ఏమన్నా విశేషాలు ఉన్నాయా ? అని కాల్ చేస్తే… మా పిల్లలు బతుకమ్మ ఆట చూద్దాం అంటే కంట్రీ క్లబ్ కు తీసుకువచ్చాను అని అటు నుంచి సమాధానం వచ్చింది . ఇప్పుడు కాదు, దాదాపు రెండు దశాబ్దాల క్రితం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు …
చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఏఎం రాధాకృష్ణ ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా ఉండేవారు . ఇంటికి వెళ్లేటప్పుడు టీడీపీకి సంబంధించి ఏమన్నా వార్తలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం అలవాటు . 1987లో రిపోర్టర్ గా ఉద్యోగంలో చేరాక పండుగలు , పబ్బాలు అంటూ ఏమీ లేవు . అన్ని రోజులు దాదాపు ఒకేలా గడిచిపోయేవి .
95లో హైదరాబాద్ వచ్చాక వారాంతపు సెలవు తప్ప ఏదీ గుర్తుండేది కాదు . తెలంగాణ ఉద్యమం దాదాపు అప్పుడే ప్రారంభం అయింది . బతుకమ్మ పండుగ ఎలా ఉంటుందో చూపడానికి కంట్రీ క్లబ్ తమ క్లబ్ లో బతుకమ్మ ఆడించింది . ప్రాంతం ఏదైనా కావచ్చు , పండుగలు , ఆటలు అంటే పిల్లలకు ఇష్టం.
Ads
బతుకమ్మ ఆట చూపడానికి కంట్రీ క్లబ్ కు వచ్చాము అని రాధాకృష్ణ చెప్పిన తరువాత ఆలోచనలో పడిపోయాను . బాల్యం అంతా కవాడిగూడ , బోలక్ పూర్ , పద్మశాలి కాలనీల మధ్య గడిచిపోయింది . ఈ ప్రాంతాలు హుసేన్ సాగర్ కు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి . ఈ ప్రాంతాల్లో బాల్యంలో బతుకమ్మ సందడిగా ఆడేవారు . ఆ రోజుల్లో హుసేన్ సాగర్ ఇప్పటిలా ఉండేది కాదు . ఒకప్పుడు తాగునీటికి ఉపయోగించిన చెరువు . బట్టలు ఉతుక్కునే వారు , స్నానాలు చేయడం చూశాను .
బతుకమ్మ పండుగ రోజుల్లో హుసేన్ సాగర్ కళకళలాడేది . కవాడిగూడా , బోలక్ పూర్ వంటి ప్రాంతలు దగ్గరే కాబట్టి బతుకమ్మ ఆడి హుసేన్ సాగర్ లో బతుకమ్మ విడిచేవారు . అక్కాచెల్లెళ్ళతో చాలాసార్లు అలా వెళ్ళాను . ఏదో మంత్రం వేసి మాయం చేసినట్టుగా నగరంలో బతుకమ్మ మాయమైంది . గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ మొదటి నుంచి అలానే ఉన్నా నగరంలో మాయమైంది, అలాంటి బతుకమ్మను చూడాలి అంటే చివరకు కంట్రీ క్లబ్ కు వెళ్లాలా ? అనిపించింది …
స్వతంత్ర పోరాట కాలంలో తిలక్ గణపతి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించి స్వతంత్ర పోరాటం జరిపారు . తెలంగాణ ఉద్యమానికి దీనిని స్ఫూర్తిగా తీసుకున్నారు .
*****
కవిత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలకు తిరిగి పూర్వ వైభవం లభించింది . బడుగుల బతుకమ్మ అంటూ వామపక్ష భావాలు గలవారు పోటీగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు . పేరు ఏదైతేనేం బతుకమ్మ అంతటా మళ్ళీ కనిపించింది . గతంలో హైదరాబాద్ కాలనీల్లో బతుకమ్మ అంటే తెలియదు అన్నట్టు ఉండేవారు . తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పుడు కాలనీల్లో కూడా బతుకమ్మ కనిపిస్తోంది .
బతుకమ్మ చూడాలి అంటే హనుమకొండలోనే చూడాలి అనేవారు . ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు నగరంలోనూ బతుకమ్మ కనిపిస్తోంది .
ఉద్యమానికి బతుకమ్మను ఉపయోగించుకున్నప్పుడు ప్రత్యర్థుల రాజకీయం సహజమే . బతుకమ్మ తెలంగాణకు మాత్రమే చెందిన వేడుక కాదు, విజయవాడలో కూడా ఆడుతారు అంటూ కొందరి వాదన . ఇదిగో ఆధారాలు అని కొందరు వ్యాసాలు రాస్తే , లగడపాటి రాజ్ గోపాల్ విజయవాడలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు .
అప్పుడు టీడీపీలో నర్రా విజయలక్ష్మి అనే మహిళా నాయకురాలు ఉండేవారు . ‘‘లగడపాటి రాజ్ గోపాల్ అన్న బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారు వెళుతున్నాను’’ అంటూ మీడియా ముందు హడావుడి చేసి విజయవాడ వెళ్లారు . తెలంగాణ ఏర్పడిన తరువాత లగడపాటి అన్నగారు విజయలక్ష్మి చెల్లిని బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారో లేదో , చెల్లి వెళ్లారో లేదో తెలియదు . తెలంగాణ వచ్చాక విజయవాడలో లగడపాటి బతుకమ్మ వేడుకలు జరిపినట్టు వార్తలు అయితే రాలేదు .
****
తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక చంద్రబాబు , బాలకృష్ణలు కూడా బతుకమ్మ పూజ చేశారు . బోనం ఎత్తారు . ఐనా తెలంగాణ వచ్చింది .
ఉద్యమ కాలంలో ట్యాంక్ బండ్ పై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడాలని ఏర్పాట్లు చేస్తే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆడేందుకు వీలు లేదు అని ఆంక్షలు విధించింది . జాగృతి కోర్ట్ కు వెళ్లి అనుమతి తెచ్చింది . తెలంగాణ ఏర్పడిన తరువాత అదే ట్యాంక్ బండ్ పై అధికారికంగా ప్రభుత్వమే పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరిపింది . సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు ఆ వేడుకల్లో పాల్గొన్నారు .
***
స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు . బాబు విడుదలను కోరుతూ ట్యాంక్ బండ్ పై ఈ రోజు అదే టీడీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతున్నారు . సో, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . తిరుపతి వెంకన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల దేవుడే కాదు . ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ మొక్కుతారు . బతుకమ్మ అందరి పండుగ అనుకుంటే సంతోషమే .. అది గుజరాతీ పండుగ, ఇది బిహారీ పండుగ , ఇవి తెలంగాణ , ఆంధ్ర పండుగలు అని కాదు… ఎన్ని పండుగలు చేసుకునే వీలుంటే అన్ని చేసుకోవచ్చు, జీవితం పండుగ మయం అవుతుంది …. – బుద్దా మురళి
Share this Article