మార్గదర్శి చిట్‌ఫండ్ కేసుల నేపథ్యంలో రామోజీరావు మీద చర్చ మళ్లీ సోషల్ మీడియాలో సాగుతోంది… నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్టు Naveen Peddada రాసిన ఒక పోస్టును ఆయన అనుమతి లేకుండానే పబ్లిష్ చేస్తున్నాను ఇక్కడ… మా ఇద్దరికీ ముఖపరిచయం కూడా లేదు, కానీ ఓ బంధం ఉంది… అది సహోదరం, సహృదయం… అప్పటి ఈనాడు చీఫ్ రిపోర్టర్, నా శ్రేయోభిలాషి అన్నమనేని శ్రీరామ్ వరంగల్ కేంద్రంగా పనిచేసేవారు… తనను హైదరాబాద్ జనరల్ బ్యూరో ఇన్‌చార్జిగా పంపిస్తూ, వరంగల్‌లో ఈ నవీన్‌ను వేశారు…
తను వరంగల్‌లో జాయినై, కొన్నాళ్లకే ఈనాడునే వదిలి వెళ్లిపోయారు… కారణం నాకు తెలియదు… అప్పటికి తను కూడా చీఫ్ రిపోర్టర్ అనుకుంటాను… అలాంటి బాగా ప్రాముఖ్యం ఉన్న సెంటర్‌లోకి, అంటే చీఫ్ రిపోర్టర్ స్థాయి సెంటర్‌లోకి నేను అడుగుపెట్టాను… నవీన్ ఖాళీ చేసిన కుర్చీలోకి అన్నమాట… స్టాఫ్ రిపోర్టర్‌గా అదే నాకు తొలి పోస్టింగ్… ఒక్కసారిగా ఈనాడు ప్రపంచం నావైపు విస్మయంగా చూసింది… ఎందుకంటే..? అప్పట్లో ఈనాడు జర్నలిజం స్కూల్, శిక్షణతో సంబంధం లేకుండా సంపాదక బృందంలో అడుగుపెట్టిన తొలి మనిషినీ, చివరి మనిషినీ నేనే అనుకుంటా… నేను రాసిన ఓ లేఖ చదివి, వెంటనే నన్ను సంపాదక బృందంలోకి తీసుకోవాలని రామోజీరావు ఆదేశించారు… అదీ విశేషమే…
కొన్నాళ్లు కరీంనగర్ ఎడిషన్‌లో ఎన్ఎంఆర్ ఉపసంపాదకుడిగా చేసిన నేను ఏకంగా ఓ చీఫ్ రిపోర్టర్ సెంటర్‌లోకి వచ్చాను… అదీ నా సొంత జిల్లా కేంద్రంలోకి… అదీ విశేషమే ఈనాడు కోణంలో… ఇలా నవీన్‌తో ఓ అవ్యక్త బంధం… తను రెండేళ్ల క్రితం రాసిన ఒక పోస్టును ముచ్చట పాఠకుల కోసం షేర్ చేస్తున్నాను… యథాతథంగా…
Ads
“ఈయన ఇదన్న మాట!”
11-3-2021
నా పేరు పెద్దాడ నవీన్. నేను రాజమండ్రిలో వుంటాను.
“రామోజీరావు – ఉన్నది ఉన్నట్టు” పుస్తకాన్ని రెండు సార్లు పూర్తిగా, అనేక సార్లు అక్కడక్కడా చదివాను. జవసత్వాలు ఉడుగుతున్న ఒక రాజుగారి కథ చదవడంలో ఏ మాత్రం విసుగురాలేదు.
ఈ పుస్తకం గురించి చర్చించడానికి నాకు యోగ్యత, కొంత సాధికారికత వున్నాయి. అదెలాగంటే నేను ట్రెయినీ సబ్ ఎడిటర్ మొదలు చీఫ్ రిపోర్టర్ వరకూ వేర్వేరు బాధ్యతలతో 22 సంవత్సరాలు ఈనాడులో పనిచేశాను. ఆ బాధ్యతలలో భాగంగానే రామోజిరావుగారితో ముఖాముఖి చర్చించిన సందర్భాలు అనేకం వున్నాయి.
