్తులు ఇంకెవరి గురించీ అయి ఉండవు. చక్రపాణి దీనికి కాస్త ఎగ్జెంప్షన్ కావచ్చు… ఆత్రేయ గురించి డీవీ నరసరాజు గారేమన్నారంటే …
మోదుకూరి జాన్సన్ : ఆత్రేయ గారూ …. నేనూ మీ పద్దతినే ఫాలో అవుతున్నానండీ … డబ్బిస్తేనే ఎవరికైనా ఏవైనా రాస్తున్నానండీ …
ఆత్రేయ : ఒరే అబ్బాయ్ … నేనా స్టేజ్ దాటి చాల్రోజులయ్యిందిరా … ఇప్పుడు డబ్బిచ్చినా రాయడం లేదు.
Ads
…….
రాసి ప్రేక్షకులనూ … రాయక నిర్మాతలనూ ఏడిపిస్తాడు ఆత్రేయ అని హరిపురుషోత్తమరావు అంటే … రాసేప్పుడు ఆత్రేయ ఎంత ఏడుస్తాడో ఎవడికి తెలుసని ఆత్రేయ గారి జవాబు.
……
ఓ నిర్మాత పాటలు రాయమని ఆత్రేయ గారికి హోటల్ చోళాలో రూమేశాట్ట. రోజులు గడుస్తున్నాయి… బిల్లు వాచిపోతోంది. గురూ గారు ఒక్క అక్షరం కూడా రాయలేదట. అయ్యా ఏమిటి పరిస్థితి అంటే … ఒరే … ఈ హోటలు పేరేమిటన్నావ్ చోళానా … అందుకే మన పెన్ను కదలడం లేదు అన్నారట ఆత్రేయ. అదేంటని తెల్లబోయాడు సదరు నిర్మాత
చోళులకీ పల్లవులకీ పడదు కదరా … అందుకే మనం పల్లవులు రాయలేకపోతున్నాం ఇక్కడ… ఏంట్రా ఇంత వరకు ఒక్క అక్షరం కూడా బయటకు రాలేదనుకుంటున్నా … ఇదా సంగతి అన్నారట ఆత్రేయ. ఆ నిర్మాత స్పృహ తప్పడం ఒక్కటే తరువాయి.
…………
సాక్షి సినిమాలో క్లైమాక్సులో వచ్చే చందమామా నిజం చూడకు పాటను ఆత్రేయతో రాయించుకోవాలనుకున్నారు బాపు రమణలు. వెళ్లి కలసి అయ్యా … ఇదిగో అడ్వాన్సు అని కొంత డబ్బు కూడా ముట్టచెప్పారు. ఆ పాట కోసం కొంత కాలం తిరిగారు. ఆత్రేయ గారు రేపు మాపు అంటూ వచ్చారు.
ఈ లోగా ఆ పాటను ఆరుద్రతో రాయించేసుకోవడం …సినిమా షూటింగు అయిపోవడం … రిలీజు అయిపోవడం కూడా జరిగిపోయాయి. ఓ రోజు అనుకోకుండా ఓ సినిమా కంపెనీ కార్యాలయంలో రమణ గారు ఆత్రేయ గారికి తారసపడ్డారట. ఏవయ్యా రవణా ఆ మధ్యేదో సినిమా తీస్తాననీ పాట రాయమనీ వచ్చావు. మళ్లీ కనిపించలేదే? అని నిలదీశారట ఆత్రేయ.
అయ్యా … ఆ పాట కోసం మీ చుట్టూ తిరగాల్సినంత తిరిగి వేరే వాళ్లతో పనికానిచ్చేశాంలెండి … సినిమా కూడా రిలీజైపోయిందన్నారట రమణగారు.
అయ్యో అలాగా … మరెలా? మీరు అడ్వాన్సు కూడా ఇచ్చారు… సరే, ఓ పనిచేద్దాం. తరువాత సినిమాకు రాసి చెల్లేద్దాంలే అన్నారట ఆత్రేయ అనునయింపుగా …
అక్కరలేదండీ … మీ పుణ్యాన మాకు ఆరుద్ర అలవాటయ్యారండీ … ఆయనతోనే రెండో సినిమా పాటలూ రాయించేసుకున్నామండీ అని విన్నవించుకున్నారట రమణగారు.
అలాగా …. అయితే మరి మీరు నాకిచ్చిన డబ్బు పరిస్థితేమిటి? అది తిరిగి ఇచ్చేయమంటావా? చెక్కా కాషా ? బ్లాకెంత వైటెంత అన్నారట ఆత్రేయ.
అయ్యా జరిగిందేదో జరిగిపోయింది ఇక ఆ విషయం మరచిపోండి అని అక్కడ నుంచీ నిష్క్రమించారట రమణ గారు.
……..
ఆత్రేయ దర్శకత్వం వహించిన వాగ్దానం సినిమా మీద రమణ గారి ఏక వాక్య సమీక్ష. ‘‘వాగ్దానం సినిమా విషయంలో రచయిత ఆత్రేయ దర్శకుడు ఆత్రేయకు ద్రోహం చేశాడు…’’
Share this Article