డాలర్ శేషాద్రి పేరు వినగానే వెంటనే ఓ సినిమా డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది… ‘‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు, చంటిగాడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు… లోకల్…’’ నిజంగా కూడా అంతే కదా… ఈవోలు, డిప్యూటీలు, చైర్మన్లు, ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు… కానీ తిరుమల గుడికి సంబంధించి శేషాద్రి ఓ చంటిగాడు టైపు… ఎప్పుడో లోయర్ గ్రేడ్ గుమస్తాగా మొదలై, ఏకంగా బొక్కసం ఇన్‌చార్జిగా ఎదిగేదాకా ఓ ప్రస్థానం… అప్పుడెప్పుడో రిటైరైనా సరే, నిన్న కన్నుమూసేవరకూ గుడిలో ‘చక్రధారి’ తనే… తమిళనాడు కంచి మూలాలున్న ఈయనది శ్రీవారి దగ్గర దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ కొలువు… వీవీఐపీల సేవ దగ్గర్నుంచి డాలర్ల స్కామ్ దాకా… తన మీద చాలా ఆరోపణలున్నయ్, విమర్శలున్నయ్… అవన్నీ గనుక నిజమైతే అంతకాలం శ్రీవారు తన సేవకు తన దగ్గరే ఎందుకు ఉంచుకున్నట్టు..? తనలో ఏదో తెలియని విశిష్టత ఉంది… శేషాద్రిని సగటు భక్తుడే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడేమో… ఏమో…!! చాలామంది చాలా రాశారు… ఎందుకో గానీ మిత్రుడు ………. Vaddadi Srinivasu………. తన ఫేస్‌బుక్ వాల్ మీద షేర్ చేసుకున్న పోస్టు ఇంట్రస్టింగుగా సాగింది… ఓసారి యథాతథంగా చదవండి…
శ్రీవారి సేవలో తరించిన డాలర్ శేషాద్రి
————————————————————-
“డాలర్ శేషాద్రి ఫ్రేమ్‌లో లేకుండా తిరుమలలో వీఐపీల ఫోటో తీయగలరా ?” అని 2004లో అప్పటి టిటిడి ఈవో అజయ్ కల్లం ప్రెస్ ఫోటోగ్రాఫర్లకు సరదాగా సవాల్ విసిరారు. ఆయన సరదాగా అన్నా సరే అది నిజం. డాలర్ శేషాద్రి లేకుండా తిరుమలలో వీఐపీల ఫోటో ఉండదు. రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రుల వరకూ ఎవరు వచ్చినా సరే పక్కన డాలర్ శేషాద్రి ఉండాల్సిందే. విదేశీ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు వచ్చినా సరే ఆయన ఉండాల్సిందే. తిరుమలలో అంతటా ఆయనే అన్నట్టుగా ఉండేది. ఆయనకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు … ఇలా ఐదారు భాషలు వచ్చు. కాబట్టీ ఏ వీఐపీ వచ్చినా సరే ఆలయ ప్రాశస్త్యం, కైంకర్యాల గురించి బాగా వివరించి చెప్పగలగడం కూడా ఆయనకు అదనపు అర్హత. ఓసారి ఢిల్లీ ఎయిర్ పోర్టులో డాలర్ శేషాద్రిని చూడగానే అప్పటి మధ్యప్రదేశ్ సీఎం దిగ్విజయ్ సింగ్ అంతమంది ఉండగానే డాలర్ శేషాద్రి కాళ్ళకు నమస్కారం చేశారు. ఆయన్ని చూస్తే తిరుమల శ్రీవారిని చూసినట్టే అన్నారు… అదీ డాలర్ శేషాద్రి ప్రాభవం.. అదే ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చింది.
Ads
తిరుమలలోని ఓ వర్గం అర్చక ప్రముఖులకు ఆయన పట్ల అసూయకు కారణమైంది కూడా అదే. ఆయన అసలు అర్చకుడే కాదు.. కానీ ఆయనకు ఎందుకు అంతటి ప్రాధాన్యం అనే ఎత్తిపొడుపులు కూడా అక్కడక్కడా వినిపించేవి… కొన్నిసార్లు ఆయన్ని టార్గెట్ చేస్తూ వివాదాలు, ఆరోపణలు వచ్చాయి. అవన్నీ అవాస్తవం అని తరువాత నిజం నిగ్గు తేలింది కూడా. వీటన్నింటికీ అతీతంగా డాలర్ శేషాద్రి తన పని తాను చేసుకుని పోయేవారు. చివరి క్షణాల వరకూ శ్రీవారి వద్ద ఉండటమే ఏకైక స్వార్థంగా… ఇతరత్రా ఎలాంటి స్వార్థ చింతనా లేకుండా తన పని తాను నిబద్ధతతో చేసుకుపోయారు.
