Sai Vamshi……. * నేను తీసిన ‘గులాబీ టాకీస్’ సినిమా చివర్లో ఒక టీవీ మీద కుక్క కూర్చుని ఉంటుంది. ఆ కుక్క దేనికి సంకేతం అని కొందరు అడిగారు. “కుక్క కుక్కకే సంకేతం” అని చెప్పాను. మరేదో సూచించడానికి నేను కుక్కని సింబల్‌గా పెట్టానని వాళ్ల ఊహ. అలాంటి లెక్కలు వేసుకుని సినిమా చూస్తే ఎలా? అందుకే “For the God Sake, Please don’t read Cinema. Watch it” అని నా అసిస్టెంట్లకు, ఔత్సాహిక దర్శకులకు చెప్తూ ఉంటాను.
* పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం నా జీవితానికి మలుపు. అప్పటిదాకా జానపద, పౌరాణిక సినిమాలు చూసిన నాకు అక్కడికి వెళ్లిన మొదటివారంలోనే Bicycle Thieves, Wages of Fear, Battleship Potemkin, Roshoman లాంటి ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు చూపించారు.
* Film Making తెలియాలంటే Film Analysis తెలియడం అవసరం. పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో రోజూ ఒక సినిమా చూపించి, దాని గురించి చర్చించమనేవాళ్లు. సినిమా ఎలా ఉంది? అందులో నచ్చిన, నచ్చని అంశాలు ఏమిటి? అది ఎందుకు గొప్ప సినిమా! ఎందుకు సాదాసీదా సినిమా అనేవి ఎవరికివారు పరిశోధించే స్పేస్ ఆ చర్చలు విద్యార్థులకు ఇస్తాయి.
* నేను ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన మూడో రోజు Wages of Fear సినిమా చూపించారు. అదొక గొప్ప సినిమా అంటూ ఉంటే, నేను నా వాదన వినిపించాను. ‘సినిమా మొదటి భాగం ఒకలా, రెండో భాగం మరోలా ఉంది. అదెలా గొప్ప సినిమా అవుతుంది’ అని అడిగాను. మా ప్రొఫెసర్ సతీష్ బహదూర్. ఆయన నన్ను తిట్టలేదు. ‘You has a Point’ అని మెచ్చుకున్నారు.
* నా సినిమా కథలన్నీ కన్నడ సాహిత్యం నుంచి తీసుకున్నవే! ఏదైనా ఒక కథ నా మనసుకు నచ్చితే అందులో Cinematic Possibilities ఏమున్నాయో చూస్తాను. నేను చూసే మరో ముఖ్యమైన విషయం కథలోని Dramatic Essence. సినిమాలో Dramatic Thread లేకుండా జనాన్ని కూర్చోబెట్టడం సాధ్యపడదు. అది లేని కథలు, నవలలు గొప్పవని అంటాను కానీ వాటిని సినిమాగా తీయను.
* ప్రముఖ రచయిత యు.ఆర్.అనంతమూర్తి గారి కథ ఆధారంగా ‘ఘటశ్రాద్ధ’ అనే సినిమా తీశాను. అది నా తొలి సినిమా. సినిమా చూసిన ఆయన “నీ సినిమా నాకు నచ్చిందయ్యా! ఎందుకంటే నా కథలాగా లేదు” అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. “నేను రాసింది రాసినట్టే నువ్వు రెండు గంటల సినిమా తీసి లాభం ఏంటి? అరగంటలో అయిపోయే కథే చదవొచ్చు కదా? నా కథలో నేను చెప్పని, చెప్పలేనివి నీ సినిమా ద్వారా చూపిస్తేనే నా కథకు పరిపూర్ణత” అన్నారు.
* రచయిత రాసింది రాసినట్లు సినిమా తీయడం నా పద్ధతి కాదు. ఆ రచనకు సమాంతరంగా నాదైన మరో వాదన చేయడం నాకిష్టం. నా పునర్వాఖ్యానం లేకుండా ఉన్నదున్నట్లు సినిమా తీయను. షేక్స్‌పియర్ రాసిన Macbeth ఆధారంగా Akira Kurasowa జపనీస్‌లో ‘Throne of Blood’ సినిమా తీశారు. మూలకథను మించి ఆయన intervention అందులో ఉంటుంది.
* సత్యజిత్ రే, మృణాల్‌సేన్, ఆదూర్ గోపాలకృష్ణన్.. భారతదేశంలో నాకు నచ్చిన సినీ దర్శకులు వీరు. అంతర్జాతీయ స్థాయిలో Yasujirō Ozu, Akira Kurosawa, Michelangelo Antonioni, Ingmar Bergman లాంటి వారు చాలా ఇష్టం.
* Films can question the Society. ఎవరో ఒకదాన్ని మూఢనమ్మకం అనగానే సినిమా దర్శకుడు దాన్ని నమ్మి అదే తన సినిమాలో పెట్టాలా? ఫలానా పని Development Module అనగానే తన సినిమాల్లో అదే చూపించాలా? దర్శకుడికి ప్రశ్నించి, శోధించే గుణం ఉండటం అవసరం. సమాజంలోని నమ్మకాల్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించినప్పుడే కొత్త కథలు పుడతాయి.
* Taste of the People was Cultivated. మనం చిన్నప్పటి నుంచి సినిమా సంగీతం కాకుండా కర్ణాటక సంగీతం మాత్రమే విని పెరిగితే, అది మాత్రమే సంగీతమన్న భావన మనలో నాటుకుపోతుంది. సినిమా కూడా అంతే! సినిమా అంటే Entertainment, Heroism, Fantasy అని జనానికి బాగా అలవాటు చేశాక, వారి చూపు వాస్తవిక సినిమా వైపు తక్కువగా పడుతుంది.
(కన్నడ సినీరంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసరవల్లి వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాల అనువాదం..)
** గిరీష్ కాసరవల్లి 14 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న దిగ్దర్శకుడు. ఇప్పటికి 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘తబరన కథె, తాయి సాహెబా, ద్వీప, నాయి నెరళు, హసీనా’ లాంటి ప్రముఖ కన్నడ చిత్రాలు ఆయన దర్శకత్వంలో తెరకెక్కినవే! ఆయన సినిమాలు అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పురస్కారాలు అందుకున్నాయి…
Share this Article