నేను ట్రెయినిగా సబ్ ఎడిటర్ గా వున్నపుడు వాక్యంలో పదాల కూర్పు, అటూఇటూ మార్పు – వ్యక్తీకరణలో భావం-ధ్వని -దశాదిశలని ఎలా మారుస్తాయో నాకు అర్ధమయ్యేలా చేసిన సీనియర్లలో గోవిందరాజు చక్రధర్ గారు ముఖ్యులు
రచయితతో, కథానాయకుడితో ప్రత్యక్ష సంబంధం, వారితో పనిచేసిన అనుభవం నా యోగ్యత, సాధికారికత అనుకుంటున్నాను.
22 ఏళ్ళు ఈనాడులో మరో 8 ఏళ్ళు జెమిని / తేజ న్యూస్ టివిలో పూర్తికాలపు జర్నలిస్టుగా పనిచేసి వున్న నేను ఇపుడు,- రెమ్యునరేషన్ ఇవ్వలేని చిన్న పత్రికలకు, ఒకటి రెండు వెబ్ సైట్లకు వారు అడిగినపుడు రాస్తున్నాను. ఒక వైద్య, వైద్య విద్యల సంస్ధకు కంటెంట్ రైటర్ గా జీతంతో పనిచేస్తున్నాను.
నేను పుస్తక సమీక్షకుడినో, విమర్శకుడినో, పరిచయకర్తనో కాదు. కేవలం పాఠకుడినే!
తెలుగు జర్నలిజాన్ని మలుపుతిప్పి తెలుగు ప్రజల గుండె చప్పుడైన ఈనాడుకి కాని ఆ గ్రూపు సంస్ధల అధిపతి రామోజీరావు గారికి కాని గత వైభవం ఉన్నంత ఉజ్వలంగా ఉన్నతంగా ఇప్పటి పరిస్ధితి లేదు.
పైపైకి పెరిగి, నిలకడగా నడచి, భారమైన అడుగుల వేసే పరిణామ క్రమంలో వెలుగుతగ్గిన దశ అంత ఆసక్తిగా వుండదు.
వెలుగు తగ్గిన అని ఎందుకు అంటున్నానంటే, నాతరం వాళ్ళకి రామోజి రావుగారి మీద వున్న ఆదరం అభిమానం గౌరవం నా కొడుకుల తరంలో లేవు. విజువల్ మీడియా, సోషల్ మీడియా విస్తరణ ఇందుకు స్థూలంగా చెప్పుకోగల కారణం. ఆయనకు పాత్రికేయం ద్వారా సంక్రమించిన పలుకుబడి కాలక్రమంలో వ్యాపార రాజ్యం విస్తరణకు మళ్ళడం వల్ల ప్రభా, ప్రాభవాలు తగ్గిపోవడం అనూహ్యమో ఆశ్చర్యమో కాదు!
అంటే గ్రాఫ్ పడిపోతున్న ఒక సహజ పరిణామ దశలో రామోజీరావు గారిపై చక్రధర్ గారు పుస్తకం రాసి వెలువరించడం, అంతకుమించి దీన్ని ఒక రిఫరెన్స్ గ్రంథంగా రూపొందించడం అసాధారం, సాహసం!
ఒక్క పదమైనా తొలగించడానికి లేదా అదనంగా చేర్చడానికి వీలుకుదరనంత చిక్కటి దట్టింపుతో అతిసరళమైన చిన్నచిన్న వాక్యాలతో చక్రధర్ గారు రామోజీరావుగారి జీవితాన్ని అనితరసాధ్యమన్నట్టు ఆవిష్కరించారు.
మిల్లీగ్రాముల్లో కూడా తేడాలేదన్నంత ధర్మంగా కధానాయకుడి మంచీ చెడులను చక్రధర్ గారు సున్నితపు త్రాసులో తూకం వేసి చూపించారు
2
రైటర్, జర్నలిస్ట్, ఎడిటర్ బాధ్యతలను ఏకకాలంలో గోవిందరాజు చక్రధర్ గారు నిర్వహించడం వల్లే రామోజీరావుగారి జీవన చిత్రణలో జీవం వుంది. ప్రజెంటేషన్ లో, విషయ విభజనలో, వాక్యం నుంచి విషయం వరకూ పదాల కూర్పులో, చిన్న పదాలతో కథనం రాసే పద్ధతిలో అనేక పాఠాలు నేర్పించే ఈ పుస్తకాన్ని ముఖ్యంగా జర్నలిస్టులు కాగోరినవారు, జర్నలిజం విద్యార్థులు, జర్నలిస్టులు తప్పక చదవవలసిందే!