తిరుమల లో శ్రీవారి ఆలయాల్లో నియమిత క్రమం ప్రకారం కైంకర్యాలు, నిత్య పూజలు, వేడుకలు, ఉత్సవాలు, బ్రహ్మొత్సవాలు. దేశ, విదేశాల్లో శ్రీవారి ఉత్సవాలు, కల్యాణాలు… అన్నీ ఆయన చేతుల మీదుగానే జరిగేవి.. డాలర్ శేషాద్రి ఉంటే చాలు… ఏ వేళకు ఏది జరగాలో అది కచ్చితంగా జరుగుతుంది అనే టీటీడీ చైర్మన్, ఈవోల నుంచి కింది స్థాయి అధికారుల వరకూ ఓ నమ్మకం ఉండేది… భద్రాచలంలో శ్రీ రామ నవమి వేడుకలు, విజయవాడలోని ఇంద్ర కీలాద్రి మీద దసరా ఉత్సవాలు .. ఇలా ఎక్కడైనా సరే టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలి అంటే డాలర్ శేషాద్రి ముందు ఉండాల్సిందే. రాష్ట్ర, దేశ రాజధానులో ముఖ్య మంత్రులు, ప్రధాన మంత్రులను వివిధ సందర్భాల్లో టీటీడీ తరపున ఆశీర్వదించాలి అంటే అర్చకులు, అధికారులను వెంట బెట్టుకుని డాలర్ శేషాద్రి రావాల్సిందే.. ఆయన వస్తేనే టీటీడీ వచ్చినట్టు. ఎందుకంటే డాలర్ శేషాద్రి టీటీడీకి బ్రాండ్ అంబాసిడర్ వంటి వారు మరి. ఎప్పుడు నిద్ర లేస్తారో… ఎప్పుడు తింటారో… ఎప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటారో… మళ్ళీ ఎప్పుడు నిద్రపోతారో కూడా తెలియనంతగా ఆయన చకచకా అన్నీ పనులు దగ్గరుండి చేయిస్తూ ఉండేవారు.
ఆయనకు అంత ఓపిక ఎక్కడ నుంచి వస్తుందో అనిపిస్తుంది. టీటీడీలో చిన్న గుమాస్తాగా 1978లో చేరి… పారుపత్తేదారు వరకూ వివిధ హోదాల్లో విధులు నిర్వహించి, స్వామివారి ఆభరణాల ఇంచార్జ్‌గా కూడా వ్యవహరించిన డాలర్ శేషాద్రి 2007 లో రిటైర్ అయినా సరే…. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అన్ని ప్రభుత్వాలూ ఓఎస్డీ హోదాలో ఆయన సేవలను టీటీడీలో కొనసాగించాయి. ఆయన లేకపోతే తిరుమలలో ఏమీ సరిగా జరగవా అంటే సమాధానం లేదు. ప్రత్యామ్నాయంగా మరొకర్ని టీటీడీ ఎందుకు తర్ఫీదు ఇచ్చి తయారు చేసుకో లేకపోయింది అంటే సూటిగా సమాధానం చెప్పలేం.. .అది టీటీడీ వైఫల్యం అయితే కావచ్చు… కానీ అందుకు డాలర్ శేషాద్రి మాత్రం బాధ్యుడు కారు కదా. ఇప్పుడు ఆయన లేరు. ఇక టీటీడీ మరొకర్ని చూసుకోవాలి. చూద్దాం… ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరో.. డాలర్ శేషాద్రి ఏకైక కోరికను మాత్రం ఆ శ్రీవారు తీర్చారు.. చివరి శ్వాస వరకూ తన సేవలో టీటీడీలో కొనసాగించారు.
((ఇక ఈ ఫోటో గురించి… 2007లో తిరుమల బ్రహ్మొత్సవాల్లో కల్పవృక్ష వాహన సేవ జరుగుతోంది.. ఆరు నెలల వయసున్న మా బాబు నందక్‌తో సహా మేము శ్రీవారి వాహన సేవలో పాల్గొన్నాం.. అప్పుడు డాలర్ శేషాద్రి మా బాబును అలా తన ఒంటి చేత్తో ఎత్తి శ్రీవారికి చూపించి ఆశీర్వాదం అందించారు. మేము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. అప్పటి మా ఫోటోగ్రాఫర్ మిత్రుడు రవి వెంటనే స్పందించి ఆ అపురూప ఘట్టాన్ని ఇలా ఫోటో తీసి మాకు తీపి జ్ఞాపకాన్ని మిగిల్చారు…))
Share this Article