3
రామోజీరావు గారిపట్ల నా అవగాహనను ప్రమాణీకరించుకోడానికి, స్ధిరపరచుకోడానికి #ఉన్నదిఉన్నట్టు చెప్పిన Chakradhar Govindaraju గారి పుస్తకం నాకు విశేషంగా దోహదపడింది. డిగ్రీ రిజల్ట్స్ కూడా రాకముందే నేను ఈనాడులో చేరాను. రామోజిరావుగారి మాటలు, సంభాషణలు అపుడపుడూ గగుర్పాటు కలిగించేవి. అది సేనను నడిపించే సేనాని లక్షణం.
అనుభవాలతో వయసుతో కాస్త అవగాహన పెరిగాక, రామోజీ గారు ఒక సజ్జనుడైన మోతుబరి అనిపించింది. తిక్కరేగినపుడు మోతుబరుల లోపలి స్వభావం బయటపడుతుంది. దాన్ని కవరప్ చేసుకునే వివేకాన్ని – తిక్కనుంచి కుదుటపడ్డక మోతుబరులు చూపిస్తూ వుంటారు. అలోగా మోతుబరుల సంస్ధలపై ఆధారపడిన ఉద్యోగుల జీవితాల్లో కల్లోలాలు రేగుతాయి. ఈనాడు గ్రూపులోనూ ఇదే అనేకసార్లు జరిగింది.
మోతుబరుల్లో మంచి లక్షణాలకు సూత్రబద్ధత వుండదు. ఆదర్శభావాలనుంచి వచ్చే మంచి పనులకు పేరు వస్తూంది. అవసరం తీరాకో కాళ్ళులాగాకో సారాయి ఉద్యమం లాగే ఆదర్శాలూ అటకఎక్కేస్తాయి. ఇందుకు రామోజీ గారు అతీతులు కాదు. అయితే పట్టుదల, నిజాయితీగా ఓర్పూ సహనాలతో శ్రమించడం, వంటి నిబద్ధతలు అయన్ని అదర్శప్రాయుడిగా, స్పూర్తివంతంగా నిలబెట్టాయి.
సరళీకృత ఆర్ధిక విధానాలు, క్షేత్ర స్థాయిలో వాటి ప్రభావాలు, ప్రమేయాలలపై అనేక కథనాలు రాసిన మొదటి తెలుగు జర్నలిస్టుని నేనే. రామోజీగారు విజయవాడ వచ్చిన ప్రతీసారీ లిబరలైజేషన్ మీదా ఫీల్డ్ లెవెల్ ఇంప్లికేషన్స్ మీదా నన్ను పిలిచి మాట్లాడే వారు. తెలుసుకునేవారు.
“ఇతనికి (రామోజీగారు) ఒక ఐడియాలజీలేదు కనీసం సూత్రబద్ధత కూడా లేదు. ఇప్పటికైతే మంచివాడే. అకాశం వచ్చినపుడు, వత్తిడి వచ్చినపుడు ఆ మంచితనం వుండదు. అవకాశవాదమో, అవసరాన్ని తీర్చుకోవడమో అయిపోతుంది. చూస్తూ వుండు పదిపదిహేనేళ్ళ తరువాత ఈనాడు నుంచి పదునైన ఎడిటోరియల్స్ వుండవు” అని 92/93 సంవత్సరాల్లో గ్లోబలైజేషన్ గురించి ఇన్ ఫార్మల్ మాటల్లో ఒక విద్యావంతుడైన ఒక రాజకీయవేత్త నాతో అన్నారు. (ఆయన ఇప్పటికీ ఏక్టివ్ గా వున్నారు. మావి ఇన్ ఫార్మల్ సంభాషణలైనందువల్ల, ఆయన అనుమతి తీసుకోకపోవడం వల్లా ఆయన పేరు బయటపెట్టడం లేదు)
24 గంటలూ మనం కూడా టివి ప్రోగ్రాములు పెట్టేద్దాం సార్ అన్నపుడు “ఏమయ్యా మనుషుల విశ్రాంతి సమయాల్ని కూడా లాగేసుకోవాలంటావా అని మోతుబరి రామోజీ గారు ప్రశ్నించారు. కొద్దికాలానికే 24 గంటలూ టివి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అపుడు కార్పొరేట్ రామోజీ గారి కామెంట్ “ టైమ్ ఈజ్ మనీ, నిరంతర విస్తరణ కోసం మహాసంస్ధలో అనుకోని ఖర్చుల కోసం సంపాదిస్తూనే వుండాలి”
(నాతో సహా) ప్రతి తండ్రీ దృతరాష్ట్రుడే! రామోజీ సంస్ధ భాగస్వాములతో విబేధాలు వైరుధ్యాలకు చాలాచోట్ల దృతరాష్ట్ర పాత్రే కారణమౌతుంది.
“ఉన్నది ఉన్నట్టు” చదివాక రామోజీ గారిమీద కొత్తగా కోపం రాదు. వున్న అభిమానం పోదు.
“ఈయన ఇదన్న మాట” అని ఓ అవగాహన ఏర్పడుతుంది. రామోజీ రాజ్యం ఎలా రూపాంతరమౌతుంది అనే అలోచన వస్తూంది!
మోతుబరి అలవాట్ల నుంచి కార్పొరేట్ స్వభావాన్ని ధరించి, సాగించిన ప్రయాణంలో సొంత అస్ధిత్వమే మారిపోయిన ఒక ప్రభావవంతమైన విశిష్ట వ్యక్తిగా రామోజిరావుగారు “ఉన్నది ఉన్నట్టు” చదివాక నాకు కనబుతున్నారు.
రామోజీ గారిది ఎంత బలమైన ప్రభావమో
కథలో ఎక్కడా ఏమాత్రం కనిపించకుండా కథ నడిపించిన గోవిందరాజు చక్రధర్ గారి రచనా పటిమ కూడా అంతే ప్రతిభావంతమైనది, ప్రభావవంతమైనది – పెద్దాడ నవీన్, రాజమండ్రి 11-3-2021
గమనిక : “రామోజీరావు ఉన్నది ఉన్నట్టు” చదివాక నాకు కలిగిన ఆలోచనలు, పటిష్టపడిన అభిప్రాయాలు మాత్రమే ఇందులో రాశాను. నెలల తరబడి ప్రయాసలతో చక్రధర్ గారు రాసిన పుస్తకంలో ఏ భాగాన్ని నా వ్యాసంలో పొందుపరచలేదు. కోట్ చేయలేదు.
మరొక మాట : “చిన్న ఉత్తరం రాసే తీరిక లేక ఇంత పెద్ద ఉత్తరం రాయవలసి వచ్చింది” అని రచయిత, చిత్రకారుడు, తాత్వికుడు, సంజీవ్ దేవ్ ఎవరికో ఒక ప్రత్యుత్తరంలో రాశారు. క్లుప్తత చేతకాకపోవడం ఎంత ఇబ్బందికరమో ఈ వ్యాసం ద్వారా (కూడా) అనుభవపూర్వకంగా చూస్తున్న పాఠకులు నన్ను మన్నించాలని కోరుతున్నాను
ఉపసంహారం :
నాకు జీతాన్ని, 22 ఏళ్ళు జీవితాన్ని ఇచ్చిన సంస్ధ ఈనాడు సారధి రామోజిగారిపట్ల నాకు ఎప్పటికీ కృతజ్ఞతా భావం వుంటుంది. అదే సమయంలో ఆయన ప్రతీ చేతకూ నా బేషరతు మద్ధతు వుంటుందని కాదు. అలాగని రంధ్రాన్వేషణతో ఆయన ప్రతీ పనిని విమర్శిస్తానని కూడా కాదు. రామోజి గారి పట్ల నాకు కృతజ్ఞత, గౌరవమూ, మర్యాద, విమర్శ, ప్రశంస… అన్నీ వున్నాయి. ఇంతటి భిన్నత్వాన్ని దేనికి అదేగా చూడలేకపోతే, చూపించకపోతే రామోజి సంస్ధ నుంచి, చక్రధర్ గారి వంటి సీనియర్ల నుంచి నేను నేర్చుకున్న జర్నలిజానికి అర్ధమే లేదు – నవీన్
Share this Article